ancestral roots
-
కేరళ నాయర్లూ... రాజస్థాన్ గుజ్జర్లూ చుట్టాలే!
కేరళలో ఉన్న నాయర్లకు.. రాజస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గుజ్జర్లకు మధ్య సంబంధం ఏమిటి? మీకు తెలుసా? ఈ రోజు ఇరువురికీ మధ్య అస్సలు సంబంధం లేకపోవచ్చునేమో కానీ.. ఒకప్పుడు మాత్రం ఇద్దరు దగ్గరి చుట్టాల్లాంటి వారు అంటోంది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ). ఒక్క నాయర్లు మాత్రమే కాదు.. కేరళలోనే ఉండే థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువ్య ప్రాంతానికి చెందిన వారని వీరు జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించారు. కొంచెం వివరంగా చూస్తే.. భారత దేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవ వైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చెబుతారు. యూదులు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వీరందరూ గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఇతరులు మాత్రం వీరందరూ ఇండో సిథియన్ వర్గం వారని, దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జన్యుపరంగా వీరి వలస ఎలా సాగింది? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎండీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ వంటి భూస్వామ్య, యుద్ధ వీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించి అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులు (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు అన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) గుర్తించారు. వీటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో పోల్చి చూశారు. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ‘‘నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయ్యు ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. అంతేకాకుండా... తల్లివైపు నుంచి అందిన జన్యు సమారాన్ని విశ్లేషిస్తే పశ్చి యురేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోందని దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వీరు భాగమై ఉంటారని చెప్పవచ్చునని ఆయన వివరించారు. ‘జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయువ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తెలుస్తుందని అన్నారు. -
Narasaraopeta: చిన్నతురకపాలెం ప్రత్యేకత ఏంటో తెలుసా?
సాక్షి, నరసరావుపేట: పూర్వీకుల ఊరి పేరు అడిగితే ఎవరైనా చెప్పడానికి కాస్త తడుముకుంటారు. కానీ ఆ గ్రామంలో ఇంటి పేరు ముందు ఊరిపేరు పెట్టుకుంటారు. పూర్వీకులను నిత్యం తలచుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని చినతురకపాలెం ప్రత్యేకత ఇది. ఎందుకలా.. ఏమా కథా.. కమామిషు.. అంటే.. వందల ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారంతా కలసి ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చినతురకపాలెం అని పేరు పెట్టుకున్నారు. అందరూ ముస్లింలే. రోజులు గడిచేకొద్దీ పేర్లన్నీ ఒకేలా ఉండడంతో పిలవడంలో గందరగోళం తలెత్తింది. దీంతో ఇంటిపేరు ముందు గానీ, తర్వాత గానీ ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఊరిపేరు చేర్చడం అలవాటు చేశారు అప్పటి పెద్దలు.. ఉదాహరణకు షేక్ సలాముద్దీన్ అనే వ్యక్తి మధిర నుంచి వచ్చినవాడనుకోండి. షేక్ ముందో తర్వాతో మధిర పేరును కలిపారు. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 750 కుటుంబాలు ఉండగా, 550కుపైగా కుటుంబాలు తమ ఇంటిపేరు ముందో తర్వాతో పూర్వీకుల ఊరిపేరు చేర్చుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డుల్లోనూ ఇవే పేర్లను నమోదు చేయిస్తుండడం విశేషం. ఇప్పుడు పుట్టే బిడ్డలకూ ఈ సంప్రదాయం కొనసాగిస్తుండడం గమనార్హం. ఇరవై ఊళ్ల నుంచి వలసలు ఈ గ్రామంలో పొదిలి, చావపాటి, పెట్లూరివారిపాలెం, కూరపాడు, ముప్పాళ్ళ, అనంతవరప్పాడు, గురిజేపల్లి, మధిర, చిరుమామిళ్ళ, తూబాడు వంటి అనేక గ్రామాల నుంచి వలసలు వచ్చిన వారు ఉన్నారు. ఇలా ఇక్కడ ఇరవై ఊళ్ల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. (క్లిక్: జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!) ఆనవాయితీగా వస్తోంది మా పేర్లకు ముందు ఇంటి పేరుతోపాటు పూర్వీకుల గ్రామం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మేమూ కొనసాగిస్తున్నాం. మాకు పుట్టే బిడ్డలకూ అన్ని గుర్తింపు కార్డుల్లోనూ ఇదే తరహాలో నమోదు చేయిస్తున్నాం. – షేక్ పొదిలే ఖాజా మొహిద్దీన్, చిన్న తురకపాలెం గ్రామస్తుడు సౌలభ్యం కోసం... ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండడంతో ఊరుపేర్లతో పిలవడం మొదలెట్టారు. మేమంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారం కావడంతో ఖాజా, సైదా, మస్తాన్‌వలి వంటి పేర్లు ఎక్కువగా పెడుతుంటాం. అందుకే ఇంటి పేరు ముందు పూర్వీకుల ఊరి పేరు పెట్టి పిలవడం మొదలెట్టారు. అదే కొనసాగుతోంది. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా మాకు మాత్రం సౌలభ్యంగా ఉంది. – పెట్లూరివారిపాలెం మహబూబ్ సుభానీ, చిన్నతురకపాలెం గ్రామస్తుడు -
75 ఏళ్ల తర్వాత... తన పూర్వీకులను కలుసుకున్న 92 ఏళ్ల బామ్మ!
ఇస్లామాబాద్: సుహృద్బావన చర్యలో భాగంగా పాకిస్తాన్ హైకమిషన్ రీనా చిబర్ అనే 92 ఏళ్ల భారతీయ మహిళకు మూడు నెలల వీసాను జారీ చేసింది. దీంతో ఆమె తన పూర్వీకులు ఇంటిని సందర్శించడానికి పాకిస్తాన్ పయనమయ్యింది. ఈ మేరకు ఆమె పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ప్రేమ్‌నివాస్‌లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు శనివారం వాఘా అట్టారీ సరిహద్దులను దాటి వెళ్లింది. సదరు మహిళ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో భారత్‌కి తరలివెళ్లింది. అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. ఆ తర్వాత 1965లో ఆమె పాకిస్తాన్లో ఉంటున్న తన పూర్వీకుల ఇంటిని సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేసింది. ఐతే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా... తీవ్ర ఉద్రిక్తల నడుమ ఆమెకు వీసా లభించలేదు. ఆ తదనంతరం ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆమెకు వీసా లభించలేదు. ఎన్నో సిఫార్సులు, మరికొద్దిమంది పలుకబడిన వ్యక్తుల సహాయ సహకారాలతో ఆమె పాకిస్తాన్ హై కమిషన్ నుంచి వీసా పొందగలిగింది. ఈ మేరకు ఆమె తనకు ఇరు దేశాల నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా వీసా పరిమితులను సడలించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. తన పూర్వీకులు ఇంటిని, స్నేహితులను కలుసుకున్నాందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. (చదవండి: చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’) -
పూర్వీకుల జాడ దొరికిందోచ్!
వైఎస్ఆర్ జిల్లా ,చింతకొమ్మదిన్నె : పూర్వీకుల జాడ(చిరునామా) కోసం కొన్ని సంవత్సరాలుగా గాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డికి ఎట్టకేలకు వారు దొరకడంతో ఆయన ఆనందానికి హద్దులు లేవు. తెలంగాణలోని తమ వంశస్తులతో కలసి గురువారం మండలంలోని బయనపల్లి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం తుమ్మల మల్లారెడ్డి, తుమ్మల బాలమల్లారెడ్డి, తుమ్మల యల్లారెడ్డి అనే వృద్ధులను కలసి పూర్వీకుల గురించి ఆరాతీశారు. నాలుగు తరాల క్రితం తమ తాతలది ఇదే గ్రామమని అని తెలుసుకుని మురిసిపోయారు. తమ పెద్దలు ఇక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ తుమ్మల వంశస్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఆయనతో పాటు తెలంగాణ నుంచి తుమ్మల రాజిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలు గ్రామాన్ని సందర్శించారు. -
ముత్తాత జాడ కోసం స్కాట్లాండ్ నుంచి ...
హైదరాబాద్: స్కాట్లాండ్కు చెందిన నికోలస్ గ్రేవ్స్ తన ముత్తాతకు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. నిజాం రైల్వేలో విధులు నిర్వహించిన తన ముత్తాత జేమ్స్ థిడోర్ వివరాల కోసం గ్రేవ్స్ సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా జేమ్స్ థిడోర్కు సంబంధించిన పెన్షన్ బుక్‌ను జీఎం శ్రీవాస్తవకు చూపించారు. ఆయన వెంటనే జేమ్స్స థిడోర్ వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 1932లో నిజాం రైల్వేస్‌లో జేమ్స్ థిడోర్ లోకో ఫిట్టర్‌గా విధులు నిర్వర్తించినట్లు ఈ సందర్బంగా గుర్తించారు. ఆయన 1897 డిసెంబర్ 15న జన్మించారు. కాగా థిడోర్ కుమార్తె... నికోలస్ గ్రేవ్స్ నానమ్మ అయిన ఫిలిస్ మార్గరేట్ చాంపియన్ 1920 సెప్టెంబర్ 19న సికింద్రాబాద్‌లో జన్మించారు.ఇండియాలోని బ్రిటిష్ ఆర్మీలో పని చేసిన పెర్సీ జేమ్స్ చాంపియన్‌తో ఆమె వివాహం అయింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1939లో నికోలస్ గ్రేవ్స్ అమ్మమ్మ, తాతయ్య ఇంగ్లాండ్ తరలి వెళ్లారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఇండియన్ రైల్వే ఫ్యాన్ క్లబ్ సమావేశానికి నికోలస్ గ్రేవ్స్ వచ్చారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను నికోలస్ గ్రేవ్స్ కలిసి... తన ముత్తాత గురించి వివరించారు. దీంతో నికోలస్‌కు తన ముత్తాత సమాచారాన్ని అధికారులు అందించారు. దీంతో నికోలస్ ఆనందపరవశం పొందారు. తన ముత్తాత జేమ్స్ థియోడోర్ పింఛను పుస్తకాన్ని జీఎం శ్రీవాత్సవకు బహుమానంగా అందజేశారు.