చిన్నారుల నిజాయితీ..
సొమ్ముతో దొరికిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించిన విద్యార్థులు
అభినందించిన ఉపాధ్యాయులు, కార్పొరేషన్ కమిషనర్
భివండీ, న్యూస్‌లైన్: పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను, తిరిగి తెచ్చి ఇచ్చిన విధ్యార్థులకు, ఉపాధ్యాయులు, కార్పొరేషన్ కమిషనర్ అభినందించారు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న పాఠశాల నం. 1లో మూడవ తరగతి చదువుతున్న అనికేత్ మారుతి బోయిర్, 7వ తరగతి చదువుతున్న మోనాలి సదా ఆధారి అనే విద్యార్థి కలిసి శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో, మండాయిలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాగ్ దొరికింది. అందులో రూ. 80 వేల నగదుతో పాటు కొన్ని విలువైన కాగితాలున్నాయి.
వెంటనే వారు దాన్ని తమ ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. బ్యాగ్‌లో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్‌పై ఉన్న అడ్రస్‌కు ఫోన్ చేశారు. బాధితుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు అఫ్జల్ ఖాన్ అని తెలుసుకుని అతడి ఇంటికి తీసుకువెళ్లి బ్యాగ్ అందజేశారు. కాగా, పిల్లలిద్దరూ తన బ్యాగ్‌ను సురక్షితంగా అప్పజెప్పినందుకు ఆనందించిన అఫ్జల్ ఖాన్ వారికి కొంత నగదును పారితోషికంగా ఇచ్చారు. అలాగే ఈ విషయాన్ని శిక్షణ మండలి సభాపతి రాజు గాజెంగికి తెలియజేశారు. దాంతో శనివారం రాజు గాజెంగి స్కూలుకు వెళ్లి పిల్లలిద్దరినీ అభినందించారు. ఇదిలా ఉండగా, విషయం తెలుసుకున్న కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావులే సైతం ఇద్దరు విద్యార్థులనూ తన కార్యాలయానికి పిలిపించుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు.