Mekedatu Project
-
ఆ డ్యామ్‌కు మేమూ వ్యతిరేకం: పుదుచ్చేరి బీజేపీ
సాక్షి, చెన్నై: మేఘదాతులో డ్యాం నిర్మాణానికి తాము వ్యతిరేకమని పుదుచ్చేరి బీజేపీ ప్రకటించింది. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రధానిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ పుదుచ్చేరి అధ్యక్షుడు స్వామినాథన్ ఆదివారం ప్రకటించారు. కావేరి తీరంలోని మేఘదాతు వద్ద డ్యాం నిర్మాణం కోసం కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, బీజేపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే... పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ సైతం డ్యాంకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోంది. ఈ క్రమంలో తామూ వ్యతిరేకమని పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడు స్వామినాథన్ ప్రకటించడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. కావేరి జలాలపై పుదుచ్చేరికి సైతం హక్కులు ఉన్నాయని, ఇక్కడి రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేఘదాతులో డ్యాంను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. -
ఢిల్లీ వెళ్లనున్న స్టాలిన్: మేఘదాతుపై సీఎంల సమావేశం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈనెల 18న ఢిల్లీకి వెళుతున్నారు. మేఘదాతు ఆనకట్టపై అదేరోజున ఢిల్లీలో జరిగే నాలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో స్టాలిన్ పాల్గొంటారు. మేఘదాతు ఆనకట్టకు అడ్డుకట్ట వేయడం, నీట్ ప్రవేశపరీక్ష మినహాయింపు లేదా రద్దు డిమాండ్లపై ప్రధానంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం రామనగర్ జిల్లా కనకపుర తాలూకాలోని మేఘదాతు వద్ద రూ.9 వేల కోట్లతో కావేరీ నదిపై కొత్తగా ఆనకట్ట నిర్మాణానికి సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక పథకాన్ని కూడా రూపొందించి కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. అయితే కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాగా మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి కారణం చేతనూ అంగీకరించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సీఎం స్టాలిన్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఆనకట్ట నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం అడ్డుచెప్పరాదని యడ్యూరప్ప అంటున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పట్టుదల వల్ల ఆనకట్ట అంశం జఠిల సమస్యంగా మారింది. ఈ దశలో కర్ణాటక మంత్రి ఇటీవల ఢిల్లీకి వెళ్లి మేఘదాతు ఆనకట్టకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో 18వ తేదీన మేఘదాతుపై ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం స్టాలిన్ ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. అంతేగాక రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలుసుకుని మేఘదాతుపై తమిళనాడు అభ్యంతరాన్ని తెలియజేయాలని స్టాలిన్ సంకల్పించినట్లు తెలుస్తోంది. ఆనకట్టపై కేంద్రం హామీ: దురైమురుగన్ మేఘదాతు ఆనకట్ట విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకునేది లేదని, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీలో సంబం«ధిత రాష్ట్రాల నిరభ్యంతరాన్ని పొందకుండా అనుమతి ఇవ్వబోమని కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి దురైమురుగన్ చెప్పారు. తమిళనాడు నుంచి అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను శుక్రవారం కలుసుకుంది. అనంతరం ఢిల్లీలోని మీడియాతో దురైమురుగన్ మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణంలో కర్ణాటక దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేయాలని, ఆనకట్ట నిర్మాణాన్ని అనుమతించరాదని కోరినట్లు చెప్పారు. ఇరు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని, కర్ణాటకకు అనుమతి ఇవ్వబోవడం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు. అఖిలపక్ష బృందం ఢిల్లీ పర్యటన విజయవంతమైంది, అనుకున్నది నెరవేరిందని దురైమురుగన్ తెలిపారు. -
ఆ ఆనకట్టను ఎంతమాత్రం అంగీకరించబోం: సీఎం స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై : కావేరీ నదిపై మేఘదాతు ఆనకట్ట నిర్మాణానికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తమిళనాడులోని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం హ డావుడిగా మేఘదాతు ఆనకట్ట నిర్మాణం చేప్పడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సోమ వారం అఖిలపక్ష సమావేశం జరిగింది. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ తదితర 13 పార్టీల నేతలు పాల్గొని మేఘదాతును అడ్డుకునేందుకు తమిళనాడు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలకు సంఘీభావం తెలిపారు. ప్రధాని దృష్టికి.. చట్టపరంగా ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. సీఎం స్టాలిన్ ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి కర్ణాటక ప్రభుత్వం చర్యలను నిలువరించాలని, తమిళనాడు రైతుల సాగునీటి ప్రయోజనాలను కాపాడాలని కోరారు. మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని తమిళనాడు వ్యతిరేకించరాదని కర్ణాటక సీఎం యడ్యూరప్ప సీఎం స్టాలిన్‌కు ఇటీవల లేఖ రాశారు. మరోవైపు ఆనకట్ట వల్ల తమిళనాడులోని వ్యవసాయ భూములకు సాగునీరందక దెబ్బతింటాయని, పైగా ఆనకట్ట నిర్మాణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని స్టాలిన్ ఆ లేఖకు బదులిచ్చారు. మేఘదాతు ఆనకట్టను ఎంతమాత్రం అంగీకరించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమిళనాడులోని అన్ని పార్టీలను సంఘటితం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దురైమురుగన్, ఆర్ఎస్ భారతి (డీఎంకే), అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి జయకుమార్, మనోజ్ పాండియన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి, చెల్లపెరుందగై, జీకే మణి (పీఎంకే), నయనార్ నాగేంద్రన్ (బీజేపీ) ఎంపీ తిరుమా (వీసీకే) సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, తదితర 13 పార్టీల నేతలు పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వ వైఖరిని, మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని తీర్మానం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున అఖిలపక్ష బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కావాలని నిర్ణయించారు. కావేరీ నదిపై తమిళనాడు హక్కులను నిర్ధారించాలని, మేఘదాతు ఆనకట్ట నిర్మాణాన్ని ఎంతమాత్రం అనుమతించకుండా కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. -
వెనక్కు తగ్గం
మేకెదాటు వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తాం దీని వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం ఉండదు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజకీయాలు చేసినా వెనకడుగు వేయకుండా మేకెదాటు ప్రాజెక్టును నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నగరంలోని పీణ్యా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి నాగసంద్ర వరకు నిర్మించిన మెట్రో రీచ్ 3బి రైలు సంచారాన్ని శుక్రవారమిక్కడ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడం ద్వారా 35 టీఎంసీల నీటిని సేకరించవచ్చని, అంతేకాక 400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ జలాశయం నిర్మాణం వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం కలగబోదని తెలిపారు. కావేరి జలాల పంపిణీకి సంబంధించిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గత ఎనిమిదేళ్లుగా ప్రతి ఏడాది తమిళనాడుకు 192 టీఎంసీల నీటిని విడుదల చేస్తూనే వస్తున్నామని చెప్పారు. కావేరి నది నుంచి వృధాగా సముద్రంలోకి వెళుతున్న నీటిని ప్రజల తాగునీటి అవసరాల కోసం మరలించేందుకే మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ జలాశయ నిర్మాణానికి అడ్డుపడడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ృసష్టించినా, ఎన్ని రాజకీయాలు చేసినా మేకెదాటు జలాశయాన్ని నిర్మించి తీరతామని పేర్కొన్నారు. ఇక 42.3 కిలోమీటర్ల పొడవున ఏర్పాటైన మొదటి విడత మెట్రో రైలు పనులను ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చ్ నాటికి పూర్తి చేయనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. రూ.13,845 కోట్ల రూపాయల మొదటి విడత మెట్రో పనుల్లో ఇప్పటికే 94శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మెట్రో మొదటి విడత పనులు పూర్తయిన అనంతరం రూ.26,405 కోట్ల అంచనా వ్యయంతో 72 కిలోమీటర్ల మేర రూపొందించిన మెట్రో రెండో విడత పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక బీబీఎంపీ విభజన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ....బెంగళూరు మహానగర పాలికెనుృబహత్ బెంగళూరు మహానగర పాలికెగా మార్చడమే ఓ అవైజ్ఞానిక నిర్ణయమని, అప్పటి నుంచి నగర ప్రజల సమస్యలు మరింత అధికమయ్యాయని అన్నారు. అందుకే బీబీఎంపీని విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.