భూ కుంభకోణంపై 9న రాష్ట్రవ్యాప్త ఆందోళన
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కుంటుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లకు సంబంధించి ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు ఆ పరంపరలో భాగమేనని, ఆధారాలు బయటకు వస్తున్న దశలో ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు.
మీడియాలో వస్తున్న కథనాలు నిజమో కాదో నిగ్గు తేల్చడానికి బదులు రాసిన వాళ్లపైన్నే కేసులు పెడతామని బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియాను బెదిరించడం తగదని పేర్కొన్నారు. పాలకుల అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తేనో, అనుకూల కథనాలు రాస్తేనో అవి మంచివి లేకుంటే ప్రగతి నిరోధకమైనవి అవుతాయా? అని నిలదీశారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో కొనుగోలు చేసిన వారిపై విచారణ జరిపించాలని, నిజనిజాలేమిటో బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా సేకరిస్తున్న భూ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుందని, ఛలో విజయవాడ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సంయమనం కోల్పోయి విపక్షంపై దాడికి దిగడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఎదురు దాడి మాని భూముల లావాదేవీలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.