న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కేసు విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా పడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ పరేఖ్ తన వాదనలు వినిపించారు. రాజధాని కోసం ఎంపిక చేసిన భూములు వ్యవసాయ యోగ్యమైనవని, ఆ భూముల్లో రాజధాని వద్దని జస్టిస్ శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని, నిపుణుల అభిప్రాయాలను కూడా చంద్రబాబు సర్కార్ పట్టించుకోకుండా అదే ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిందని సంజయ్ పరేఖ్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
కొండవీటి వాగుతో అమరావతికి భారీ ప్రమాదం పొంచి ఉందని, కృష్ణానదికి ఏ వరదలు వచ్చినా అమరావతికి ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చే నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. కాగా ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరణతో పాటు పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.