ప్రత్యామ్నాయం మేమే..
‘ఆడ లేక మగ’ అన్న చందంగా తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఐదు దశాబ్దాలుగా అలవాటుగా మారిపోయింది. పాలిటిక్స్ తెలియని పిల్లోడిని అడిగినా జయలలిత లేదా కరుణానిధి సీఎం అని ఇట్టే చెబుతారు. ఉదయించే సూర్యునికి ఇక శాశ్వత గ్రహణమే, రెండాకులు ఇక శాశ్వతంగా చిరిగిపోయినట్లే అంటున్నారు పాట్టాలిమక్కల్ కట్చి(పీఎంకే) యువజన విభాగ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్.
రాజకీయాల్లో పదవుల కోసం ఆరాటపడే ఈరోజుల్లో వెత్తుక్కుంటూ వచ్చిన అవకాశాలను సైతం కాదన్న డాక్టర్ రాందాస్ తనయుడే ఈ అన్బుమణి. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు, మార్పును కోరుతున్నారు. ఇదిగో మేమున్నామని ముందుకొచ్చింది పీఎంకే. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ అంటున్నారు. ఈ సందర్భంగా సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
- సాక్షి ప్రతినిధి, చెన్నై
* హామీలు కాదు, విశ్లేషణలతో ప్రజలను ఒప్పించా
* లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకున్న డీఎంకే, అన్నాడీఎంకేలు నిషేధం విధిస్తాయా?
* రైతు సంక్షేమంలో వైఎస్ఆర్ పాలనే నాకు ఆదర్శం
* పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ రాందాస్
సాక్షి: రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధే పొత్తుల కోసం వెంపర్లాడిన తరుణంలో మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధం కావడంలోని మీ ధైర్యం?
అన్బుమణి: ఈ ప్రశ్నకు కొంచెం పెద్ద జవాబే చెప్పాల్సి ఉంటుంది. అన్నిపార్టీలు ఎన్నికలు సమీపించిన తరువాత ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. నేను ఏడాది క్రితమే క్యాంపెయిన్ ప్రారంభించా. సీఎం అభ్యర్థిగానే ప్రజల్లోకి వెళ్లాను. దాదాపుగా రాష్ట్రమంతా చుట్టేశాను. 22 జిల్లాల్లో లిక్కర్ వ్యతిరేక ప్రచారాలు చేసినపుడు మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడమేకాదు పీఎంకేలో చేరిపోయారు. ఏడు రోజులు, ఏడు సిటీలు, ఏడు సమస్యలు అంటూ సరికొత్త విధానంతో ప్రజలవద్దకు వెళ్లాను. ఒక్కో సిటీలో నాలుగు గంటలపాటు ప్రజలతో పరస్పర సంభాషణ సాగిం చాను. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్ల ప్రజలు మార్పు కోరుతున్నట్లు స్పష్టమైంది. డీఎంకే లేదా అన్నాడీఎంకేలు యాభై ఏళ్లుగా సాగించిన పాలనతో ప్రజలు విసిగిపోయినట్లు స్పష్టంగా గోచరించింది. ప్రజలు మార్పుకోరుకున్నపుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో డిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాలే ఉదాహరణ.
సాక్షి: పార్టీకి మరింత బలం చేకూరేలా పొత్తులకోసం ఎందుకు ప్రయత్నించలేదు.?
అన్బుమణి: ఆ తప్పు జీవితంలో చేయం. రెండుసార్లు ఆ తప్పుచేశాం...ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివచ్చింది. ఒకసారి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, మరోసారి భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో ఎన్డీఏతో పొత్తుపెట్టుకుని జీవితంలో పెద్ద పొరపాటు చేశాము. చేసిన తప్పుకు ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాము. కేడర్ ఒత్తిడి మేరకు అలాంటి నిర్ణయం తీసుకవాల్సి వచ్చింది. ఆ తప్పు చేయకుంటే ఈరోజు రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉండేది.
సాక్షి: అన్నాడీఎంకే, డీఎంకేల కంటే మెరుగైన పాలనను మీరు ఇస్తారని ఓటర్లను ఎలా నమ్మిస్తారు ?
అన్బుమణి: ఆదర్శమైన పాలనకు ఆరు సూత్రాలు. ఆదర్శవంతమైన పాలనకు అరుసూత్రాలు సిద్ధం చేసుకుని వాటిని ఎలా అమలు చేయగలుతామో ప్రజలకు వివరించాను. లిక్కర్ , అవినీతి నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు ...ఈ ఆరు సూత్రాలతో ఆదర్శమైన పాలన అందిస్తాము. కేవలం చెప్పడం కాదు, ఎలా సాధించగలుగుతామో ప్రజలకు సశాస్త్రీయంగా వివరించాను. ప్రభుత్వ లావాదేవీలన్నీ కంప్యూటీకరణ చేస్తాం. పేపర్ అనేది లేకుండా ఈ గవర్నర్సెను ప్రవేశపెడతాం. ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫోన్ ద్వారా ప్రజలు సీఎం సెల్‌కు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్య ఉంటుంది. ప్రతిపక్ష నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ స్వయంగా కలుస్తాను. కేబినెట్ సమావేశాలను సచివాలయంలోగాక జిల్లాల్లో నిర్వహిస్తాను. నాతోపాటూ మంత్రులంతా పాల్గొని ఆయా జిల్లాల సమస్యను చర్చించి వెంటనే నిర్ణయం తీసుకుంటాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జిల్లాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళతా.
సాక్షి: అనేక ఆకర్షణీయమైన పథకాలు, ఉచిత వస్తువులకు అలవాటుపడిన ఓటర్లు మీసుపరిపాలనను అర్థం చేసుకుంటారా?
అన్బుమణి: ఉచితాల ప్రసక్తేలేదు. దానికోసం వెచ్చించే నిధులను మరో శాశ్వత అభివృద్ధికి వినియోగిస్తాం. మిక్సీలు, గ్రైండర్లు ఉచితంగా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు దూరంగా ఉంటాము. ఆ నిధులను మరో మంచి కార్యక్రమాలకు వినియోగిస్తాం.
సాక్షి: ఇరుగు పొరుగు జిల్లాలతో సాగునీటి సమస్యల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు. ?
అన్బుమణి: సాటి ప్రభుత్వాలపై సవాల్ చేసే ధోరణి సరికాదు. సామరస్యంగా మాట్లాడితే సులువుగా అంగీకరిస్తారు. వ్యవసాయానికి సాగునీరు ఎంతో ఆధారం, ఈ విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలను స్వయంగా వెళ్లి సామరస్య ధోరణిలో వివాదాలు పరిష్కరిస్తాను. నాకు ఈగో లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనే పొరుగురాష్ట్రాల సీఎంల వద్దకు వెళతాను. పరిష్కారం కోసం ఎవరి వద్దకైనా వెళ్లేందుకు నేను సిద్ధం. అంతే గాక నదులు, చెరువులు తదితర నీటి పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున చెక్‌డ్యాంలను నిర్మించడం ద్వారా నీటి వనరులను కాపాడుకుంటాము.
సాక్షి: అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు అన్బుమణి నుండి ఏమేరకు ఆశించవచ్చు.?
అన్బుమణి: వైఎస్ఆర్ పాలనే ఆదర్శం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఆదర్శం. రైతు సంక్షేమం కోసం ఆయన రాజకీయజీవితాన్నే అంకితం చేశారు. మాది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. రైతుల కష్టనష్టాలపై పూర్తిగా అవగాహన ఉంది. రాష్ట్ర జనాభాలో 60 శాతం రైతన్నలే. అన్బుమణి అధికారంలోకి వస్తే తమకు మేలు జరగడం ఖాయమని వారు నమ్ముతున్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, వాటర్ మేనేజిమెంట్ ఇలా వ్యవసాయాన్ని మూడుగా విభజించి ముగ్గురు మంత్రులను నియమిస్తాం. వైఎస్ఆర్ తన హయాంలో ఏపీ వార్షిక బడ్జెట్లో వైఎస్ఆర్ వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించారు. 35 హెక్టార్ల సాగుభూమిని 75 లక్షల హెక్టార్లకు పెంచగలిగారు. ఇదే పద్ధతిని నా పాలనలో అనుసరిస్తాను. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 48 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని కోటి హెక్టార్లకు పెంచడం నా లక్ష్యం. ఇందులో నీటి ఆధారిత 33 లక్షల హెక్టార్లను 60 లక్షల హెక్టార్లకు పెంచుతాను. రూ.55వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ నిర్ణయం.
సాక్షి: వ్యవసాయం సరే గిట్టుబాటు దర మాటేమిటి ?
అన్బుమణి: అందరికీ అన్నంపెట్టే రైతులు తాము పండించిన ధాన్యానికి తాము ధర నిర్ణయించుకోలేని పరిస్థితి నిజంగా దుర్భరమే. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు వ్యవసాయ దిగుబడుల ధరను రైతులు, నిపుణులే నిర్ణయిస్తారు. ప్రభుత్వం కేవలం మానిటరింగ్ చేస్తుంది. 30 జిల్లాల్లో స్పెషల్ ఆగ్రో ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తాను. అలాగే ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం.
సాక్షి: మీ ప్రణాళికను వింటూ ఉంటే మాకు నమ్మశక్యంగానే ఉంది. మరి ఓటర్ల మాటేమిటి ?
అన్బుమణి: రాష్ట్రంలో 5.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది తటస్థ ఓటర్లు. అంటే పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించేవారు. 35 ఏళ్లకు అటు ఇటుగా ఉండే యువత 2.5 లక్షల వరకు ఉన్నారు. వీరంతా నా ఆలోచనను విశ్వసిస్తున్నారు. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ధర్మగిరిలో ఎంపీగా గెలిచానంటే సీనియర్ సిటిజన్లు, తటస్థ ఓటర్లే ప్రధాన కారణం. అలాగే మహిళలు మద్య నిషేధం కోరుతున్నారు.
సాక్షి: కులపరమైన ముద్రను అధగమించారా?
అన్బుమణి: వన్నియర్ల సమస్యలపై పోరాడాం. అంతమాత్రానా మాది కులపరమైన పార్టీ కాదు. మా పార్టీలో అన్ని కులాలు, మతాలవారు ఉన్నారు.
సాక్షి: రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో మీరు ఎన్నిగెలుస్తారని ధీమాతో ఉన్నారు.?
అన్బుమణి: 150 సీట్లు గ్యారంటీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం.
సాక్షి: మీకు అంతటి నమ్మకం ఎలా వచ్చింది. ?
అన్బుమణి: 1989లో పార్టీని ప్రారంభించి ఈ 26 ఏళ్ల కాలంలో ఏటా షాడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. అంటే మా పార్టీ అధికారంలో ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయి, దేనికి ఎంత ప్రధాన్యత అనేది ప్రజలకు చెబుతూనే ఉన్నాము. నిర్మాణాత్మకమైన రాజకీయాలను నడుపుతున్నాము. అందుకనే పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాము. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ హత్యోదంతం హవాలోనూ ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్నాము. 1996లో నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా 8.5 శాతం ఓట్లు సాధించాం. మధ్యలో యూపీఏ, ఎన్డీఏలతో పొత్తులకు పోకుండా అదే పోకడను కొనసాగించి ఉంటే ఈపాటికి అధికారంలోకి వచ్చేవారం.
సాక్షి: తమిళనాడులో సంఖ్యాపరంగా ద్వితీయ పౌరులైన తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యపై మీ సమాధానం ఏమిటి?
అన్బుమణి: తమిళనాడు ప్రజల్లో తెలుగువారు కూడా ఒక భాగమే. రాష్ర్టంలో తమిళ జనాభా తరువాత తెలుగువారే అధికం, రాష్ట్రాలుగా విడిపోయాముగానీ ఒకప్పుడు అందరం ఒకటే కదా. తమిళనాడు నుండి ఏపీ, తెలంగాణ గా విడిపోయినా ఇక్కడ స్థిరపడిపోయిన తెలుగువారికి సమగౌరవం ఇవ్వడం మా విధి. మా ప్రభుత్వం వస్తే ఈ విషయాన్ని స్పష్టంగా పాటిస్తాం. నిర్బంధ తమిళం వంటి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం.
సాక్షి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అనేది ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన నినాదంగా మారిపోయింది. అన్నిపార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ పార్టీ స్టాండ్ ఏమిటి ?
అన్బుమణి: రాష్ట్రంలో అనాది నుంచి అంటే గత మూడు దశాబ్దాలుగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నది మా పార్టీ మాత్రమే. అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాం. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ఉండే 600 టాస్మాక్ దుకాణాలను తమ ఉద్యమాలతో ఇటీవల మూయించాం. ఒక్క లిక్కర్ మాత్రమే కాదు సిగరెట్ సైతం అనారోగ్యమని భావించేవారం. అందుకే గతంలో కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిగా పొగత్రాగడం (సిగరెట్) ఎంతటి చేటో తెలియజెపుతూ మంచి ఫలితాలను రాబట్టాను. కేంద్రమంత్రిగా మంచి చేశాడు, సీఎం అయితే కూడా అలానే చేస్తాడు, సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
సాక్షి: మరి ఇదే వాగ్దానాన్ని జయలలిత, కరుణానిధి కూడా ఇచ్చారు కదా ?
అన్బుమణి: సంపూర్ణ మద్య నిషేధం విషయంలో జయలలిత, కరుణ ఇద్దరూ సమానులే. అధికారంలో ఉన్నపుడు మద్యాన్ని ఏరులై పారించి నేడు మోసపూరిత మాటలు వల్లిస్తున్నారు. మద్య నిషేధం అమలు సాధ్యం కాదని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జయలలిత నేడు ఎన్నికల వేళ హామీ ఇవ్వడం ప్రజలను చీట్ చేయడమే అవుతుంది. జయలలితలో ఆ ఉద్దేశమే ఉండి ఉంటే ఐదేళ్ల క్రితం ఆమె అధికారంలోకి వచ్చినపుడే చేసి ఉండవచ్చు. అలాగే కరుణానిధి సైతం గత 20 ఏళ్ల కాలంలో మద్య నిషేధంపై ఆరుసార్లు ప్రకటించారు. నేడు ఏడోవాగ్దానంతో ఎన్నికలకు దిగుతున్నాడు. రాష్ట్రంలో 12 లిక్కర్ ఫ్యాక్టరీలు ఉండగా వాటిల్లో 6 డీఎంకే వారివి, 3 అన్నాడీఎంకే, 2 కాంగ్రెస్ వారివి. వీరా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం సాధించేది.
సాక్షి: పీఎంకే వ్యవస్థాపకులైన డాక్టర్ రాందాస్ రాజకీయాల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీచేయక పోవడానికి కారణం ఏమిటి ?
అన్బుమణి: పదవులకు నాన్న దూరం 40 ఏళ్లక్రితం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీలోకి అడుగుపెట్టనని నిర్ణయించుకున్నారు. నైతిక విలువలు, సిద్ధాంతపరమైన రాజకీయాలు ఆయనకు ఇష్టం. అందుకే ఇంతవరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాజ్‌పేయి,రాజీవ్‌గాంధీ స్వయంగా ఆహ్వానించినా సున్నితంగా నిరాకరించారు.
సాక్షి: ఆల్‌ది బెస్ట్ సార్. అన్బుమణి: ధ్యాంక్స్.