Durai Murugan
-
ఢిల్లీ వెళ్లనున్న స్టాలిన్: మేఘదాతుపై సీఎంల సమావేశం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈనెల 18న ఢిల్లీకి వెళుతున్నారు. మేఘదాతు ఆనకట్టపై అదేరోజున ఢిల్లీలో జరిగే నాలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో స్టాలిన్ పాల్గొంటారు. మేఘదాతు ఆనకట్టకు అడ్డుకట్ట వేయడం, నీట్ ప్రవేశపరీక్ష మినహాయింపు లేదా రద్దు డిమాండ్లపై ప్రధానంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం రామనగర్ జిల్లా కనకపుర తాలూకాలోని మేఘదాతు వద్ద రూ.9 వేల కోట్లతో కావేరీ నదిపై కొత్తగా ఆనకట్ట నిర్మాణానికి సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక పథకాన్ని కూడా రూపొందించి కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. అయితే కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాగా మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి కారణం చేతనూ అంగీకరించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సీఎం స్టాలిన్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఆనకట్ట నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుచెప్పరాదని యడ్యూరప్ప అంటున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పట్టుదల వల్ల ఆనకట్ట అంశం జఠిల సమస్యంగా మారింది. ఈ దశలో కర్ణాటక మంత్రి ఇటీవల ఢిల్లీకి వెళ్లి మేఘదాతు ఆనకట్టకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో 18వ తేదీన మేఘదాతుపై ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం స్టాలిన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. అంతేగాక రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలుసుకుని మేఘదాతుపై తమిళనాడు అభ్యంతరాన్ని తెలియజేయాలని స్టాలిన్ సంకల్పించినట్లు తెలుస్తోంది. ఆనకట్టపై కేంద్రం హామీ: దురైమురుగన్ మేఘదాతు ఆనకట్ట విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునేది లేదని, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీలో సంబం«ధిత రాష్ట్రాల నిరభ్యంతరాన్ని పొందకుండా అనుమతి ఇవ్వబోమని కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి దురైమురుగన్ చెప్పారు. తమిళనాడు నుంచి అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను శుక్రవారం కలుసుకుంది. అనంతరం ఢిల్లీలోని మీడియాతో దురైమురుగన్ మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణంలో కర్ణాటక దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేయాలని, ఆనకట్ట నిర్మాణాన్ని అనుమతించరాదని కోరినట్లు చెప్పారు. ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని, కర్ణాటకకు అనుమతి ఇవ్వబోవడం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు. అఖిలపక్ష బృందం ఢిల్లీ పర్యటన విజయవంతమైంది, అనుకున్నది నెరవేరిందని దురైమురుగన్ తెలిపారు. -
వెల్లూరులో ఎన్నిక రద్దు
న్యూఢిల్లీ: డీఎంకే నేతకు సన్నిహితుడి వద్ద ఇటీవల భారీ మొత్తంలో నగదు పట్టుబడిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. డీఎంకే కోశాధికారి దురైమురుగన్ కొడుకు కథీర్ ఆనంద్ ఈ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా ఉన్నారు. మార్చి 30న దురై మురుగన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను అధికారులు.. లెక్కలు లేని రూ. 10.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండ్రోజుల తర్వాత, ఏప్రిల్ 1న దురైమురుగన్ సన్నిహితుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో సోదాలు చేసి, ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన రూ. 11.53 కోట్ల నగదును సైతం పట్టుకున్నారు. దీంతో వెల్లూరులో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేనందున ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ అన్ని స్వతంత్ర వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి. ధన ప్రవాహం భారీగా ఉందన్న కారణంతో ఓ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. వెల్లూరులో పోలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఈసీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. కాగా, అధికారులకు పట్టుబడిన రూ. 11.53 కోట్లలో 91 శాతం డబ్బు 200 రూపాయల నోట్ల రూపంలోనే ఉందనీ, అదంతా ఒకే బ్యాంకు శాఖ నుంచి తీసుకున్నదని ఆదాయపు పన్ను అధికారులు చెప్పారు. కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
అట్టపెట్టెల్లో భారీగా నగదు.. 20 కోట్లు సీజ్!
సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ ఓటర్లకు ఎరవేసేందుకు భారీ స్థాయిలో నోట్లకట్టలు సరిహద్దులు దాటుతున్నాయి. తాజాగా తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడిలో భారీగా నగదు పట్టుబడింది. డీఎంకే కోశాధికారి దురై మురుగన్‌కు చెందిన కళాశాల, సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్లో సోదాలు నిర్వహించగా పెద్ద పెద్ద అట్ట పెట్టెల్లో భారీగా నగదు కట్టలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. డబ్బును లెక్కించగా సుమారు రూ. 20 కోట్లకుపైగా నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నగదును సీజ్ చేసి రిజర్వ్ బ్యాంక్‌కు తరలించారు. దురై మురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల కోసం ఈ నగదును దాచిపెట్టి ఉంటారని ఐటీ అధికారులు భావిస్తున్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో కక్ష సాధిస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సుమారు వంద కోట్లు వ్యానులో తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. -
అట్టపెట్టెల్లో భారీగా నగదు..
-
డీఎంకే చీఫ్ స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ప్రధాన పార్టీల్లో ఒకటైన ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) కొత్త అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు స్టాలిన్ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీని దాదాపు 50 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా నడిపిన కరుణానిధి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దాంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కోశాధికారిగా సీనియర్ నేత దురైమురుగన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్ ఎన్నికతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. అధ్యక్ష, కోశాధికారి పదవులకు వరుసగా స్టాలిన్, దురైమురుగన్ మాత్రమే నామినేషన్ వేయడంతో వారి ఎన్నికల ఏకగ్రీవమైంది. స్టాలిన్‌కు మద్దతుగా పార్టీ తరఫున మరో 65 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. స్టాలిన్‌కు ఆయన సోదరి,రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ తదితరులు స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసభ్య సమావేశంలో నిర్ణయం మంగళవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరయ్యే ముందు స్టాలిన్ గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి చిత్రపటానికి అంజలి ఘటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అధ్యక్షతన ఉదయం 9.35 గంటలకు సమావేశం ప్రారంభం కాగా ముందుగా కరుణ మృతికి, కరుణ కన్నుమూయడాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా రూ.2 లక్షల చొప్పున రూ.4.96 కోట్లు పంపిణీ చేయాలని తీర్మానం ఆమోదించారు. కరుణానిధికి భారతరత్న బిరుదును ప్రదానం చేయాలని మరో తీర్మానం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ స్థానంలో డీఎంకేను అధికారంలోకి తెచ్చి స్టాలిన్‌ను సీఎం చేద్దాం అంటూ మరో తీర్మానం చేశారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తదితరులకు సంతాపం తెలిపారు. మోదీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం దేశాన్ని కాషాయమయం చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే అధ్యక్షుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో స్టాలిన్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘డీఎంకే అధ్యక్షునిగా నాకిది కొత్త జన్మ. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ నాకు పెద్దనాన్న వంటివారు. కరుణానిధిలా నేను మాట్లాడలేను, చేతకాదు. అయితే ఆయన ప్రయోగించిన భాషను ఒడిసిపట్టుకునే ధైర్యం, పట్టుదల నాలో ఉంది. అన్నాదురై, కరుణానిధి చూపిన మార్గంలో పయనిస్తూ కష్టపడి పనిచేస్తా. అధికార, విపక్షాల్లో ఎవరు తప్పుచేసినా నిలదీస్తాం’ అని స్టాలిన్ అన్నారు. 14 ఏళ్లకే రాజకీయాల్లోకి... కరుణానిధి వారసుడైనప్పటికీ స్టాలిన్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 51 ఏళ్ల తర్వాత తన 65వ ఏట స్టాలిన్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. కరుణానిధి కూడా స్టాలిన్‌ను రాత్రికి రాత్రి అందలం ఎక్కించలేదు. 