♦ అఖిలపక్షంలో తీర్మానం
♦ డీఎండీకే, పీఎంకే దూరం
♦ తిరుమా మద్దతు..అయితే దూరంగా
♦ ఏకమవుదాం : స్టాలిన్ పిలుపు
డీ ఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం చెన్నైలో మంగళవారం జరిగింది. కావేరీ వివాదం నేపథ్యంలో కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడికి ఇందులో నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి, చెన్నై : కావేరి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. డెల్టా అన్నదాతల జీవన్మరణ సమస్య కావేరి జల వివాదం అని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాని దృష్ట్యా, ఈ సమావేశానికి తాను పిలుపునిచ్చానని, ఎవరు పిలుపునిచ్చినా, నేతృత్వం వహించినా, ఆ సమావేశానికి డీఎంకే తరఫున తానొస్తానంటూ వ్యాఖ్యానించారు.
మంగళవారం జరిగిన అఖిల పక్ష భేటీకి డీఎండీకే, పీఎంకేలు దూరంగా ఉన్నాయి. వీసీకే నేత తిరుమావళవన్ చివరి క్షణంలో మనసు మార్చుకున్నా, తన మద్దతును మాత్రం అఖిలపక్షం భేటీకి ప్రకటించడం గమనార్హం. జఠిలం అవుతున్న కావేరి జల వివాదంపై చర్చించి, తదుపరి అడుగులతో పాటు, కేంద్రంతో ఢీకొట్టేందుకు అఖిల పక్ష సమావేశానికి డీఎంకే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వం వహరించారు. డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత దురై మురుగన్ పర్యవేక్షించారు.
ఇందులో కాంగ్రెస్ తరఫున టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత కేఆర్.రామస్వామి, తమిళ మానిల కాంగ్రె స్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్, మనిదనేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మోహిద్దీన్, ఎమ్మెల్యే అబూబక్కర్, కొంగు మండల కట్చి నేత ఈశ్వరన్, ద్రావిడ కళగం నేత వీరమణి, ద్రవిడ కళగం పేరవై నేత సుభా వీర పాండియన్, ఇండియ దేశియ లీగ్ నేత బషీర్ అహ్మద్, తమిళనాడు దేశియ లీగ్ నేత అల్తాఫ్, రైతు సంఘాల నేత టీఆర్ పాండియన్, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేత కదిరవన్ తదితర చిన్న పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
ఇందులో ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా నినదించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వంపై ముందుగా ఒత్తిడికి సిద్ధమయ్యారు. కావేరి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. కేంద్రం తీరును తప్పుబడుతూ, ప్రత్యేక తీర్మానంతో పాటు, డెల్టా అన్నదాతలకు ఎకరాకు రూ. ముఫ్పై వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐదు రకాల తీర్మానాలను ఈ సమావేశంలో చేశారు.
ఏకం అవుదాం : కావేరి జల వివాదం జఠిలం అవుతోందని, అందరం ఏకం కావాల్సిన అవసరం ఏర్పడి ఉన్నట్టు తన ప్రసంగంలో స్టాలిన్ రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని దృష్ట్యా, అఖిల పక్ష సమావేశానికి పిలుపు నిచ్చానేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు.
డెల్టా అన్నదాతల జీవన్మరణ సమస్యగా వివాదం తలెత్తిందని, విమర్శలను కట్టి బెట్టి అందరం ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి పిలుపునిచ్చి ఉన్నా, మరో పార్టీ పిలుపునిచ్చి నేతృత్వం వహించి ఉన్నా, ఆ సమావేశానికి డీఎంకే తప్పకుండా వచ్చి ఉండేదని, స్వయంగా తానే ఆ సమావేశానికి హాజరయ్యే వాడినన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న పార్టీలను ఉద్దేశించి చురకలు అంటించారు.
దూరంగా...ఆది నుంచి ఈ భేటీని బీజేపీ, ఎండీఎంకేలు వ్యతిరేకిస్తూ , విమర్శలు గుప్పిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా భేటీ గురించి కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశం డీఎంకే కూటమి పార్టీల మంతనాలుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, డీఎండీకే, పీఎంకేలు మౌనంగా తప్పుకోవడం గమనార్హం. ఆ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నా, మక్కల్‌ఇయక్కంలో కీలక నేతగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ వస్తారా..? రారా..? అన్న ఉత్కంఠకు తెర పడింది. ఆ సమావేశానికి ఆయన హాజరవుతారని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, మక్కల్ ఇయక్కంలో చీలికలు వస్తాయన్న ఆందోళనతో చివరి క్షణంలో తిరుమా తప్పుకోవడం గమనార్హం. తప్పుకున్నా, తన మద్దతును మాత్రం ప్రకటించడం విశేషం.
అఖిలపక్ష సమావేశానికి తాను రావాలని భావించినా, ఉప ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి ఇరకాటంలో పడాల్సి వస్తుందన్న భావనతో తాను దూరం కావాల్సి వచ్చిందని, అయితే, అఖిలపక్షం సమావేశానికి తీర్మానాలకు తన మద్దతును ప్రకటిస్తున్నట్టు తిరుమావళవన్ ప్రకటించారు. అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు లేఖ సైతం రాయడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో అఖిలపక్షం భేటీ సాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
కావేరి జల పర్యవేక్షణకు రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ పరిశీలన, నివేదిక తమకు సంతృప్తికరంగా లేదని, మళ్లీ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.తమిళనాట అఖిలపక్షం భేటీకావడం, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన నేపథ్యంలో నీటి విడుదలపై కర్ణాటక దృష్టి పెట్టడం గమనార్హం.
అసెంబ్లీకి పట్టు
Published Wed, Oct 26 2016 1:52 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement