ఆంతర్యమేమిటో!
Published Tue, Jan 28 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
బహిష్కరణకు గురైన అళగిరితో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి దురై మురుగన్ భేటీ కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అళగిరికి మదురైలో పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టడం, మళ్లీ పోస్టర్ల యుద్ధం మొదలవడంతో డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది.
సాక్షి, చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యల నెపంతో అధినేత ఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరిపై సస్పెండ్ వేటు వేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై అళగిరి తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈనెల 30న జరిగే బర్త్‌డే వేడుకల అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోన్నారు. ఈ సమయంలో అళగిరితో దురై మురుగన్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్‌తో సన్నిహితంగా దురైమురుగన్ ఉండే వారు. పార్టీలో సీనియర్ నేతగా, ముఖ్య పదవిలో ఉన్న దురై మురుగన్ ఆదివారం కోట్టూరులో ప్రత్యక్షమయ్యారు. అక్కడి ఇంట్లో అళగిరితో ఆయన భేటీ అయిన సమాచారం డీఎంకే వర్గాల దృష్టికి చేరింది. ఈ ఇద్దరు భేటీ కావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, ఇందులో ఆంతర్యం ఏమిటోనన్న అన్వేషణలో డీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే, వీరి భేటీ అంతా, మదురై పార్టీ చుట్టూ సాగినట్టు సమాచారం. ఇటీవల తొలగించిన నేతల గురించి, మళ్లీ మళ్లీ చేస్తూ ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలపై దురై మురుగన్ సమీక్షించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మదురైకు వెళ్లిన అళగిరి అక్కడి విమానాశ్రయంలో తాను ఓ అర్థంతో వ్యాఖ్యలు చేస్తే, మరో అర్థం వచ్చేలా మీడియాలో రాస్తున్నారని పేర్కొనడం గమనార్హం.
బ్రహ్మరథం: చెన్నై నుంచి మదురైకు వచ్చిన అళగిరికి డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. విమానాశ్రయం నుంచి వందలాది వాహనాలు కాన్వాయ్‌గా అళగిరి ఇంటికి వెళ్లాయి. పార్టీ నాయకులు, అళగిరి మద్దతుదారులు గౌష్ బాషా, మన్నన్, బోసు, ఉదయకుమా ర్, జలాలుద్దీన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నాయకులు తరలి రావడం విశేషం. సోమవారం కూడా అళగిరి నివాసం మద్దతుదారులతో నిండింది. మీడియాతో మాట్లాడిన అళగిరి తన సత్తా ఏమిటో 30వ తేదీ తెలుస్తుందన్నారు. వచ్చింది గోరంత మద్దతుదారులేనని, కొండంత మద్దతుదారులను తన జన్మదినం రోజు చూడబోతున్నారని ప్రకటించారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పేదల సంక్షేమార్థం జరుపుకోవడం జరుగుతోందని, ఈ ఏడాది అదే తరహాలో జరుపుకుంటామని, అరుుతే ఈ వేడుకకు ప్రత్యేకత సంతరించుకోనున్నదన్నారు.
అయితే, తాను ఓ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తుంటే, మీడియా మరో అర్థం చేసుకుని వార్తలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తాను ఏ నిర్ణయాన్ని అయినా, సరే మద్దతుదారులతో చర్చించిన తర్వాతే తీసుకుంటానని స్పష్టం చేశారు. మళ్లీ పోస్టర్లు: అళగిరి సస్పెన్షన్‌కు వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు, ఆయన మద్దతుదారుల అత్యుత్సాహ పోస్టర్లు కూడా కారణమయ్యూయి. అళగిరిపై సస్పెన్షన్ వేటు పడటంతో మళ్లీ మద్దతుదారులు రెచ్చి పోతున్నారు. చెన్నై, మదురైలో పోస్టర్లు వెలిశాయి. తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ధైర్యవంతుడిగా, వీరుడిగా, కింగ్ మేకర్‌గా అళగిరిని పేర్కొంటూ వ్యాఖ్యల్ని అందులో పొందు పరిచారు. అళగిరి సతీమణి గాంధీ, తనయుడు దురై దయానిధి చిత్ర పటాల్ని సైతం ముద్రించడం గమనార్హం.
Advertisement
Advertisement