2006లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పడు కరుణానిధి తలచుకుంటే స్టాలిన్‌కు ఏ ఆర్ధిక శాఖో కట్టబెట్టి ఉండవచ్చు. కానీ కరుణ అప్పుడు స్టాలిన్‌కు స్థానిక పరిపాలనా శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ మంత్రిగా స్టాలిన్ విస్తృతంగా పల్లెల్లో తిరగాల్సి వచ్చింది. అదే ఆయనకు రాజకీయాల్లో ఎనలేని అనుభవాన్ని తెచ్చిపెట్టింది. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది. ఎదిగింది ఇలా ... 1953, మార్చి 1న కరుణానిధి రెండవ భార్య దయాళు అమ్మాళ్కి స్టాలిన్ జన్మించారు. సోవియెట్ అధినేత స్టాలిన్ నివాళి సభలో కరుణ మాట్లాడుతుండగా తనకు కుమారుడు జన్మించాడన్న విషయం తెలియడంతో స్టాలిన్ అని పేరు పెట్టారు. ♦ 14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1967 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ♦ 1973లో స్టాలిన్ 20 ఏళ్ల వయసులో డీఎంకే జనరల్ కమిటీకి ఎంపికయ్యారు. ♦ ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్ కావడంతో స్టాలిన్ పేరు అందరికీ తెలిసింది. ♦ ఆ తర్వాత డీఎంకే యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1984లో దానికి కార్యదర్శి పదవిని చేపట్టారు. 40 ఏళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. ♦ 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ♦1996లో చెన్నై నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే 2002లో జయలలిత తమిళనాడు పురపాలక చట్టాలకు చేసిన సవరణలతో రెండు రాజ్యాంగబద్ధ పదవులు ఒకరే నిర్వహించకూడదన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో స్టాలిన్ మేయర్ పదవిని వదులుకున్నారు. ♦ 2003లో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి అయ్యారు. సామాజిక న్యాయం, మూఢా చారాల నిర్మూలన, భాషా వికాసం వంటి సైద్ధాంతిక పునాదులపై పుట్టిన డీఎంకే పార్టీలో ఆధునికంగా కనిపించినవాడు స్టాలిన్. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ రాజకీయ నేతల ట్రేడ్ మార్క్ దుస్తులు ధోవతికి బదులుగా వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకర్షించారు. -
బీజేపీపై నటి ఆరోపణలు
టీనగర్: తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని సినీ నటి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కుష్బూ ఆరోపించారు. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కుష్బూ మంగళవారం కలిసి మాట్లాడారు. ఈ భేటీ గురించి కుష్బూ అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి రాహుల్‌గాంధీకి వివరించానని తెలి పారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు బీజేపీతో అన్నాడీఎంకే కూటమి ఏర్పరచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. అయితే ఇలా దొడ్డిదారిన ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తే, అది కలగానే మిగిలిపోతుందని కచ్చితంగా చెప్పగలనన్నారు. తమిళనాట రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టేందుకు బీజేపీ పథకం రూపొందిస్తోందన్నారు. బీజేపీ కలలు ఫలించవు: దురైమురుగన్ రాష్టంలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ పగటి కలలు ఫలించబోవని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు. రాష్ట్ర రైతుల 19 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ డీఎంకే తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ డీఎంకేపై, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌పై అనుచిత ప్రకటనలు చేస్తున్నట్లు విమర్శించారు. -
సిద్ధం కావాలి
► త్వరలో ఎన్నికలు తథ్యం ► కార్యదర్శులతో స్టాలిన్ ► డీఎంకేలోకి రాధారవి ► సుప్రీంలో ‘స్థానికం’పై పిటిషన్ సాక్షి, చెన్నై: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలతో సిద్ధంగా ఉండాలని జిల్లాల కార్యదర్శులకు డీఎంకే కార్యనిర్వాహక అధ్య క్షుడు ఎంకే స్టాలిన్ సూచించారు. పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. డీఎంకేలో సినీ నటుడు రాధారవి చేరారు. తేనాం పేటలోని అన్నా అరివాలయంలో జిల్లాల కార్యదర్శులతో స్టాలిన్ సమావేశం అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ సమక్షంలో గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశానికి ఉప ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంపీ ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, సీనియర్లు ఏవీ వేలు, పొను్మడి, ఎంఆర్కే పన్నీరుసెల్వంతో పాటుగా వివిధ జిల్లాలకు చెందిన 65 మంది పార్టీ కార్యదరు్శలు హాజరయా్యరు. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై స్టాలిన్ సమీక్షించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తగ్గట్టు జిల్లాల్లో నేతలు, కేడర్ సిద్ధంగా ఉండాలన్న సూచనలు ఇచ్చారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునే విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై కూడా చర్చించారు. ఇక, ప్రభుత్వాన్ని కూల్చడం లేదా, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా జిల్లాలో్లని నేతలకు కొన్ని కీలక పనుల్ని స్టాలిన్ అప్పగించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై చర్చించామన్నారు. మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చించామని, వాటిని మీడియాకు చెప్పలేమని, చెప్పబోమని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఆ కీలక నిర్ణయాలు ఏమిటో అన్న చర్చ బయల్దేరింది. డీఎంకేలోకి రాధారవి: సినీ నటుడు, అన్నాడీఎంకే నాయకుడు రాధారవి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే కనుమరుగైనట్టేనని ప్రకటించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్నా, అన్ని రకాలుగా మేలు కలగాలన్నా డీఎంకే ద్వారానే సాధ్యమని రాధారవి అన్నారు. రాష్ట్రంలో సమర్దుడైన నాయకుడు ఒక్క స్టాలిన్ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. కోరు్టలో పిటిషన్ : స్థానిక ఎన్నికలు మే 15లోపు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ అప్పీలుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధం అవుతోంది. ముందుగానే మేల్కొన్న డీఎంకే సుప్రీం కోర్టులో మంగళవారం కేవియట్ పిటిషన్ వేసింది. ఎన్నికల యంత్రాంగం అప్పీలుకు వస్తే, తమను సంప్రదించాలని ఆ పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేసింది. -
అసెంబ్లీకి పట్టు
♦ అఖిలపక్షంలో తీర్మానం ♦ డీఎండీకే, పీఎంకే దూరం ♦ తిరుమా మద్దతు..అయితే దూరంగా ♦ ఏకమవుదాం : స్టాలిన్ పిలుపు డీ ఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం చెన్నైలో మంగళవారం జరిగింది. కావేరీ వివాదం నేపథ్యంలో కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడికి ఇందులో నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, చెన్నై : కావేరి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. డెల్టా అన్నదాతల జీవన్మరణ సమస్య కావేరి జల వివాదం అని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాని దృష్ట్యా, ఈ సమావేశానికి తాను పిలుపునిచ్చానని, ఎవరు పిలుపునిచ్చినా, నేతృత్వం వహించినా, ఆ సమావేశానికి డీఎంకే తరఫున తానొస్తానంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన అఖిల పక్ష భేటీకి డీఎండీకే, పీఎంకేలు దూరంగా ఉన్నాయి. వీసీకే నేత తిరుమావళవన్ చివరి క్షణంలో మనసు మార్చుకున్నా, తన మద్దతును మాత్రం అఖిలపక్షం భేటీకి ప్రకటించడం గమనార్హం. జఠిలం అవుతున్న కావేరి జల వివాదంపై చర్చించి, తదుపరి అడుగులతో పాటు, కేంద్రంతో ఢీకొట్టేందుకు అఖిల పక్ష సమావేశానికి డీఎంకే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వం వహరించారు. డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత దురై మురుగన్ పర్యవేక్షించారు. ఇందులో కాంగ్రెస్ తరఫున టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత కేఆర్.రామస్వామి, తమిళ మానిల కాంగ్రె స్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్, మనిదనేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మోహిద్దీన్, ఎమ్మెల్యే అబూబక్కర్, కొంగు మండల కట్చి నేత ఈశ్వరన్, ద్రావిడ కళగం నేత వీరమణి, ద్రవిడ కళగం పేరవై నేత సుభా వీర పాండియన్, ఇండియ దేశియ లీగ్ నేత బషీర్ అహ్మద్, తమిళనాడు దేశియ లీగ్ నేత అల్తాఫ్, రైతు సంఘాల నేత టీఆర్ పాండియన్, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేత కదిరవన్ తదితర చిన్న పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఇందులో ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా నినదించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వంపై ముందుగా ఒత్తిడికి సిద్ధమయ్యారు. కావేరి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. కేంద్రం తీరును తప్పుబడుతూ, ప్రత్యేక తీర్మానంతో పాటు, డెల్టా అన్నదాతలకు ఎకరాకు రూ. ముఫ్పై వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐదు రకాల తీర్మానాలను ఈ సమావేశంలో చేశారు. ఏకం అవుదాం : కావేరి జల వివాదం జఠిలం అవుతోందని, అందరం ఏకం కావాల్సిన అవసరం ఏర్పడి ఉన్నట్టు తన ప్రసంగంలో స్టాలిన్ రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని దృష్ట్యా, అఖిల పక్ష సమావేశానికి పిలుపు నిచ్చానేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. డెల్టా అన్నదాతల జీవన్మరణ సమస్యగా వివాదం తలెత్తిందని, విమర్శలను కట్టి బెట్టి అందరం ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి పిలుపునిచ్చి ఉన్నా, మరో పార్టీ పిలుపునిచ్చి నేతృత్వం వహించి ఉన్నా, ఆ సమావేశానికి డీఎంకే తప్పకుండా వచ్చి ఉండేదని, స్వయంగా తానే ఆ సమావేశానికి హాజరయ్యే వాడినన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న పార్టీలను ఉద్దేశించి చురకలు అంటించారు. దూరంగా...ఆది నుంచి ఈ భేటీని బీజేపీ, ఎండీఎంకేలు వ్యతిరేకిస్తూ , విమర్శలు గుప్పిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా భేటీ గురించి కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశం డీఎంకే కూటమి పార్టీల మంతనాలుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, డీఎండీకే, పీఎంకేలు మౌనంగా తప్పుకోవడం గమనార్హం. ఆ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నా, మక్కల్ఇయక్కంలో కీలక నేతగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ వస్తారా..? రారా..? అన్న ఉత్కంఠకు తెర పడింది. ఆ సమావేశానికి ఆయన హాజరవుతారని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, మక్కల్ ఇయక్కంలో చీలికలు వస్తాయన్న ఆందోళనతో చివరి క్షణంలో తిరుమా తప్పుకోవడం గమనార్హం. తప్పుకున్నా, తన మద్దతును మాత్రం ప్రకటించడం విశేషం. అఖిలపక్ష సమావేశానికి తాను రావాలని భావించినా, ఉప ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి ఇరకాటంలో పడాల్సి వస్తుందన్న భావనతో తాను దూరం కావాల్సి వచ్చిందని, అయితే, అఖిలపక్షం సమావేశానికి తీర్మానాలకు తన మద్దతును ప్రకటిస్తున్నట్టు తిరుమావళవన్ ప్రకటించారు. అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు లేఖ సైతం రాయడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో అఖిలపక్షం భేటీ సాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. కావేరి జల పర్యవేక్షణకు రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ పరిశీలన, నివేదిక తమకు సంతృప్తికరంగా లేదని, మళ్లీ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.తమిళనాట అఖిలపక్షం భేటీకావడం, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన నేపథ్యంలో నీటి విడుదలపై కర్ణాటక దృష్టి పెట్టడం గమనార్హం. -
పొత్తు హిట్
సాక్షి, చెన్నై : ఈ సారి ఎలాగైనా అధికార పగ్గాలు చేజిక్కించుకుని తీరాలన్న కాంక్షతో డీఎంకే పరుగులు తీస్తోంది. మెగా కూటమికి వేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, ఇక తమతో కలిసి వచ్చే వాళ్లను అక్కున చేర్చుకుని ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌తో పాటు చిన్న చిన్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక వర్గాల సంఘాలు డీఎంకే వైపుగా తమ దృష్టిని పెట్టి ఉన్నాయి. ఇప్పటికే పలు సంఘాలు, పార్టీల నాయకులు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌ను కలిసి తమ మద్దతను ప్రకటించారు. రోజురోజుకు ఈ మద్దతు సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో పన్నెండు చిన్న పార్టీలు, మరికొన్ని ప్రజా సంఘాల నాయకులు తమ మద్దతు గణంతో అన్నా అరివాలయంకు చేరుకున్నారు. దళపతి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమ మద్దతును ప్రకటించారు. ఇక అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి నేత, సినీ నటుడు కార్తీక్ సైతం అన్నా అరివాలయంలో అడుగు పెట్టేందుకు సిద్ధమైనా చివరి క్షణంలో పర్యటన వాయిదా పడ్డట్టు అయింది. అయితే, ఆయన గోపాలపురం మెట్లు ఎక్కి డీఎంకే అధినేత కరుణానిధి ఆశీస్సులతో మద్దతు ప్రకటించే కసరత్తుల్లో ఉన్నట్టు నాడాలుం మక్కల్ కట్చి వర్గాలు పేర్కొంటున్నాయి. నడిగర్ తిలగం శివాజీ గణేషన్ అభిమాన సంఘం శివాజీ పేరవై వర్గాలు సైతం స్టాలిన్‌ను కలిసి మద్దతు ప్రకటించడం విశేషం. ఓ వైపు మద్దతు తెలిపేందుకు వస్తున్న వారిని ఆహ్వానిస్తూ, మరో వైపు సీట్ల పందేరానికి స్టాలిన్ సిద్ధమయ్యారు. తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో సమాలోచనలో మునిగారు. పార్టీ నాయకులు దురైమురుగన్, ఆర్ఎస్ భారతి, ఐ పెరియ స్వామిలతో సమాలోచనల అనంతరం తమకు మద్దతు ఇస్తున్న కొన్ని సామాజిక వర్గాల వారీగా పార్టీలకు సీట్ల కేటాయింపు మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, రాష్ట్ర పార్టీ నాయకులతో కాంగ్రెస్ కమిటీ శుక్రవారం వెలువడే అవకాశాలు ఉన్న దృష్ట్యా, ఆ కమిటీ రాకతో సీట్ల పందేరాన్ని తేల్చేందుకు స్టాలిన్ కసరత్తుల్లో మునిగారు. -
డీఎంకే నా ఊపిరి
* కరుణ నా నేత * దళపతి మార్గదర్శి * వైదొలిగే ప్రసక్తే లేదు * దురైమురుగన్ స్పష్టీకరణ సాక్షి, చెన్నై:‘డీఎంకే నా ఊపిరి, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం. కరుణానిధి నా నాయకుడు, దళపతి స్టాలిన్ మా మార్గదర్శి.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను డీఎంకే నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు’ అని ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ స్పష్టం చేశారు. తాను డీఎంకే నుంచి వైదొలిగినట్టుగా బయలుదేరిన ప్రచారానికి ముగింపు ఇస్తూ శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలో సంస్థాగత ఎన్నికలు సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ పరంగా జిల్లాల విభజన పర్వం జరిగింది. జిల్లాల సంఖ్య పెరగడంతో తమకు పట్టున్న ప్రాంతాల్లో కార్యాదర్శుల పదవుల్ని చేజిక్కించుకునేందుకు సీనియర్లు, మాజీ కార్యదర్శులు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. అధినేత కరుణానిధి ప్రసన్నంతో కొందరు, దళపతి స్టాలిన్ ఆశీస్సులతో మరికొందరు పదవుల్ని తన్నుకెళ్లడం కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు సీనియర్లు, మాజీల యితే, తమ వార సుల్ని రేసులో దించేందుకు రెడీఅయ్యారు. ఆ దిశగా డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తన వారసుడ్ని రంగంలోకి దించే ప్రయత్నాలు వేగవంతం చేశారు. వేలూరు జిల్లా కార్యదర్శి పదవి తనయుడు కదిర్ ఆనంద్‌కు ఇప్పించే విధంగా కసరత్తుల్లో మునిగినట్టు, ఇందుకు కరుణానిధి, స్టాలిన్ నిరాకరించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆగ్రహించిన దురైమురుగన్ ఇక డీఎంకేలో ఇమడలేమన్న నిర్ణయానికి వచ్చినట్టు, అధినేత కరుణానిధిని కలిసి గురువారం రాత్రి తన పదవికి రాజీనామా చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో దురైమురుగన్ రాజీనామా చర్చ బయలుదేరడంతో మీడియా దృష్టి డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం మీద పడింది. డీఎంకేలో అతిముఖ్య నేతగా ఉన్న దురైమురుగన్ ఇక తప్పుకున్నట్టేనన్న నిర్ధారణకు వచ్చారు. ఆయన రాజీనామాను కరుణానిధి ఆమోదించనట్టు, బుజ్జగించే పనుల్లో ఉన్నట్టుగా సంకేతాలు రావడంతో మీడియాల్లో డీఎంకేకు ‘దురై’ గుడ్ బై చెప్పినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అవన్నీ తప్పులే మీడియాల్లో కథనాలు రావడంతో డీఎంకేలో చర్చ బయలుదేరింది. తాను రాజీనామా చేసినట్టుగా వస్తున్న కథనాల్ని పరిగణనలోకి తీసుకున్న దురైమురుగన్ ఆ ప్రచారానికి ముగింపు పలకడం లక్ష్యంగా శుక్రవారం ఉదయం మీడియా ముందుకువచ్చారు. అవన్నీ తప్పు డు ప్రచారాలేనని ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ, డీఎంకేను వీడనని, వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
ఆంతర్యమేమిటో!
బహిష్కరణకు గురైన అళగిరితో డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి దురై మురుగన్ భేటీ కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అళగిరికి మదురైలో పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టడం, మళ్లీ పోస్టర్ల యుద్ధం మొదలవడంతో డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. సాక్షి, చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యల నెపంతో అధినేత ఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరిపై సస్పెండ్ వేటు వేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్‌పై అళగిరి తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈనెల 30న జరిగే బర్త్‌డే వేడుకల అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోన్నారు. ఈ సమయంలో అళగిరితో దురై మురుగన్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్‌తో సన్నిహితంగా దురైమురుగన్ ఉండే వారు. పార్టీలో సీనియర్ నేతగా, ముఖ్య పదవిలో ఉన్న దురై మురుగన్ ఆదివారం కోట్టూరులో ప్రత్యక్షమయ్యారు. అక్కడి ఇంట్లో అళగిరితో ఆయన భేటీ అయిన సమాచారం డీఎంకే వర్గాల దృష్టికి చేరింది. ఈ ఇద్దరు భేటీ కావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, ఇందులో ఆంతర్యం ఏమిటోనన్న అన్వేషణలో డీఎంకే వర్గాలు ఉన్నాయి. అయితే, వీరి భేటీ అంతా, మదురై పార్టీ చుట్టూ సాగినట్టు సమాచారం. ఇటీవల తొలగించిన నేతల గురించి, మళ్లీ మళ్లీ చేస్తూ ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలపై దురై మురుగన్ సమీక్షించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మదురైకు వెళ్లిన అళగిరి అక్కడి విమానాశ్రయంలో తాను ఓ అర్థంతో వ్యాఖ్యలు చేస్తే, మరో అర్థం వచ్చేలా మీడియాలో రాస్తున్నారని పేర్కొనడం గమనార్హం. బ్రహ్మరథం: చెన్నై నుంచి మదురైకు వచ్చిన అళగిరికి డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. విమానాశ్రయం నుంచి వందలాది వాహనాలు కాన్వాయ్‌గా అళగిరి ఇంటికి వెళ్లాయి. పార్టీ నాయకులు, అళగిరి మద్దతుదారులు గౌష్ బాషా, మన్నన్, బోసు, ఉదయకుమా ర్, జలాలుద్దీన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నాయకులు తరలి రావడం విశేషం. సోమవారం కూడా అళగిరి నివాసం మద్దతుదారులతో నిండింది. మీడియాతో మాట్లాడిన అళగిరి తన సత్తా ఏమిటో 30వ తేదీ తెలుస్తుందన్నారు. వచ్చింది గోరంత మద్దతుదారులేనని, కొండంత మద్దతుదారులను తన జన్మదినం రోజు చూడబోతున్నారని ప్రకటించారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పేదల సంక్షేమార్థం జరుపుకోవడం జరుగుతోందని, ఈ ఏడాది అదే తరహాలో జరుపుకుంటామని, అరుుతే ఈ వేడుకకు ప్రత్యేకత సంతరించుకోనున్నదన్నారు. అయితే, తాను ఓ అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తుంటే, మీడియా మరో అర్థం చేసుకుని వార్తలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. తాను ఏ నిర్ణయాన్ని అయినా, సరే మద్దతుదారులతో చర్చించిన తర్వాతే తీసుకుంటానని స్పష్టం చేశారు. మళ్లీ పోస్టర్లు: అళగిరి సస్పెన్షన్‌కు వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు, ఆయన మద్దతుదారుల అత్యుత్సాహ పోస్టర్లు కూడా కారణమయ్యూయి. అళగిరిపై సస్పెన్షన్ వేటు పడటంతో మళ్లీ మద్దతుదారులు రెచ్చి పోతున్నారు. చెన్నై, మదురైలో పోస్టర్లు వెలిశాయి. తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ధైర్యవంతుడిగా, వీరుడిగా, కింగ్ మేకర్‌గా అళగిరిని పేర్కొంటూ వ్యాఖ్యల్ని అందులో పొందు పరిచారు. అళగిరి సతీమణి గాంధీ, తనయుడు దురై దయానిధి చిత్ర పటాల్ని సైతం ముద్రించడం గమనార్హం.