మూడున్నరే ళ్లలో ‘పోలవరం’ పూర్తిచేస్తాం
అనపర్తి :ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్ట్‌ను మూడున్నరేళ్లలో పూర్తి చేసి అమలులోకి తీసుకు వస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన పెదపూడిలో రూ.5 కోట్ల 76 లక్షలతో నిర్మించిన పెదపూడి ఎత్తి పోతల పథకాన్ని మంత్రి ఉమామహేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ప్రారంభోత్సవ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే అదనంగా 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సుమా రు 542 గ్రామాలకు దాహార్తి తీరుతుం దని చెప్పారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలు గోదావరి డెల్టాల సాగునీటితో పంటలు పండుతున్నాయని మంత్రి వివరించారు.
రాష్ట్ర విభజనతో 7 మండలాల్లోని ముంపు గ్రామాలు తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉన్నాయని, ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యేటట్టు ఆర్డినెన్స్ జారీ చేయించారని తెలిపారు.అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరిక మేరకు చాగల్నాడు ఎత్తి పోతల పథకం, వెంకటనగర్ ఎత్తి పోతల పథకాల అభివృద్ధికి సుమారు రూ.9 కోట్ల 50 లక్షల నిధులు అవసరమవుతాయని, నిధులను మంజూరు చేయనున్నట్టు మంత్రి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనపర్తి, కొమరిపాలెం, కొంకుదురు గ్రామాల్లో పూర్తి దశకు చేరకుండా ఉన్న వంతెనల నిర్మాణాలను పూర్తి చేసేందు కు నిధులు మంజూరు చేయాలని కోరా రు.
నల్ల కాలువపై తొస్సిపూడి లాకుల నుంచి శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు రెగ్యులేటర్ నిర్మించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి ఉమామహేశ్వరరావు స్పందిస్తూ రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు రైతులకు రుణ విముక్తి పత్రాలు, పలువురు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్లను మంత్రి ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్య క్రమంలో మండపేట, ముమ్మిడివరం, రాజానగరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, పెందుర్తి వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, ఏపీఎస్‌ఐడీసీ జేఎండీ వేంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్‌బాబు, గోదావరి డెల్టా సీఈ ఎస్. హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం
మండపేట : పోలవరం పనులను వేగవంతం చేస్తున్నట్టు రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మండపేట వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. కార్యకర్తలను, నేతలను కలుసుకున్నారు. అనంతరం వారితో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అది పూర్తయితే రైతులకు సాగునీటికి, విద్యుత్‌కు కొరత ఉండదన్నారు. గోదావరి డెల్డాకు రెండో పంటకు నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నామని వివరించారు. మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల నీటిని గోదావరికి మళ్లించి రబీ పంట పూర్తయ్యే వరకు శివారు భూములకు సాగు నీరందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర వద్ద హైలెవల్‌గా కెనాల్ అభివృద్ధి చేసి నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.