'చట్టంలోని హామీలను కేంద్రప్రభుత్వం పూర్తి చేయాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్ర నడిమధ్యలో ఉంచాలని నిర్ణయించి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'రాజధాని ప్రాంతం అందరికీ సమానదూరంలో ఉండాలని మొదటి నుంచి చెప్పుతున్నామని... రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పలేదన్నారు. విభజన చట్టంలోని వివిధ అంశాలను కేంద్రప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు.
ల్యాండ్ ఫూలింగ్కు ముందుకొస్తే... భూమి విలువ పెరుగుతుందని తాను ముందు నుంచి చెబుతున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా ల్యాండ్ ఫూలింగ్కు ముందుకు వచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఉక్కు సంకల్పంతో రాజధానిని పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాజధాని ప్రాంతంలో భూములు ఇష్టానుసారం చేతులు మారాయని ఆరోపించడంలో నిజం లేదని చంద్రబాబు స్పష్ట చేశారు. కొందరు బెదిరించి లాక్కున్నారని అంటున్నారని, బెదిరించి లాక్కుంటే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు భూములు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. 1954కు ముందున్న అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చని, ఆ తర్వాత ఉన్న అసైన్డ్ భూముల విషయంలో సమస్యలున్నాయని ఆయన వెల్లడించారు. భూములు లాక్కున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారికి రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.