నేడు బెజవాడలో బీజేపీ రాష్ట్రస్థాయి భేటీ
విజయవాడ : బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ కేంద్ర నాయకులతోపాటు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు కార్యకర్తలు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. అలాగే డిసెంబర్ రెండో వారంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుల్లో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై కూడా ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబుపై తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని హరిబాబు కోరినట్లు సమాచారం. అదికాక ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు ఇప్పటికే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.