కోపం రావడం కూడా మంచిదే! ఇలా చేస్తే విజయం మీదే!
ప్రేమ, అభిమానం, ఈర్ష్య, ద్వేషం లాగే కోపం కూడా ఓ సహజ, సహజాత ఉద్వేగం. యాంగర్ మేనేజ్మెంట్ అని దాన్ని చంపుకోవడం కంటే... ఎలా ఛానలైజ్ చేస్తే, దాన్నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటే మంచిదంటున్నారు మానసికవేత్తలూ, ప్రవర్తన శాస్త్రవేత్తలు.
నిజానికి కోపం అన్నది పట్టుదలకు మొదటిమెట్టు. భయం ప్రాణరక్షణకు ఉపయోగపడినట్టే... కోపం పట్టుదలకు కారణమై, ఎట్టకేలకు సక్సెస్‌ను సాధించి పెడుతుంది. అంటారు సైకాలజిస్టులు. అదెలాగో చూద్దాం.
చాణక్యుడి చతురత మొదలుకొని, ఫ్రెంచి విప్లవం వరకు తొలి దశలోని కోపం... తొలుత పట్టుదలగా మారి... తర్వాత వివేచనతో కూడిన వ్యూహం వల్ల మంచి ఫలితాలను ఇచ్చిన సంగతి చరిత్ర చూసిందే. ఇక్కడ ఓ మంచి మార్పు కోసం ప్రజలు తమ యాంగర్‌ను మోటివేటింగ్ అంశంగా చేసుకున్నారన్నది మానసిక విశేషజ్ఞుల విశ్లేషణ.
ఎప్పటి చాణక్యాలో, మరెక్కడి ఫ్రెంచి విప్లవాలో కాదు... ఉప్పు సత్యాగ్రహాలూ, దండి యాత్రలతో మన స్వాతంత్య్రం కూడా ఈ శతాబ్దపు మన ఆగ్రహ విజయ ఫలితమే. ‘ఆగ్రహం నుంచి ఆనందానికి దారి తీసే మంచి దారే మన కోపం’ అని చెబుతున్న ఓ సైకాలజిస్ట్... ఆగ్రహం ప్రభావాన్ని ఇలా వివరిస్తున్నాడు.
‘‘కోపం మొదట మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రేరేపించి స్ఫూర్తిని పుట్టిస్తుంది. పట్టుదల పెంచి విజయం సాధింపజేస్తుంది. చివరగా సంతోషాన్నిస్తుంది. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే యాంగర్ క్రియేట్స్ ఇంపాక్ట్. ఇట్ మొబిలైజెస్, లీడ్స్ టు విక్టరీ దేర్ బై గివ్స్ హ్యాపీనెస్’’.
‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’
ఆశావహ దృక్పథానికి ఆగ్రహమే మార్గం... ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ అన్నది మనోవిశ్లేషకుల మరో మాట. నలుగురు స్టుడెంట్స్ ఒకే రూమ్‌లో చదువుకుంటూ ఉండేవారు. వాళ్లలో ఒకడికి ఓ రేంజ్ మంచి ర్యాంకే వచ్చింది. ఆ ర్యాంకుకు ఆనందించిన ఆ తండ్రి, కొడుక్కి అదే రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశం లేకపోయినా... పక్కరాష్ట్రంలోని ఓ మోస్తరు మంచి కాలేజీలో మెడిసిన్‌లో చేర్పించాడు.
దాంతో తమ మీద తమకే కోపం వచ్చిన ఆ ముగ్గురూ... లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరారు. బాగా చదివారు. దాంతో ఆ ముగ్గురూ సొంతరాష్ట్రంలోనే ఫ్రీ సీట్ సాధించారు. కాస్త ధనవంతుడైన తండ్రికి పుట్టిన మొదట సీటు సాధించిన మిత్రుడి కంటే... తమ కోపం కారణంగా ఇంకా మంచి కాలేజీల్లో, ఇంకా కాస్త చవకగా చదువుకుంటున్నారా మిగతా ముగ్గురు మిత్రులు.
అనేక విజయ వ్యూహాలకు కోపమే కీలకం... కోపాన్ని ఓ ప్రతికూల ఉద్వేగంగా భావిస్తారు. కానీ విజయం సాధించాలనే పట్టుదలకు కావాల్సిన వ్యూహాలను ఆలోచించేలా చేస్తుంది ఆగ్రహం. అయితే కత్తికి లాగే కోపానికీ రెండు అంచులుంటాయి. వివేకం కోల్పోయిన క్రోధం... పన్నాగాలకు దిగుతుంది. వివేచనతో కూడిన కోపం వ్యూహాలతో విజయాలందిస్తుంది. ఉగ్రతకు ఆస్కారమివ్వకుండా ఆగ్రహాన్ని జాగ్రత్తగా ఛానెలైజ్ చేసుకుని గెలుపెలా సాధించాలో తెలుస్తుంది.
తనలోకి తాను చూసుకునేందుకు ఓ సాధనం
తనలోకి తాను తొంగి చూసుకుని, అంతర్మధనంతో, ఆత్మపరిశీలనకు తావిచ్చేది కూడా కోపమే అంటారు జెరెమీ డీన్ అనే సైకాలజీ స్కాలర్. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన ‘‘మేకింగ్ హ్యాబిట్స్, బ్రేకింగ్ హ్యాబిట్స్’’ అనే పుస్తకం రాశారు. మానసిక అంశాలపై బ్లాగ్ కూడా నిర్వహిస్తుంటారు.
ఓ సంఘటన మనలో కోపానికి కారణమైందనుకోండి. అప్పుడు మన ఆగ్రహం సహేతుకమైనదేనా?, మన చేతగానితనం వల్ల కోపం వచ్చిందా?... ఇలా ఆత్మపరిశీలన చేసుకోవడం మానసిక ఔన్నత్యానికీ కారణమవుతుందంటారాయన. మరి అంతా మంచేనా... ఇలా చూసుకున్నప్పుడు ఆగ్రహం వల్ల అంతా మంచే జరుగుతుందా? చెడు జరగదా అంటే... కోపం వల్ల చెరుపు జరిగే అవకాశమూ ఉంది.
అయితే ఆగ్రహంతో కూడిన ఉన్మాద స్థితిలో మంచికీ, చెడుకూ మధ్య తేడా గుర్తించలేనంత వివేచన కోల్పోయినప్పుడు మాత్రమే ఆగ్రహం వల్ల అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు మానసికవేత్తలు. అందువల్ల వివేచన కోల్పోనంత వరకు కోపం కూడా మిత్రుడే!
చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..