సాక్షి, విజయవాడ : ప్రపంచస్థాయి నిర్మాణాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇకనైనా చంద్రబాబు ఊహాలోకం నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, సినిమా సెట్టింగ్స్, విహార యాత్రలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘ అసెంబ్లీ, హైకోర్టు డిజైన్‌లు ఖరారు అవుతున్నాయని మంత్రి నారాయణ ప్రకటించడం సంతోషం. ఈ నిర్మాణాలు గ్రాఫిక్స్‌పై ఉండాలని మాత్రం కోరుకోవడం లేదు. ప్రధానమంత్రిని తీసుకువచ్చి, శంఖుస్థాపన చేయించిన ప్రాంతంలో ఇప్పుడు మట్టికుప్ప మాత్రమే ఉంది. దర్శకుడు రాజమౌళిని తీసుకువచ్చారు. ఏపీలో ఏ ఇంజనీర్ మీకు నచ్చలేదా?. రాజమౌళి, స్పిల్ బర్గ్‌ల సలహాలు తీసుకున్నా ఫరవాలేదు. కానీ రాజధానిని సినిమా చేయకండి. వాస్తవిక చర్యలు చేపట్టండి. లేకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవం అపహాస్యం పాలవుతుంది.
ఓ వైపు ఆర్థికమంత్రి జీతాలు ఇవ్వలేక పోతున్నామని చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ స్థాయి నిర్మాణాలు అంటూ సీఎం రోజుకో గ్రాఫిక్స్‌ను చూపిస్తున్నారు. 600 విదేశీ పర్యటనలు చేశారు. 23 దేశాలు తిరిగారు. 1300 రహస్య జీవోలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేశారు. ఏదీ ప్రపంచ స్థాయి రాజధాని?. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంను అటకెక్కించారు. పోలవంరపై నాకే పూర్తి అవగాహన లేదు. ఇక పవన్ కల్యాణ్‌కు ఏం తెలుస్తుందని సీఎం చెబుతున్నారు. అనుభవం లేని పవన్‌తో సీఎం చేస్తున్న తెర వెనుక మంతనాలు ఏమిటో వెల్లడించాలి. 2014-15లో 15 దేశాలు.. ప్రత్యేక విమానాల్లో చేసిన పర్యటనకు అయిన ఖర్చు ఎంత?. అనేక దేశాలు తిరిగి చివరకు రాజమౌళిని ఆశ్రయించారు. రాజధాని నిర్మాణపై ఇదేనా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి. సీఎం స్థానంలో ఓ సర్పంచ్ ఉన్నా... మూడేళ్లలో రాజధాని భవనాలు నిర్మించేవారు. సినిమా పిచ్చితో రాజధాని భవనాల నిర్మాణాలను గాలికి వదలకండి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఉసురు సీఎంకు తగులుతుంది. వచ్చేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే..మీరు కట్టలేకపోతే..ఇక్కడే మేం రాజధాని నిర్మిస్తాం.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment