డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ | MK Stalin Becomes DMK President, Durai Murugan Elected Treasurer | Sakshi
Sakshi News home page

డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌

Published Wed, Aug 29 2018 12:56 AM | Last Updated on Wed, Aug 29 2018 11:32 AM

MK Stalin Becomes DMK President, Durai Murugan Elected Treasurer - Sakshi

సర్వసభ్య సమావేశం వేదికపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇతర సీనియర్‌ నేతలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ప్రధాన పార్టీల్లో ఒకటైన ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) కొత్త అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు స్టాలిన్‌ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీని దాదాపు 50 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా నడిపిన కరుణానిధి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దాంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది.

డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కోశాధికారిగా సీనియర్‌ నేత దురైమురుగన్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్‌ ఎన్నికతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. అధ్యక్ష, కోశాధికారి పదవులకు వరుసగా స్టాలిన్, దురైమురుగన్‌ మాత్రమే నామినేషన్‌ వేయడంతో వారి ఎన్నికల ఏకగ్రీవమైంది. స్టాలిన్‌కు మద్దతుగా పార్టీ తరఫున మరో 65 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. స్టాలిన్‌కు ఆయన సోదరి,రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ తదితరులు స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సర్వసభ్య సమావేశంలో నిర్ణయం
మంగళవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరయ్యే ముందు స్టాలిన్‌ గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి చిత్రపటానికి అంజలి ఘటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ అధ్యక్షతన ఉదయం 9.35 గంటలకు సమావేశం ప్రారంభం కాగా ముందుగా కరుణ మృతికి, కరుణ కన్నుమూయడాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించారు.

చనిపోయిన వారి కుటుంబాలకు తలా రూ.2 లక్షల చొప్పున రూ.4.96 కోట్లు పంపిణీ చేయాలని తీర్మానం ఆమోదించారు. కరుణానిధికి భారతరత్న బిరుదును ప్రదానం చేయాలని మరో తీర్మానం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ స్థానంలో డీఎంకేను అధికారంలోకి తెచ్చి స్టాలిన్‌ను సీఎం చేద్దాం అంటూ మరో తీర్మానం చేశారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ తదితరులకు సంతాపం తెలిపారు.

మోదీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
దేశాన్ని కాషాయమయం చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. డీఎంకే అధ్యక్షుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో స్టాలిన్‌ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘డీఎంకే అధ్యక్షునిగా నాకిది కొత్త జన్మ. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ నాకు పెద్దనాన్న వంటివారు. కరుణానిధిలా నేను మాట్లాడలేను, చేతకాదు. అయితే ఆయన ప్రయోగించిన భాషను ఒడిసిపట్టుకునే ధైర్యం, పట్టుదల నాలో ఉంది. అన్నాదురై, కరుణానిధి చూపిన మార్గంలో పయనిస్తూ కష్టపడి పనిచేస్తా. అధికార, విపక్షాల్లో ఎవరు తప్పుచేసినా నిలదీస్తాం’ అని స్టాలిన్‌ అన్నారు.  


14 ఏళ్లకే రాజకీయాల్లోకి...
కరుణానిధి వారసుడైనప్పటికీ స్టాలిన్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 51 ఏళ్ల తర్వాత తన 65వ ఏట స్టాలిన్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. కరుణానిధి కూడా స్టాలిన్‌ను రాత్రికి రాత్రి అందలం ఎక్కించలేదు.  2006లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పడు కరుణానిధి తలచుకుంటే స్టాలిన్‌కు ఏ ఆర్ధిక శాఖో కట్టబెట్టి ఉండవచ్చు. కానీ కరుణ అప్పుడు స్టాలిన్‌కు స్థానిక పరిపాలనా శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ మంత్రిగా స్టాలిన్‌ విస్తృతంగా పల్లెల్లో తిరగాల్సి వచ్చింది. అదే ఆయనకు రాజకీయాల్లో ఎనలేని అనుభవాన్ని తెచ్చిపెట్టింది. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది.  

ఎదిగింది ఇలా ...
1953, మార్చి 1న కరుణానిధి రెండవ భార్య దయాళు అమ్మాళ్‌కి స్టాలిన్‌ జన్మించారు. సోవియెట్‌ అధినేత స్టాలిన్‌ నివాళి సభలో కరుణ మాట్లాడుతుండగా తనకు కుమారుడు జన్మించాడన్న విషయం తెలియడంతో స్టాలిన్‌ అని పేరు పెట్టారు.
14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1967 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.
1973లో స్టాలిన్‌ 20 ఏళ్ల వయసులో డీఎంకే జనరల్‌ కమిటీకి ఎంపికయ్యారు.
ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్ట్‌ కావడంతో స్టాలిన్‌ పేరు అందరికీ తెలిసింది.
ఆ తర్వాత డీఎంకే యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. 1984లో దానికి కార్యదర్శి పదవిని చేపట్టారు. 40 ఏళ్లపాటు అదే పదవిలో కొనసాగారు.  
1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.
1996లో చెన్నై నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే 2002లో జయలలిత తమిళనాడు పురపాలక చట్టాలకు చేసిన సవరణలతో రెండు రాజ్యాంగబద్ధ పదవులు ఒకరే నిర్వహించకూడదన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో స్టాలిన్‌ మేయర్‌ పదవిని వదులుకున్నారు.  
2003లో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి అయ్యారు. సామాజిక న్యాయం, మూఢా చారాల నిర్మూలన, భాషా వికాసం వంటి సైద్ధాంతిక పునాదులపై పుట్టిన డీఎంకే పార్టీలో ఆధునికంగా కనిపించినవాడు స్టాలిన్‌. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ రాజకీయ నేతల ట్రేడ్‌ మార్క్‌ దుస్తులు ధోవతికి బదులుగా వెస్ట్రన్‌ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకర్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement