వాళ్లిద్దరు ఒక్కటయ్యారు
సాక్షి, చెన్నై : రెండు వారాల క్రితం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, పీఎంకే యువజన నేత, ఎంపీ అన్భుమణిల మధ్య మాటల యుద్ధం బయలుదేరింది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. చివరకు అన్భుమణికి అర్హతలు లేవుఅని, ఆయన వ్యాఖ్యలు పట్టించుకోబోనంటూ స్టాలిన్ స్పందించడం రచ్చకెక్కింది. తన కు సంబంధించిన విద్యా, తదితర అన్నిరకాల అర్హతలతో కూడిన చిట్టాను అన్భుమణి విడుదల చేశారు. తన అర్హతలను పరిశీలించి చర్చకు రావాలని స్టాలిన్‌కు సవాల్ విసిరారు. తన ఇంట్లో గానీ, బయటగాని, ఎక్కడైనా సరే అర్హతల విషయంగా చర్చించుకుంద్దాం..రా..? అంటూ అన్భుమణి వ్యాఖ్యానించారు.
ఆయన తీరుపై స్టాలిన్ స్పందించనప్పటికీ, డీఎంకే నాయకులు మాత్రం ఘాటుగానే విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మాటల వివాదం జఠిలం కావడంతో రెండు పార్టీల నాయకుల మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమన్నట్టుగా వ్యాఖ్యల దాడి బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో తామెన్ని తిట్టుకున్నా, సవాళ్లు విసురుకున్నా, అవన్నీ ఆ సమయానికే పరిమితం.. శాశ్వతం కాదు, అని చాటుతూ, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సామెతను గుర్తుచేస్తూ సోమవారం స్టాలిన్, అన్భుమణిలు ఏకం కావడం ఆ పార్టీ వర్గాల్ని ముక్కుమీద వేలు వేసుకునేలా చేసింది.
వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..
నిన్నటి రోజు వరకు విమర్శలు గుప్పించుకున్న ఆ నేతలు ఇద్దరు గంటల వ్యవధిలో ఒక చోట చేరారు. ఇందుకు డీఎంకే అధినేత కరుణానిధి మనవడు అరుల్ నిధి వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీ వేదిక అయింది. సోదరుడు ముక్కా తమిళరసు కుమారుడు అరుల్ నిధి వివాహ ఆహ్వాన పత్రికను అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్వయంగా ఎంకే స్టాలిన్ అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీల నాయకులు, ముఖ్యులను సోదరుడు ముక్కాతమిళరసుతో కలసి ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కూటమి ఏర్పాటుకు కొత్తఎత్తుగా ప్రచారం బయలు దేరింది. ఇదే, ఆహ్వాన పత్రిక, నిన్నటి శత్రువులను, తాజాగా మిత్రుల్ని చేసింది. మధ్యాహ్నం టీ నగర్‌లోని అన్భుమణి రాందాసు ఇంటికి సోదరుడితో కలసి స్టాలిన్ వెళ్లారు. స్టాలిన్ రాకతో వెలుపలకు వచ్చిన అన్భుమణి, పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, సీనియర్ నాయకుడు ఏకే మూర్తిలు చిరునవ్వులతో ఆహ్వానం పలికారు. పదిహేను నిమిషాలు ఆ ఇంట్లో భేటీ అయ్యారు.
అన్భుమణి ఇంటికి స్టాలిన్ వెళ్లిన సమాచారంతో మీడియా ఉరకలు పరుగులు తీసింది. ఆహ్వాన పత్రిక అందజేసినానంతరం సవాళ్లు, విమర్శలు, ఆరోపణలు పక్కన పెట్టిన ఈ ఇద్ద రు నాయకులు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాగరికత అంటే తమ కుటుంబాలదే అని చాటుకునే పనిలో పడ్డారు. ఇది డీఎంకే నాగరికత అని, తమిళ సంప్రదాయంఅని గుర్తుచేశారు. తాము ఈ సంప్రదింపుల్లో ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రాందాసు ఇంటి వివాహ వేడుకకు తమను ఇంటికి వచ్చి మరి ఆహ్వానించారని, అన్భుమణి సైతం వచ్చాని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా, తమ కుటుంబ వేడుకకు ఆహ్వానం పలుకుతున్నామని, అధినేత కరుణానిధి సూచనలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసును కలుస్తామని పేర్కొన్నారు. ఆర్‌కేనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తారా..? అని ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించగా, ఎన్నికల తేదీ ప్రకటించనీయండి అప్పుడు చూసుకుందామని సమాధానం ఇచ్చారు.
రాందాసుతో స్టాలిన్
ఆహ్వానం పత్రికల పంపిణీలో భాగంగా మంగళవారం స్టాలిన్ పీఎంకే అధినేత రాందాసు కలిశారు. తైలాపురం తోటలో రాందాసు ఆయన కలుసుకున్నారు. పి ఎంకే అధ్యక్షుడు జీకే మణి, రాందాసులతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం వెలుపలకు వచ్చిన స్టాలిన్‌ను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కలుస్తారా..? అని మీడియా ప్రశ్నించగా, ముందు ఆమెను ఆ పార్టీ వాళ్లకు కలిసే ఛాన్స్ ఇవ్వనీయండి అని చమత్కరించారు. ముందుగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామిని స్టాలిన్ కలిశారు. ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.