ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి
వాషింగ్టన్: బీజేపీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు సుముఖంగా ఉండడం, పాలనలో పారదర్శకతను తెచ్చే యత్నాలు చేస్తుండడంతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. ఇండియా గతేడాది 4.7 శాతం వృద్ధి సాధించింది. ‘భారత్ గత రెండేళ్లలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడంతో వృద్ధి రేటు ఐదు శాతం దిగువకు పడిపోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఇది 8 శాతానికిపైగా ఉంది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వచ్చే ఏడాది 6.3 శాతం, 2016లో 6.6 శాతం వృద్ధి రేటును భారత్ సాధించే అవకాశం ఉంది..’ అని ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త ఆండ్రూ బర్న్స్ మీడియాకు తెలిపారు. ప్రపంచ ఆర్థిక తీరుతెన్నులపై ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించిన బృందానికి ఈయన సారథి.
వర్ధమాన దేశాల అంచనాల తగ్గింపు
ఆర్థికాభివృద్ధి విషయంలో వర్ధమాన దేశాలకు ఈ ఏడాది నిరాశ ఎదురవుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. వర్ధమాన దేశాలు ఈ సంవత్సరం 5.3% పురోగతి సాధిస్తాయని గత జనవరిలో వేసిన అంచనాను బ్యాంక్ ప్రస్తుతం 4.8%కి కుదించింది. ఈ దేశాలు వచ్చే ఏడాది 5.4%, 2016లో 5.5% వృద్ధి సాధించవచ్చని తెలిపింది. చైనా ప్రభుత్వ యత్నాలు సఫలమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.6% విస్తరిస్తుందని అంచనా వేసింది. ఆసియా దేశాల్లో వృద్ధి రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని పేర్కొంది. పేదరికాన్ని రూపుమాపాలంటే నిర్మాణాత్మక సంస్కరణలను వేగంగా అమలుచేసి విస్తృత ఆర్థిక పురోగతిని సాధించాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు.
నివేదికలోని ముఖ్యాంశాలు:
- ఈ ఏడాది గడిచేకొద్దీ ప్రపంచ ఆర్థిక పురోగతి జోరందుకుంటుంది. గ్లోబల్ ఎకానమీ ఈ ఏడాది 2.8%, వచ్చే ఏడాది 3.4%, 2016లో 3.5 శాతం వృద్ధిచెందుతుంది.
- ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక పురోగతిలో 50 శాతానికిపైగా వాటా అధికాదాయ దేశాలదే ఉంటుంది. గతేడాది ఇది 40 శాతం కంటే తక్కువ స్థాయిలో ఉంది.
- అనేక దేశాల ఆర్థిక ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది.
- చైనా, రష్యాలను మినహాయిస్తే ముఖ్యంగా భారత్, ఇండోనేసియాల్లో వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు గణనీయ పురోగతి సాధించాయి.
వృద్ధి అంచనాలను పెంచిన డీబీఎస్ బ్యాంక్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాలను డీబీఎస్ బ్యాంక్ పెంచింది. ఇప్పటివరకూ ఈ వృద్ధి రేటు అంచనా 6.1 శాతంకాగా, దీనిని 6.5 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ బుధవారం తెలిపింది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణలు అమల్లోకి వస్తాయన్న ఊహాగానాలు అంచనాలు పెంచడానికి కారణమని సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు 5.5 శాతమని డీబీఎస్ బ్యాంక్ అంచనావేస్తోంది.