వెనక్కు తగ్గం
మేకెదాటు వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తాం
దీని వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం ఉండదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజకీయాలు చేసినా వెనకడుగు వేయకుండా మేకెదాటు ప్రాజెక్టును నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నగరంలోని పీణ్యా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి నాగసంద్ర వరకు నిర్మించిన మెట్రో రీచ్ 3బి రైలు సంచారాన్ని శుక్రవారమిక్కడ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడం ద్వారా 35 టీఎంసీల నీటిని సేకరించవచ్చని, అంతేకాక 400 మెగావాట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ జలాశయం నిర్మాణం వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం కలగబోదని తెలిపారు. కావేరి జలాల పంపిణీకి సంబంధించిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గత ఎనిమిదేళ్లుగా ప్రతి ఏడాది తమిళనాడుకు 192 టీఎంసీల నీటిని విడుదల చేస్తూనే వస్తున్నామని చెప్పారు. కావేరి నది నుంచి వృధాగా సముద్రంలోకి వెళుతున్న నీటిని ప్రజల తాగునీటి అవసరాల కోసం మరలించేందుకే మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు.
ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ జలాశయ నిర్మాణానికి అడ్డుపడడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ృసష్టించినా, ఎన్ని రాజకీయాలు చేసినా మేకెదాటు జలాశయాన్ని నిర్మించి తీరతామని పేర్కొన్నారు. ఇక 42.3 కిలోమీటర్ల పొడవున ఏర్పాటైన మొదటి విడత మెట్రో రైలు పనులను ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చ్ నాటికి పూర్తి చేయనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. రూ.13,845 కోట్ల రూపాయల మొదటి విడత మెట్రో పనుల్లో ఇప్పటికే 94శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మెట్రో మొదటి విడత పనులు పూర్తయిన అనంతరం రూ.26,405 కోట్ల అంచనా వ్యయంతో 72 కిలోమీటర్ల మేర రూపొందించిన మెట్రో రెండో విడత పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక బీబీఎంపీ విభజన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ....బెంగళూరు మహానగర పాలికెనుృబహత్ బెంగళూరు మహానగర పాలికెగా మార్చడమే ఓ అవైజ్ఞానిక నిర్ణయమని, అప్పటి నుంచి నగర ప్రజల సమస్యలు మరింత అధికమయ్యాయని అన్నారు. అందుకే బీబీఎంపీని విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.