‘పోలవరం’ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
అసెంబ్లీలో మంత్రి ఉమా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల కు పరిహారం చెల్లించడంలో పూర్తి న్యాయం చేస్తామని, ఎవరికీ అన్యాయం జరగనీయబోమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అసెంబ్లీలో శనివా రం ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, చిల్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రూ.1.50 లక్షల పరిహారం ప్రకటించగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవతా దృక్పథంతో రూ.7లక్షల నుంచి రూ.9లక్షల వరకూ పెంచిందన్నారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు వెళ్లి డ్యామ్‌సైట్‌లో గ్రామాలను ఖాళీ చేయవద్దంటూ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు.
చేగొండపల్లిలో నిర్వాసితులకు ప్రభుత్వం కొత్త వస్త్రాలు, స్వీట్లు ఇచ్చి శుక్రవారమే ఖాళీ చేయించినట్లు తెలిపారు. నిర్వాసితులైన పేద గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ వద్ద రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పని జరుగుతోందని, రామయ్యపేట, పైడిపాక గ్రామాలు ఖాళీ చేస్తే రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పని జరుగుతుందన్నారు. త్వరలోనే ఆయా గ్రామాల వారిని ఒప్పించి ఖాళీ చేయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఉద్ఘాటించారు. నిర్వాసిత గ్రామాల వారిని ఖాళీ చేయవద్దంటూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజుతోపాటు వామపక్షాల నేతలు కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.