ఉదయభాస్కర్కు ఘనస్వాగతం
అడ్డతీగల : విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై శనివారం విడుదలైన వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ఆదివారం తన స్వగ్రామమైన ఎల్లవరం వచ్చారు. రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్, నియోజకవర్గం పరిశీలకుడు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్ తదితరులు వెంట రాగా అనంత ఉదయ భాస్కర్ అడ్డతీగల మండలంలోకి ప్రవేశించగానే మహిళలు పూలమాలలతో ముంచెత్తి హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
గొంటువానిపాలెం, తిమ్మాపురం, బొంగరాల పాడు, నాయుడుపాకలు గ్రామాల్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ఉదయభాస్కర్ ముందుకు సాగారు. ఎల్లవరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ పార్టీని, కార్యకర్తలను దెబ్బతీయాలనే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఉదయభాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మానసికంగా కుంగిపోతుందని తనపై కేసులు పెట్టి అరెస్టు చేయించారన్నారు. పార్టీ మారితే వేధింపులు ఉండవు అంటున్నారు...
ప్రాణం ఉన్నంత వరకూ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ లోనే కొనసాగుతా అంటూ ఉద్వేగంగా అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు రాత్రింబగళ్లు కృషి చేసినందుకు వారు తనకు ఇచ్చిన బహుమతి తొమ్మిది రోజులు జైలు జీవితం అన్నారు. తనపై పెట్టిన కేసులను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహారమన్నారు. ప్రజాభిమానం ఉన్న నాయకుడిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.