
హలో...చంద్రబాబోయ్
అనపర్తి, న్యూస్‌లైన్ : అనపర్తి నియోజకవర్గ టీడీపీ టికెట్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించాలని ఆయన వర్గీయులు, బిక్కవోలు మాజీ జెడ్పీటీసీ పడాల వెంకట రామారెడ్డి భార్య సునీతకు ఇవ్వాలని మరోవర్గం కోరుతున్నాయి. సీటు సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బాబు తమ నాయకుడికే టికెట్ ఇచ్చారంటూ రామకృష్ణారెడ్డి వర్గీయులు. కాదు బీ-ఫారం సునీతకే వస్తుందని వెంకట రామారెడ్డి వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ఆన్‌లైన్ సర్వేలో భాగంగా అభ్యర్థి పేరును సూచించాలంటూ ఫోన్లు వస్తుండడంపై జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అనపర్తిలో బుధవారం రాత్రి ఒక వ్యక్తికి ఫోన్ వచ్చింది. మొబైల్ స్క్రీన్‌పై ఏ పేరూ డిస్‌ప్లే కాకపోవడంతో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. అవతలి వైపు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి గొంతు. ముందుగా నమస్కారం అన్నారు.. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు. అరే..మా అభ్యర్థిని మేమే నిర్ణయించే అవకాశం కల్పించారా అని ఆ వ్యక్తి తనలో తానే నవ్వుకున్నారు. అవతలి నుంచి బాబు గారు మాట్లాడుతూ మీకు నచ్చిన అభ్యర్థి ఎన్. రామకృష్ణారెడ్డి అయితే 1, పడాల సునీత అయితే 2 నొక్కాలని పదే పదే అడుగుతుండడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. 14001281999 నెంబర్ నుంచి వచ్చిన ఈ ఫోన్‌ను అసలు తానెందుకు ఎత్తానురా‘బాబూ’
అంటూ..అనపర్తి అభ్యర్థిని నేను నిర్ణయించడం ఏమిటని తల పట్టుకున్నాడాయన. నియోజక వర్గంలో ఈ విధమైన ఫోన్లు చాలామందికి వస్తున్నాయి. ఇప్పటికే రింగ్ టోన్లు, నెట్‌వర్క్ ప్లాన్‌ల గురించి చెప్పడానికి వివిధ టెలికాం సంస్థలు చేస్తున్న ఫోన్లతో సతమతమవుతుంటే.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు గారు ఫోన్ కాలేమిటి? అని నియోజకవర్గ ప్రజలు నవ్వుతున్నారు. అభ్యర్థులకు టికెట్ ఇచ్చే వ్యవహారంలో పార్టీ అధినేతగా నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే, ప్రజల సూచనలు మాత్రం ఏ మేర అమలు చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు.