వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్టస్థాయి భేటీ నేడు
సాక్షి, హైదరాబాద్: విభజన రాజకీయాలు, సమైక్య ఉద్యమ సెగల నేపథ్యంలో సోమవారం జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంస్థాగత విషయాలు, తదుపరి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందులో చర్చిస్తారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు వస్తాయి. గతంలో సెప్టెంబర్ 21న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఒక నెల రోజుల ఆందోళన కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమేకాక, ఇప్పటికీ చురుగ్గా ఆందోళనలో పాల్గొంటున్నాయి.
ఢిల్లీలో ఓ వైపు విభజన ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో సోమవారం జరగనున్న ఈ సమావేశంలో అధ్యక్ష హోదాలో జగన్.. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులపై కీలకోపన్యాసం చేస్తారు. మరో నెలన్నర రోజుల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతున్నందున పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన తన ఉపన్యాసంలో దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన రాజకీయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా గాలికి వదలి వేసింది, టీడీపీతో కుమ్మక్కయి ఎలా రాజకీయాలు చేస్తున్నదీ సమావేశంలో చర్చించడంతో పాటుగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటారు.
9.30 గంటలకే..
రాష్ట్ర స్థాయి సమావేశంలో ఉదయం 9.30 గంటల నుంచే నేతల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. పది గంటలకు సమావేశం మొదలవుతుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లో గల ఖాజా మాన్షన్ ఫంక్ష న్ హాలులో సమావేశం జరుగుతుందని సంస్థాగత వ్యవహారాల పార్టీ కో-ఆర్డినేటర్ పి.ఎన్.వి. ప్రసాద్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌కు సమీపంలో గల ఈ హాలుకు సకాలంలో ప్రతినిధులు చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, పార్టీ జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర అధికార ప్రతి నిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, పార్టీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు పాల్గొనాల్సి ఉంటుంది.
23న సాంస్కృతిక ప్రచార కమిటీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించడం కోసం ఈ నెల 23, 24 తేదీల్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని పార్టీ సాంస్కృతిక, ప్రచార కమిటీ విభాగాలు నిర్ణయించాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ప్రచార, సాంస్కృతిక విభాగాల కన్వీనర్లు టీఎస్ విజయ్‌చందర్, వంగపండు ఉషలతో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో మరోసారి సమావేశమై పలు నిర్ణయాలు తీసుకోవాలని నేతలు భావించారు.