ఆటవిడుపా.. ఆటవికమా..
► సంప్రదాయం పేరుతో మనుషుల జంతుక్రీడలు!
► ప్రపంచ దేశాలన్నిటా కొనసాగుతున్న జంతుహింస
► కీటకాల నుంచి తిమింగలాల వరకూ జీవాలన్నీ బలి
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
సంప్రదాయం.. ఆటవిడుపు.. పేరేదైనా మనిషి తన ఆనందం కోసం జంతువుల మధ్య బలవంతపు పోరాటాలు నిర్వహించడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. జంతువులను స్వయంగా సామూహికంగా హింసించే ఆటవిక క్రీడలూ ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. మనకు సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల పందేలు, జల్లికట్టు నిర్వహణ మీద ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. జంతు ప్రేమికులు ఎంతగా అభ్యంతరం వ్యక్తంచేసినా.. చట్టాలు ఏం చెప్తున్నా, కోర్టులు ఏ ఆదేశాలు ఇచ్చినా సదరు ‘క్రీడా ప్రేమికులు’, ‘సంప్రదాయవాదులు’ ఆయా హింసాత్మక క్రీడల నిర్వహణకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఒక్క మన రాష్ట్రానికో, మన దేశానికో పరిమితం కాదు. ప్రపంచమంతటా ఈ ఆటవిక క్రీడలు సంప్రదాయం రూపంలో కొనసాగుతున్నాయి. చాలా చోట్ల అది నిత్య జూదంగా కూడా అభివృద్ధి చెందింది. అందులో కొన్ని ముఖ్యమైన హింసాత్మక జంతుక్రీడలు...
కోళ్ల పందెం: కోడి పుంజుల మధ్య నిర్వహించే పోటీ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంప్రదాయ క్రీడకు చాలా ప్రాచుర్యం ఉంది. ఇండియాలోనే కాకుండా.. చైనా, జపాన్, ఇరాక్, పాకిస్తాన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి చాలా దేశాల్లో కోళ్ల పందేలు శతాబ్దాలుగా నిర్వహిస్తున్నారు.
గుర్రపు పందెం: మనకు తెలిసి గుర్రపు పందెం అంటే పరుగు పోటీ మాత్రమే. కానీ.. కొన్ని దేశాల్లో మగ గుర్రాల మధ్య పోరాటం నిర్వహిస్తుంటారు. చాలా పోటీల్లో ఏదో ఒక గుర్రం చనిపోయే వరకూ పొటీ కొనసాగుతుంది. చైనాలోని మియావో ప్రజలు ఫిలిప్పీన్స్ దీవి మిండానావోలో ఈ గుర్రపు పందేలు నిర్వహించడం వందల ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, ఇండొనేసియా, ఐస్ ల్యాండ్లలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
ఒంటెల పందెం: ఇది కూడా పరుగు పందెం కాదు. ఒంటెల మధ్య పోరాటం. టర్కీలో నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో దించే ఒంటెలను ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి పెంచుతారు. మధ్య ఆసియా, దక్షిణాసియాల్లోని మరికొన్ని దేశాల్లోనూ ఈ ఒంటెల పోటీలు జరుగుతుంటాయి.
కుక్కల పందెం: మన కోళ్ల పందెం తరహాలోనే కుక్కల మధ్య జరిపే పోరాటం. చైనా, జపాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ఈ క్రీడకు ఎక్కువ ఆదరణ ఉంది. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో పాటు పలు ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కూడా రహస్యంగా డాగ్ ఫైట్ క్లబ్‌లు నిర్వహిస్తుంటారు. కొన్ని రకాల జాతి కుక్కలను ప్రత్యేకంగా పెంచి శిక్షణనిస్తుంటారు. చాలా పోటీల్లో ప్రత్యర్థి కుక్క చనిపోయే వరకూ పోరాటం కొనసాగుతుంది.
దున్నల పందెం: ఎడ్ల పోటీలు మన తెలుగు వాళ్లకు తెలుసు. అందులో ఎడ్ల బలాల ప్రదర్శన జరుగుతుంది. ఇక జల్లికట్టు, బుల్ ఫైట్ పోటీల్లో ఎడ్లు, దున్నలతో మనుషులు పోరాడతారు. కానీ.. అస్సాంలో సంక్రాంతి పండగకు కోళ్ల పందెం తరహాలో దున్నల మధ్య పోరాటంతో పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రీడను కూడా సుప్రీంకోర్టు నిషిద్ధ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ నిర్వహిస్తున్నారు.
పొట్టేళ్ల పందెం: మన దేశంలో పొట్టేళ్ల పందెం కూడా నిన్న మొన్నటి వరకూ నిర్వహించిన విషయం తెలిసిందే. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండొనేసియా వంటి దేశాలు ఈ పొట్టేళ్ల పందేలకు పేరుగాంచాయి. ఈ పందెం కోసం కొన్ని పొట్టేళ్లను ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి పెంచుతుంటారు.
బుల్ బుల్ పందెం: అస్సాంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే మరో పక్షుల పందెం ఇది. బుల్ బుల్ పిట్టల మధ్య పోరాటం నిర్వహించి ఆనందించడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పోటీల నిర్వహణను నిషేధించే అంశంపైనా ఎప్పుడూ పండుగ సమయాల్లోనే చర్చ వస్తుంటుంది.
బుల్ ఫైటింగ్: ఎద్దులు, దున్నలతో మనుషులు చేసే పోరాట క్రీడ. తమిళనాడులో జల్లికట్టు పేరుతో జరుగుతుంది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, వెనిజువెలా, పెరూ తదితర దేశాల్లో ఈ క్రీడను నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో ప్రత్యేకంగా పెంచే కొన్ని జాతుల ఎడ్లు, దున్నలను ఈ క్రీడకు ఉపయోగిస్తారు.
డాల్ఫిన్ల వేట: డెన్మార్క్ లోని ఫెరో దీవి సముద్ర తీరం రక్తంతో నిండిపోతుంది. ఆ దీవిలో యువక్తవయసుకు వచ్చిన యువతీయువకులు ఆ విషయాన్ని ప్రకటించడానికి వందలాది కాల్డెరాన్ డాల్ఫిన్లను వేటాడి హతమారుస్తారు. ఏటా సగటున 838 పైలట్ తిమింగలాలు, 75 డాల్ఫిన్లను చంపేస్తారు. పవర్ బోట్లలో సముద్రంపైకి వెళ్లి ఈ తిమింగలాలు, డాల్ఫిన్లను ఒడ్డుకు తరుముకువచ్చి కర్కశంకా నరికి చంపుతారు. గత 300 ఏళ్లుగా సాగుతున్న ఈ సంప్రదాయంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాతు లాగుడు పోటీ: నేలకు కొన్ని అడుగుల ఎత్తున ఒక తాడుకు బాతును తలకిందులుగా వేలాడదీస్తారు. గుర్రం స్వారీ చేసుకుంటూ వచ్చి ఆ బాతు మొడను పట్టుకుని తల తెంచుకెళ్లాలి. ఈ పని విజయవంతంగా చేసిన వ్యక్తి హీరో. యూరప్ లోని నెదర్లాండ్స్, బెల్జియం, ఇంగ్లండ్‌లతో పాటు అమెరికాలోనూ ఈ క్రీడను నిర్వహిస్తుంటారు.
గాడిదపై మూకుమ్మడి దాడి: స్పెయిన్‌లో పెరో పాలో పండగ పేరుతో జరిగే మరొక సంప్రదాయ క్రీడ ఇది. చాలా ఏళ్ల కిందట ఒక రేపిస్టును పట్టుకున్న ఘట్టానికి ప్రతీకగా ఈ క్రీడను కొనసాగిస్తున్నారు. మద్యం మత్తులోని మగాళ్ల గుంపు ఒక గాడిదపై దాడి చేసి, దానిని సామూహికంగా అన్ని రకాలుగా హింసిస్తూ, నగరంలోని విధుల వెంట ఈడ్చుకెళ్లే క్రీడ ఇది. గాడిద పడిపోయినా దాన్ని మళ్లీ మళ్లీ నిల్చోబెట్టి హింసిస్తూ, దాని గొంతులోనూ మద్యం పోస్తూ ఈ క్రీడను కొనసాగిస్తారు. చివరికి ఆ గాడిద చనిపోతుంది.
చేపల పందెం: కోళ్ల పందెం లాగానే కొన్ని రకాల చేపల మధ్య పోరాటం నిర్వహించడం మరొక సంప్రదాయ క్రీడ. నీటి తొట్టెలు, గాజు జాడీలు, మట్టి తొట్టెలు వంటి వాటిల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇండొనేసియా, వియత్నాం, మయన్మార్, కంబోడియా, లావో వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి.
కుక్కలను చెట్టుకు వేలాడదీసి: స్పెయిన్‌లో వేట కోసం ఉపయోగించే స్పానిష్ గ్రౌండ్ జాతి కుక్కలు గాల్గో. వేట సీజన్ ముగిసిన తర్వాత వేటగాళ్లు తమ కుక్కలను చంపేయటం ఆనవాయితీ. ఎందుకంటే మిగతా సీజన్లో ఆ కుక్కలను అనవసరంగా పోషించటం వారికి ఇష్టం లేదు. ఈ కుక్కలను చెట్లకు వేలాడదీసి, పాడుబడ్డ బావుల్లో వేసే చంపే ఆ ఆనవాయితీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు.
ఎద్దును హింసిస్తూ..: దక్షిణాఫ్రికాలో ఉక్వేష్వామా అనే పండుగ జరుగుతుంది. ఒక ఎద్దు నాలుక కోసివేసి, నోట్లో మట్టి కుక్కుతూ, దాని కళ్లు పీకివేసి, వృషణాలు ధ్వంసం చేస్తూ ఈ క్రీడ సాగుతుంది. కానీ.. దేశ ‘సాంస్కృతిక స్వాతంత్య్రం’ పేరుతో ఈ క్రీడకు జంతు చట్టాల నుంచి మినహాయింపునిచ్చారు.
సముద్రంలోకి తరిమేసి: బ్రెజిల్లో ఫార్రా డె బొయి అనే పండుగ జరుగుతుంది. కొన్ని ఎడ్లను వెంటాడుతూ అవి చనిపోయే వరకూ హింసించడం ఈ క్రీడ. వాటిని సముద్రం వైపుగా తరుముకెళ్తారు. మనుషుల హింసతో బెంబేలెత్తిన ఆ ఎడ్లు వడ్డుకు రావడానికి భయపడి నీళ్లలో మునిగి చనిపోతాయి.
కీచురాళ్ల పందెం: మంగ కీచురాళ్ల (క్రికెట్) మధ్య పోరాటం నిర్వహించడం చైనాలో సంప్రదాయ క్రీడ. కీటకాల బరువు, జాతి ప్రాతిపదికన ఈ పోటీ జరుపుతారు. ఒక గిన్నెలో కీచురాళ్లను ఉంచి వాటి మీసాలను కదిలించి రెచ్చగొట్టడం ద్వారా పోటీ నిర్వహిస్తారు.
పేడపురుగుల పందెం: జపాన్, థాయ్‌లాండ్‌లలో రైనో జాతి పేడపురుగుల (బీటిల్) మధ్య పోటీ నిర్వహించి ఆనందిస్తుంటారు.
స్పైడర్ల పందెం: ఫిలిప్పీన్స్, జపాన్, సింగపూర్‌వంటి దేశాల్లో సాలిపురుగుల (స్పైడర్) మధ్య పోటీలు నిర్వహిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆడ సాలీళ్లు, మరికొన్ని దేశాల్లో మగ సాలీళ్ల మధ్య పోరాటం నిర్వహిస్తారు.