సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈనెల 18న ఢిల్లీకి వెళుతున్నారు. మేఘదాతు ఆనకట్టపై అదేరోజున ఢిల్లీలో జరిగే నాలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో స్టాలిన్ పాల్గొంటారు. మేఘదాతు ఆనకట్టకు అడ్డుకట్ట వేయడం, నీట్ ప్రవేశపరీక్ష మినహాయింపు లేదా రద్దు డిమాండ్లపై ప్రధానంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం రామనగర్ జిల్లా కనకపుర తాలూకాలోని మేఘదాతు వద్ద రూ.9 వేల కోట్లతో కావేరీ నదిపై కొత్తగా ఆనకట్ట నిర్మాణానికి సమాయత్తం అవుతోంది.
ఇందుకు సంబంధించి ప్రణాళిక పథకాన్ని కూడా రూపొందించి కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. అయితే కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాగా మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి కారణం చేతనూ అంగీకరించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సీఎం స్టాలిన్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఆనకట్ట నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుచెప్పరాదని యడ్యూరప్ప అంటున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పట్టుదల వల్ల ఆనకట్ట అంశం జఠిల సమస్యంగా మారింది. ఈ దశలో కర్ణాటక మంత్రి ఇటీవల ఢిల్లీకి వెళ్లి మేఘదాతు ఆనకట్టకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో 18వ తేదీన మేఘదాతుపై ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం స్టాలిన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. అంతేగాక రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలుసుకుని మేఘదాతుపై తమిళనాడు అభ్యంతరాన్ని తెలియజేయాలని స్టాలిన్ సంకల్పించినట్లు తెలుస్తోంది.
ఆనకట్టపై కేంద్రం హామీ: దురైమురుగన్
మేఘదాతు ఆనకట్ట విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునేది లేదని, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీలో సంబం«ధిత రాష్ట్రాల నిరభ్యంతరాన్ని పొందకుండా అనుమతి ఇవ్వబోమని కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి దురైమురుగన్ చెప్పారు. తమిళనాడు నుంచి అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను శుక్రవారం కలుసుకుంది.
అనంతరం ఢిల్లీలోని మీడియాతో దురైమురుగన్ మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణంలో కర్ణాటక దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేయాలని, ఆనకట్ట నిర్మాణాన్ని అనుమతించరాదని కోరినట్లు చెప్పారు. ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని, కర్ణాటకకు అనుమతి ఇవ్వబోవడం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు. అఖిలపక్ష బృందం ఢిల్లీ పర్యటన విజయవంతమైంది, అనుకున్నది నెరవేరిందని దురైమురుగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment