సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ ఓటర్లకు ఎరవేసేందుకు భారీ స్థాయిలో నోట్లకట్టలు సరిహద్దులు దాటుతున్నాయి. తాజాగా తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడిలో భారీగా నగదు పట్టుబడింది. డీఎంకే కోశాధికారి దురై మురుగన్‌కు చెందిన కళాశాల, సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో సోదాలు నిర్వహించగా పెద్ద పెద్ద అట్ట పెట్టెల్లో భారీగా నగదు కట్టలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. డబ్బును లెక్కించగా సుమారు రూ. 20 కోట్లకుపైగా నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నగదును సీజ్ చేసి రిజర్వ్ బ్యాంక్‌కు తరలించారు. దురై మురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల కోసం ఈ నగదును దాచిపెట్టి ఉంటారని ఐటీ అధికారులు భావిస్తున్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో కక్ష సాధిస్తోందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సుమారు వంద కోట్లు వ్యానులో తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment