andhra pradesh bjp
-
బీజేపీ నేత అంజిబాబు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆ పార్టీ పేర్కొంది. కాగా 2019 ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆయన దొరికిపోయారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో రామాంజనేయులు రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌తో పట్టుబడ్డారు. ఆయనతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్) ఇక ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్ వేటుకు గురవుతున్న విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసింది. -
అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత
సాక్షి, గుంటూరు : మద్యం అక్రమంగా రవాణా చేస్తూ బీజేపీ నేత ఒకరు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు సహా మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయలు గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ హాయంలో వైన్స్, బార్లు కూడా ఆయన నిర్వహించారు. తాజాగా అక్రమంగా మద్యం రవాణ చేస్తున్న ఆయనను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మద్య నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33 శాతం మద్యం దుకాణాలను మూసి వేయడంతో పాటు ధరలు పెంచడంతో కొందరు సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్నారు. దొడ్డి దారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల మద్యం వరదలా పారుతోంది. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటు అడ్డంగా దొరికిపోతున్నారు. -
నేడు బెజవాడలో బీజేపీ రాష్ట్రస్థాయి భేటీ
విజయవాడ : బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ కేంద్ర నాయకులతోపాటు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు కార్యకర్తలు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. అలాగే డిసెంబర్ రెండో వారంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల్లో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై కూడా ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబుపై తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని హరిబాబు కోరినట్లు సమాచారం. అదికాక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు ఇప్పటికే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబుపై బీజేపీ నేతల మండిపాటు!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. అనంతపురంలో రౌడీ రాజ్యం నడుస్తోందని జిల్లాకు చెందిన బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్.టి. చౌదరి అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విష్ణు, చౌదరి విమర్శించారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.