Anaparti
-
అనపర్తిలో బాబు హైడ్రామా.. ఐజీ పాలరాజు కీలక వ్యాఖ్యలు
సాక్షి, పశ్చిమగోదావరి: అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కాగా, ఈ ఘటనపై భీమవరం ఐజీ పాలరాజు స్పందించారు. ఈ క్రమంలో ఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. అనపర్తిలో చంద్రబాబు పర్యటనలో స్థానిక నేతలు రోడ్డుపై సభ నిర్వహించడానికి వీలులేదని చెప్పాము. ర్యాలీగా వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. బహిరంగ సభకు అనుమతి లేదు. రెండు సభా స్థలాలు చూపించాము. స్థానిక నేతలు అనపర్తిలో సభ నిర్వహిస్తామని చెప్పారు. అనపర్తిలో యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపాము. అనుమతుల విషయంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనలకు విరుద్దంగా సభ జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు బస్సు అద్ధాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో చర్యలు తీసుకున్నాము. ఏ పార్టీ అయినా నిబంధనల ప్రకారం సభ నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేశారు. -
రాజకీయ ధురంధరుడు ఇకలేరు
అనపర్తి: నిస్వార్థ సేవకుడు, రాజకీయ ధురంధరుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు సత్తి వీర్రెడ్డి(81) ఇకలేరు. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన సత్తి వీర్రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. వీర్రెడ్డి రామవరం సొసైటీ అధ్యక్షుడిగా, పొలమూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్‌గా, వైఎస్సార్ సీపీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన భార్య రామవరం గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. పెద్దకుమారుడు వైజాగ్‌లో గౌతమి వ్యాపార సంస్థల అధినేతగా, చిన కుమారుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఈయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం ఆయన స్వగ్రామమైన రామవరం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అభిమానులు తుది వీడ్కోలు పలికారు. అందరితో ఆప్యాయంగా ఉండే వీర్రెడ్డి ఇక లేరన్న విషయం ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురి సంతాపం.. వీర్రెడ్డి మృతికి ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు వీర్రెడ్డి కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించి సానుభూతి తెలిపారు. మంచి మిత్రుడిని కోల్పోయా... రాజకీయాల్లో నీతి, నిజాయితీగా మెలుగుతూ పార్టీకి, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన మిత్రుడు వీర్రెడ్డిని కోల్పోవడం తనకు అత్యంత బాధాకరమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కన్నీటి పర్యంతమయ్యారు. వీర్రెడ్డి మరణ వార్త విని గురువారం ఉదయం రామవరం చేరుకున్నారు. ఆయన వీర్రెడ్డి భౌతికకాయంపై పూలమాల వేసి, వైఎస్సార్ సీపీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ ధురంధరుడు, రాయవరం మునసుబు స్ఫూర్తితో ఆయన శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వీర్రెడ్డితో తనకు గల సాన్నిహిత్యాన్ని బోస్ గుర్తు చేసుకున్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వీర్రెడ్డి పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేశారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం బోస్‌తోపాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ..
⇒ శ్రీనగర్ అల్లర్లలో చిక్కుకున్న అనపర్తివాసులు ⇒ వారం రోజులు భయూందోళనల గుప్పిట్లోనే.. ⇒ ఎట్టకేలకు గురువారం స్వస్థలానికి చేరిక ⇒ అమరనాథుడి కటాక్షమే కాపాడిందని ఉద్వేగం అనపర్తి(బిక్కవోలు): తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని, అమరనాథుడి కరుణా కటాక్షాల వల్లే తామంతా బతికి బయటపడ్డామని అనపర్తి నుంచి అమరనాథ్ యాత్రకు వెళ్లి, శ్రీనగర్ అల్లర్లలో, కర్ఫ్యూలో చిక్కుకున్న భక్తులు ఉద్వేగభరితంగా చెప్పారు. గురువారం రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో అనపర్తి చేరుకున్న వారికి బంధువులు,స్నేహితులు సాదరంగా స్వాగతం పలికారు. తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో వారంతా పరమానందభరితులయ్యూరు. కాగా సురక్షితంగా తిరిగి వచ్చిన వారు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ అనుభవాల్ని వివరించారు. అనపర్తికి చెందిన 17 మంది సభ్యులతో కూడిన బృందం జూన్ 30న పవిత్ర అమర్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్ళామని అనపర్తికి చెందిన సబ్బెళ్ళ త్రినాథరెడ్డి తెలిపారు.తనతో పాటు సబ్బెళ్ళ భామిరెడ్డి, సబ్బెళ్ళ పార్వతి, పడాల కళ్యాణ్‌రెడ్డి, పడాల ధనలక్ష్మి, చిర్ల లక్ష్మీతులసి,తేతలి బుల్లిగంగిరెడ్డి, తేతలి అనంతలక్ష్మి, నల్లమిల్లి పార్వతి, తేతలి గౌరీదేవి(బేబి), సందక అనిల్‌కుమార్, నల్లమిల్లి నాగిరెడ్డి, కె.కాంచన, నల్లమిల్లి రాజేశ్వేరి, తేతలి రామచంద్రరెడ్డి, తేతలి మణిలతో కూడిన బృందం 6న శ్రీనగర్ చేరుకున్నామన్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించడంతో అక్కడ చిక్కుకుపోయామన్నారు. శ్రీనగర్ చేరుకున్నది మొదలు కష్టాలు పడుతూనే యాత్ర కొనసాగించామని, 7వ తేదీన అమరనాథుడిని దర్శించుకోవలసి ఉండగా రెండు రోజుల పాటు కర్ఫ్యూ కారణంగా బస్సులోనే ఉండి పోవలసి వచ్చిందని చెప్పారు. సోమవారం కర్ఫ్యూ సడలించిన తరువాత స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా మరలా అల్లర్లు చెలరేగడంతో శ్రీనగర్ పట్టణ శివారులో బస్సును నిలిపి వేశారని, దీంతో తిరిగి రెండు రోజుల పాటు బస్సులోనే ఉండిపోవలసిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. వెంట తెచ్చుకున్న ఆహర పదార్థాలు, తాగునీరు కూడా అయిపోవడంతో భయాందోళనల మధ్య బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. మంగళవారం రాత్రి ఆందోళనకారులు బస్సుపై రాళ్లు రువ్వడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును వేగంగా నడిపి అందరినీ రక్షించాడని తెలిపారు. భద్రతా దళాల రక్షణతో బస్సును శ్రీనగర్ దాటించారని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారి సలహా మేరకు ఉదంపూర్ మీదుగా గురువారం తెల్లవారేసరికి ఢిల్లీ చేరుకున్నామన్నారు. అక్కడి నుంచి ముందస్తు ప్రణాళిక ప్రకారం విమానంలో హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం చేరుకున్నామని గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి అదే రోజు రాత్రికి అనపర్తి చేరుకున్నట్లు వారు తెలిపారు. ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. నిజంగా అమరనాథుడి దయ వల్లే మేమంతా బతికి బయటపడ్డా’మని వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. దేవుడే మా కుటుంబాన్ని రక్షించాడు కుటుంబ సమేతంగా అమరనాథ్ యాత్రకు వెళ్లాం. అక్కడ పరిస్థితి చూస్తే మరలా ఇంటికి వస్తామా అని అనుమానం కలిగింది. ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా ఇంటికి చేరుకున్నాం - సబ్బెళ్ళ పార్వతి, గృహిణి, అనపర్తి టీవీల్లో వీక్షించింది నిజంగా చూశాం ఉగ్రదాడుల గురించి టీవీలలో చూపిస్తుంటే సాధారణంగా పట్టించుకోం. కానీ దేవుడి దర్శనానికి వెళ్లిన మేము మా కళ్లారా అలాంటి దృశ్యాలు చూశాం. ఆ అనుభవం జీవితంలో మరిచిపోలేనిది. - నల్లమిల్లి రాజే శ్వరి, గృహిణి, అనపర్తి భద్రతా దళాల సహకారం మరువలేనిది భద్రతా దళాలు చేసిన సహకారం మరిచిపోలేనిది. వారి సహకారం లేకుంటే ఇంకా అక్కడే భయాందోళనల మధ్య ఉండేవాళ్ళం. అడుగడుగునా ప్రాణాలకు తెగించి యాత్రికులకందిస్తున్న సహాయం అభినందించదగినది. - తేతలి అనంతలక్ష్మి, గృహిణి, అనపర్తి స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్ ఇబ్బందుల్లో ఉన్న యాత్రికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా స్వచ్ఛంద సంస్థలు మాత్రం అడుగడుగునా సేవలందించారుు. నీరు, ఆహారం అందిస్తూ యాత్రికులకు అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నాయి. - తేతలి గౌరీదేవి(బేబి), గృహిణి, అనపర్తి -
‘అడుక్కోవడం’ అక్కడ పవిత్రమైన మొక్కు
అనపర్తి: సాధారణంగా అమ్మవారి జాతరలు రాత్రి జరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువు తీరి, కర్రి వంశీకుల ఆడపడుచుగా పూజలందుకునే సత్తెమ్మ తల్లి జాతర మాత్రం తరతరాల నుంచి పగటి వేళల్లో జరుగుతోంది. అంతేకాదు.. విలక్షణమైన మరో ఆనవాయితీని కూడా ఈ జాతర సందర్భంగా చూడవచ్చు. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలురు, ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా పురుషులు చిత్ర విచిత్ర వేషాలు వేసి బిచ్చమెత్తుతారు. కోరిన కోరికలు తీరితే అలా బిచ్చమెత్తుతామని మొక్కుకోవడం వారికి రివాజు. అలా సేకరించిన సొమ్మును, కానుకలను అమ్మవారి హుండీలో వేసి, మొక్కుబడులు తీర్చుకుంటారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ముగింపు సందర్భంగా బుధవారం కనిపించిన ‘యాచకులు కాని యాచకులు’ వీరు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి దంపతులు కూడా జోలె పట్టడం విశేషం. -
‘అడుక్కోవడం’ అక్కడ పవిత్రమైన మొక్కు
-
జగన్ దీక్షలను జయప్రదం చేయండి
అనపర్తి : ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టనున్న 48 గంటల దీక్షలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపు ఇచ్చారు. అనపర్తిలో మంగ ళవారం డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చేపట్టే పోరాటంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు దీక్షలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ దీక్షకు జిల్లావ్యాప్తంగా అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తణుకు తరలి రావాలని బోస్ కోరారు. అనపర్తి నియోజకవర్గం నుంచి వేలాదిమంది పార్టీ శ్రేణులు తరలేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బోస్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని కోరారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు సర్కార్.. ఏడాది కాలం తిరగకుండానే చంద్రబాబు సర్కార్ పూర్తిగా ప్రజావిశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండి పడ్డారు. అనపర్తిలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణ మాఫీలు అంటూ అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే రుణమాఫీల విషయంలో పగటి వేషాలు వేయడం విడ్డూరంగా ఉందని దుయ్యపట్టారు. రుణా మాఫీ ఆలోచనతో ఉన్న రైతులు అప్పులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం వడ్డీలు పెరిగి రుణభారం మోయలేనంతగా మారిందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ కరువయ్యిందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అనపర్తి నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనరాయణరెడ్డి, రాష్ట్ర రైతు నాయకుడు కొవ్వూరి త్రినాధరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడున్నరే ళ్లలో ‘పోలవరం’ పూర్తిచేస్తాం
అనపర్తి :ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్ట్‌ను మూడున్నరేళ్లలో పూర్తి చేసి అమలులోకి తీసుకు వస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన పెదపూడిలో రూ.5 కోట్ల 76 లక్షలతో నిర్మించిన పెదపూడి ఎత్తి పోతల పథకాన్ని మంత్రి ఉమామహేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ప్రారంభోత్సవ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే అదనంగా 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సుమా రు 542 గ్రామాలకు దాహార్తి తీరుతుం దని చెప్పారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలు గోదావరి డెల్టాల సాగునీటితో పంటలు పండుతున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్ర విభజనతో 7 మండలాల్లోని ముంపు గ్రామాలు తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉన్నాయని, ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యేటట్టు ఆర్డినెన్స్ జారీ చేయించారని తెలిపారు.అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరిక మేరకు చాగల్నాడు ఎత్తి పోతల పథకం, వెంకటనగర్ ఎత్తి పోతల పథకాల అభివృద్ధికి సుమారు రూ.9 కోట్ల 50 లక్షల నిధులు అవసరమవుతాయని, నిధులను మంజూరు చేయనున్నట్టు మంత్రి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనపర్తి, కొమరిపాలెం, కొంకుదురు గ్రామాల్లో పూర్తి దశకు చేరకుండా ఉన్న వంతెనల నిర్మాణాలను పూర్తి చేసేందు కు నిధులు మంజూరు చేయాలని కోరా రు. నల్ల కాలువపై తొస్సిపూడి లాకుల నుంచి శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు రెగ్యులేటర్ నిర్మించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి ఉమామహేశ్వరరావు స్పందిస్తూ రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు రైతులకు రుణ విముక్తి పత్రాలు, పలువురు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్లను మంత్రి ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్య క్రమంలో మండపేట, ముమ్మిడివరం, రాజానగరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, పెందుర్తి వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, ఏపీఎస్ఐడీసీ జేఎండీ వేంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్‌బాబు, గోదావరి డెల్టా సీఈ ఎస్. హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం మండపేట : పోలవరం పనులను వేగవంతం చేస్తున్నట్టు రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మండపేట వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. కార్యకర్తలను, నేతలను కలుసుకున్నారు. అనంతరం వారితో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అది పూర్తయితే రైతులకు సాగునీటికి, విద్యుత్‌కు కొరత ఉండదన్నారు. గోదావరి డెల్డాకు రెండో పంటకు నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నామని వివరించారు. మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల నీటిని గోదావరికి మళ్లించి రబీ పంట పూర్తయ్యే వరకు శివారు భూములకు సాగు నీరందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర వద్ద హైలెవల్‌గా కెనాల్ అభివృద్ధి చేసి నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. -
హలో...చంద్రబాబోయ్
అనపర్తి, న్యూస్‌లైన్ : అనపర్తి నియోజకవర్గ టీడీపీ టికెట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించాలని ఆయన వర్గీయులు, బిక్కవోలు మాజీ జెడ్పీటీసీ పడాల వెంకట రామారెడ్డి భార్య సునీతకు ఇవ్వాలని మరోవర్గం కోరుతున్నాయి. సీటు సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బాబు తమ నాయకుడికే టికెట్ ఇచ్చారంటూ రామకృష్ణారెడ్డి వర్గీయులు. కాదు బీ-ఫారం సునీతకే వస్తుందని వెంకట రామారెడ్డి వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ఆన్లైన్ సర్వేలో భాగంగా అభ్యర్థి పేరును సూచించాలంటూ ఫోన్లు వస్తుండడంపై జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనపర్తిలో బుధవారం రాత్రి ఒక వ్యక్తికి ఫోన్ వచ్చింది. మొబైల్ స్క్రీన్‌పై ఏ పేరూ డిస్ప్లే కాకపోవడంతో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. అవతలి వైపు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి గొంతు. ముందుగా నమస్కారం అన్నారు.. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు. అరే..మా అభ్యర్థిని మేమే నిర్ణయించే అవకాశం కల్పించారా అని ఆ వ్యక్తి తనలో తానే నవ్వుకున్నారు. అవతలి నుంచి బాబు గారు మాట్లాడుతూ మీకు నచ్చిన అభ్యర్థి ఎన్. రామకృష్ణారెడ్డి అయితే 1, పడాల సునీత అయితే 2 నొక్కాలని పదే పదే అడుగుతుండడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. 14001281999 నెంబర్ నుంచి వచ్చిన ఈ ఫోన్‌ను అసలు తానెందుకు ఎత్తానురా‘బాబూ’ అంటూ..అనపర్తి అభ్యర్థిని నేను నిర్ణయించడం ఏమిటని తల పట్టుకున్నాడాయన. నియోజక వర్గంలో ఈ విధమైన ఫోన్లు చాలామందికి వస్తున్నాయి. ఇప్పటికే రింగ్ టోన్లు, నెట్వర్క్ ప్లాన్ల గురించి చెప్పడానికి వివిధ టెలికాం సంస్థలు చేస్తున్న ఫోన్లతో సతమతమవుతుంటే.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు గారు ఫోన్ కాలేమిటి? అని నియోజకవర్గ ప్రజలు నవ్వుతున్నారు. అభ్యర్థులకు టికెట్ ఇచ్చే వ్యవహారంలో పార్టీ అధినేతగా నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే, ప్రజల సూచనలు మాత్రం ఏ మేర అమలు చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు.