అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి!
సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి జవదేకర్
మన ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు తర్క సహితం
ముంబై: భారత శాస్త్రవేత్తలంతా ప్రాచీన సంస్కృత విజ్ఞాన శాస్త్రాలను మదించాలని.. ఆ శాస్త్రాల్లోని సాంకేతిక నిధిని మానవాళి అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవ సారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. శాస్త్రీయ అంశాల్లో వందల ఏళ్ల పరిశీలనలు, అనుభవాలను అత్యంత సూక్ష్మస్థాయిలో అవగాహన చేసుకున్నాకే మన పూర్వీకులు ఆయా సిద్ధాంతాలను రూపొందించారన్నారు.
శాస్త్రీయ పరికరాలు, యంత్రాలు పెద్దగా అందుబాటులో లేకున్నా.. సూక్ష్మస్థాయిలో పరిశీలనలు, అనుభవాలు, తర్కం ఆధారంగానే భారతీయ విజ్ఞానం ఆవిర్భవించిందని, ఆ విజ్ఞానాన్ని తప్పనిసరిగా గుర్తించాలన్నారు. ముంబై యూనివర్సిటీలో ‘102వ భారత సైన్స్ కాంగ్రెస్’లో రెండోరోజైన ఆదివారం ‘సంస్కృతం ద్వారా ప్రాచీన భారతీయ విజ్ఞానం’ అంశంపై జరిగిన గోష్టిలో మంత్రి ప్రసంగించారు.
‘మన సంస్కృతం, పురాతన సైన్స్ ఆధారంగా జర్మన్లు, ఇతరులు కొత్త ఆవిష్కరణలు చేసినప్పుడు మనం మాత్రం ఎందుకు చేయలేం?’ అని ప్రశ్నించారు. జర్మన్లు శ్రద్ధతో సంస్కృతాన్ని ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేశారని, భారత్‌కు నేడు సృజనాత్మక ఆవిష్కరణలు చేసే సంస్కృతి చాలా అవసరమన్నారు.
వేదకాలంలోనే జంబో విమానాలు!
భారత్‌లో పురాతన కాలంలోనే విమాన సాంకేతికత అందుబాటులో ఉండేదని పైలట్ శిక్షణ కేంద్రం రిటైర్డ్ ప్రిన్సిపల్, కెప్టెన్ ఆనంద్ జె బోదస్ వెల్లడించారు. రుగ్వేదాన్ని పేర్కొంటూ ఆయన ప్రాచీన విమానయానానికి సంబంధించిన ఆధారాలను వివరించారు. సదస్సులో ఆదివారం ‘వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత’ అంశంపై ఆనంద్ ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. ‘ఒక దేశం నుంచి మరో దేశానికే కాదు.. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సైతం వెళ్లగల విమానాల గురించి భరద్వాజ మహర్షి 7 వేల ఏళ్ల క్రితమే మాట్లాడారు.
భారత్‌లో ప్రాచీన విమానయానానికి సంబంధించి 97 పుస్తకాల్లో ఆధారాలున్నాయి. అప్పటి విమానాల్లో 40 చిన్న ఇంజిన్లు ఉండేవి. ‘రూపర్కన్ రహస్య’ రాడార్ ద్వారా విమానం ఆకారం పరిశీలకుడికి కనిపించేది’ అని చెప్పారు. భారత ప్రాచీన సైన్స్‌పై చర్చించేందుకు ఐఎస్సీ వందేళ్లు ఎందుకు తీసుకుందని సదస్సులో ప్రసంగించిన పరమ్ సూపర్ కంప్యూటర్స్ రూపకర్తవిజయ్ భట్కర్ ప్రశ్నించారు.
ఇది ప్రతి సదస్సులోనూ భాగం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, సదస్సులో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. మానవజాతికి వివిధ వ్యాధుల చికిత్సకు జెనెటిక్ ఇంజనీరింగ్ పరిష్కారం వంటి పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు.