'సీత రాముని కోసం' మూవీ రివ్యూ
టైటిల్ : సీత రాముని కోసం
జానర్ : ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్
తారాగణం : శరత్ శ్రీరంగం, అనిల్ గోపిరెడ్డి, కారుణ్య చౌదరి
సంగీతం, దర్శకత్వం : అనిల్ గోపిరెడ్డి
నిర్మాత : శిల్పా శ్రీరంగం
తెలుగు తెర మీద సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ సినిమాల హవా ఇటీవల కాస్త తగ్గింది. అయితే ఇప్పటికీ ఆ జానర్ సినిమాలకు మంచి ఆదరణ లబిస్తున్న నేపథ్యంలో ఈ శుక్రవారం హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సీత రాముని కోసం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ హర్రర్ సినిమాల మాదిరిగా కేవలం భయం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తో తెరకెక్కిన సీత రాముని కోసం ప్రేక్షకులను ఆకట్టుకుందా..?
కథ :
పారా సైకాలజిస్ట్ అయిన విక్రాంత్ (శరత్ శ్రీరంగం) అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తన అక్కకు పుట్టబోయే బిడ్డ కోసం విక్రాంత్ ఇక్కడ ఓ విల్లా కొంటాడు. అయితే ఆ విల్లాలో ఏదో సమస్య ఉందని తెలియటంతో తానే స్వయంగా సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. పారా సైకాలజిస్ట్ గా ఆత్మల సమస్యలు తెలుసుకోవటంలో అనుభవం ఉన్న విక్రాంత్ తాను కొన్న అంజలి నిలయంలో ఓ చిన్న పాప ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. అయితే ఆ పాపతో పాటు మరో ఆత్మ కూడా ఉండి ఉంటుందని విక్రాంత్ అనుమానం. అదే సమయంలో విల్లాలోని ఆత్మ విక్రాంత్ కు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. (సాక్షి రివ్యూస్) విక్రాంత్ కూడా విల్లా తాను కొనటానికి ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి పాత ఓనర్ రామ్ (అనిల్ గోపిరెడ్డి)ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు విల్లాలో ఉన్న ఆ ఆత్మలు ఎవరివీ..? విక్రాంత్ తో ఆ ఆత్మలు ఏం చెప్పాలనుకున్నాయి..? పాత ఓనర్ రామ్ కి ఆ ఆత్మలకు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
రెగ్యులర్ హర్రర్ జానర్ కు భిన్నంగా ఎమోషనల్ కథను ఎంచుకున్న అనిలో గోపిరెడ్డి, అనుకున్నట్టుగా కథను తెర మీదకు తీసుకురావటంలో సక్సెస్ సాధించాడు. ఫస్ట్ హాఫ్ థ్రిల్లర్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను ఎమోషనల్ డ్రామాగా రూపొందించాడు. అయితే కథలో వేగం తగ్గటం కాస్త ఇబ్బంది పెడుతుంది. దర్శకుడిగా పరవాలేదనిపించిన అనిల్ సంగీత దర్శకుడి మంచి విజయం సాదించాడు. ముఖ్యంగా లాలీ లాలీ పాట థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకులను వెంటాడుతుంది. (సాక్షి రివ్యూస్) నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కీలక పాత్రలో తానే నటించిన అనిల్ నటుడిగా నిరాశపరిచాడు. అనిల్ నటించిన రామ్ పాత్రకు అనుభవం ఉన్న నటుడైతే బాగుండనిపిస్తుంది. హీరోగా శరత్ శ్రీరంగం నటన బాగుంది. శరత్ లుక్, బాడీ లాంగ్వేజ్ విక్రాంత్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. సీత పాత్రలో కారుణ్య చౌదరి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ
సంగీతం
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్