విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ నుంచే కొనసాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా ఉంది... ఈ నేపథ్యంలో మరో రాష్ట్ర రాజధాని నుంచి పాలన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కె.హరిబాబు మాట్లాడారు. ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు భారీగా కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై నాయకులు ఈ సందర్భంగా భారీ కసరత్తు చేయనున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడ్ని డిసెంబర్ రెండవ వారంలో ఎన్నుకోనున్నారు. ఆ అంశంపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.