Animal killing
-
Elon Musk: చిక్కుల్లో న్యూరాలింక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ సొంత కంపెనీ న్యూరాలింక్ చిక్కులను ఎదుర్కొబోతోందా?.. అవుననే అంటున్నాయి విదేశీ మీడియా సంస్థలు. మెడికల్ డివైస్ కంపెనీ అయిన న్యూరాలింక్ ద్వారా జంతువులపై ఘోరమైన ప్రయోగాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో ఫెడరల్ దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఫిర్యాదులు చేసింది న్యూరాలింక్‌లో పని చేసే ఉద్యోగులే కావొచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. మనిషి మెదడులో చిప్ అమర్చడం ద్వారా అద్భుతానికి తెర తీయాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నాడు. చిప్ ద్వారా పక్షవాతానికి గురైన వాళ్లు సైతం నడవొచ్చని, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రకటించుకున్నాడు కూడా. ఈ క్రమంలో.. ఇప్పటికే చాలాసార్లు డెడ్‌లైన్ ప్రకటిస్తూ వచ్చాడు. తాజాగా తన మెదడులో చిప్ అమర్చుకునేందుకు రెడీ అని ప్రకటించాడు కూడా. అయితే డెడ్‌లైన్స్‌ను చేరుకునే క్రమంలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, జంతువులపై జరిగిన ప్రయోగాలు వాటికి నరకం చూపించాయని, లెక్కకు మించి జంతువుల మరణం కూడా సంభవించిందని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. 2018 నుంచి న్యూరాలింక్ చిప్ ప్రయోగాల పేరిట.. 280 గొర్రెలు, పందులు, ఎలుకలు, కోతులు, చిట్టెలుకలను చంపింది. వీటి మొత్తం సంఖ్య పదిహేను వందలకు పైనేనని రాయిటర్స్ లెక్క గట్టింది. అయితే.. నిర్లక్ష్య పూరితంగా జరిపిన నాలుగు ప్రయోగాలపై స్పష్టత ఇచ్చే యత్నం చేసింది సదరు కథనం. ఈ నాలుగు ప్రయోగాల ద్వారా 86 పందులు, రెండు కోతులు చనిపోయినట్లు తెలిపింది. అయితే.. ఫెడరల్ దర్యాప్తు ఇవే అంశాలపై జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు జంతువుల మరణాల సంఖ్యను కూడా ఏనాడూ న్యూరాలింక్ ప్రకటించింది లేదు కూడా. సుమారు ఏడాది కిందట న్యూరాలింక్ బ్రెయిన్లో చిప్ అమర్చిన ఓ కోతి కంప్యూటర్ గేమ్ ఆడిన వీడియోను ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
వన్యప్రాణులను చంపిన చంద్రబాబు సన్నిహితుడు
చంద్రగిరి: మూగజీవాలను వేటాడి చంపి, వాటి మాంసాన్ని తరలించేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి సన్నిహితుడితోపాటు అతడి అనుచరులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 200 కిలోలకు పైగా కణితి మాంసాన్ని, జేసీబీని శుక్రవారం సీజ్ చేశారు. అధికారుల కథనం మేరకు... ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు సమీపంలోని రిజర్వ్ ఫారెస్టులో అదే గ్రామానికి చెందిన కామాటి మునిరత్నం యాదవ్, అతడి అనుచరులు మూగ జీవాలను వేటాడారు. మూడు కణితులను హతమార్చి, మాంసాన్ని వేరు చేస్తున్నారు. సమాచారం అందుకున్న బాకరాపేట, ఎ.రంగంపేట అటవీ శాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టులో మునిరత్నం యాదవ్, అతడి అనుచరులు సుబ్రహ్మణ్యం, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. మూగజీవాల వేట కేసులో ఏ1 నిందితుడిగా మునిరత్నం యాదవ్‌ను చేర్చినట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మూగజీవాల వేట కేసులో ప్రధాన నిందితుడైన కామాటి మునిరత్నం యాదవ్ స్వగ్రామం నారావారిపల్లె. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాడు. గతంలో కూడా రిజర్వ్ ఫారెస్టు భూమిని చదును చేసి, అక్రమంగా పట్టాలు పొందడంతో అటవీ అధికారులు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు రానున్న టీడీపీ ముఖ్య నేతలకు విందు ఏర్పాటు చేయడానికి మునిరత్నం యాదవ్ మూగజీవాలను వేటాడినట్లు తెలుస్తోంది. కేసును నీరుగార్చేందుకు టీడీపీ నేతల యత్నం! వన్యప్రాణులను వేటాడి పట్టుబడిన మునిరత్నం యాదవ్‌ను కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో కేసును నీరుగార్చేందుకు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. -
చక్రాపూర్‌లో చిరుత కలకలం
మూసాపేట (దేవరకద్ర) : మండలంలోని చక్రాపూర్ గ్రామంలో చిరుత పులి వరుస దాడులతో కలకలం సృష్టిస్తోంది. గ్రామ శివారులోని అడవిలో గత కొన్ని నెలల నుంచి చిరుత పులి సంచరి స్తూ.. మూగజీవాలపై దాడి చేస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా వరుస దాడులు చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పంటలకు కాపలా వెళ్లి అడవి జంతువుల బారి నుంచి కాపాడుకోలేక.. మరో పక్క చేసిన అప్పులను తీర్చలేక లబోదిబోమంటున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలానికి వెళ్లడానికే జంకుతున్నారు. అడవులకు అతి సమీపంలో.. చిరుతపులి గడిచిన నాలుగు నెలల్లో 6 మేకలు, రెండు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. చక్రాపూర్ గ్రామానికి, సమీపంలోని తండాలకు అడవులు దగ్గరగా ఉండటంతో తరచూ చిరుత సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన హరిజన్ కుర్మయ్య, మాసన్న, కావలి తిరుమలయ్యకు చెందిన మేకలను చంపి ఎత్తుకెళ్లగా.. తిరుమలి ఎర్రన్నకు చెందిన లేగ దూడను కూడా చంపడం కలకలం రేపుతోంది. ఇన్ని రోజుల నుంచి అడవిలో పందులు, ఎలుగుబంట్లు, నక్కల సంచారం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు చిరుత సంచారంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం ఎక్కువైందని వాపోయారు. గ్రామస్తులకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా కూడా జంకుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే రాత్రివేళల్లో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు స్పందించి చిరుత పులిని బంధించి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి కోసం వచ్చింది చిరుత పులులు ఎప్పుడూ అడవిలోనే తిరుగుతాయి. ప్రస్తుతం ఈ అడవిలో ఒకే ఒక్క చిరుత ఉంది. దానికి తాగునీరు దొరకక.. గ్రామ సమీపంలోకి వచ్చి పశువులపై దాడి చేసి ఉంటుంది. చుట్టుపక్కల పొలాల దగ్గర ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి «æదాహం వేసినప్పుడు ఎవరి మీదైనా దాడి చేస్తాయి. అడవిలో చిరుత కోసం తొట్లు ఏర్పా టు చేసి నీళ్లు పోస్తున్నాం. మేకపోతు చిరుత దాడిలో మృతిచెందింది. కాబట్టి నష్టపరిహారం చెల్లించేలా చూస్తాను. – నరేందర్, బీట్ ఆఫీసర్, మూసాపేట మమ్మల్ని పట్టించుకోరా? ప్రతినిత్యం మూగజీవాలైన పశువులు, మేకలు, గొర్రెలను కాపరులు గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్తున్నా కూడా వాటికి సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. అడవిలో ఉన్న వనరులతో కనీస అవసరాలైన కట్టెలు, రాళ్లు, ఇసుక ఇలా ఏదో ఒకటి గ్రామానికి తీసుకువచ్చిన కూడా అటవీ శాఖాధికారులు మాత్రం వారిపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప ఇలా అటవీ జంతువులు మూగజీవాలపై దాడులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని రీతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అడవిలో సిమెంట్ రింగులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోయడం ఎంత వరకు సబబని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శిక్షలు, జరిమానాలు నామమాత్రమే
అందుకే జంతుహింస పెరుగుతోంది చట్ట సవరణలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్ సాక్షి, హైదరాబాద్: జంతుహింస నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. శిక్షలు, జరిమానాలు నామమాత్రంగా ఉండడం వల్లే జంతుహింస ఆగడం లేదని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. కఠిన శిక్ష, జరిమానాలకు వీలుగా చట్టాలను సవరించాల్సిన అవసరముందని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించింది. జంతుహింసను విచారణకు స్వీకరించదగ్గ నేరం (కాగ్నిజబుల్)గా పరిగణించాలని కూడా కేంద్రాన్ని కోరనున్నామని నివేదించింది. రాష్ట్రస్థాయిలో జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపింది. జంతుహింస నిరోధక చట్టాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు పేర్కొంది. మార్కెట్ కమిటీల నిధులతో అన్ని పశు సంతల్లో ర్యాంపులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వివరించింది. పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలోని పశువుల మార్కెట్లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతుహింస నిరోధంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతురక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జంతుహింస వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ కౌంటర్ దాఖలు చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జంతువులను అక్రమంగా తరలిస్తూ క్రూరంగా వ్యవహరిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించేందుకు సమన్వయంతో పనిచేయాలని రవాణా, పోలీస్, పశు సంవర్థకశాఖలతో జరిగిన సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. జంతు రవాణాపై ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని, జంతుహింస నిరోధక సొసైటీలు(ఎస్పీసీఏ)లను 8 జిల్లాల్లో ఏర్పాటు చేశామని, మిగిలినచోట్ల త్వరలోనే ఏర్పాటు చేస్తామని నివేదించారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి... ‘చట్ట ప్రకారమే జంతు రవాణాకు అనుమతినిస్తాం. వెటర్నరీ డాక్టర్ జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా జంతువుల తరలింపునకు అనుమతినివ్వబోం. జంతువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పశుసంపద వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి. జంతు రవాణాకు జిల్లా అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. తెలంగాణలో ప్రస్తుతం 19 పశు సంతలున్నాయి. జంతు రవాణాలో నిర్లక్ష్యం వహిస్తే రూ.1000 జరిమానా విధించే అధికారం రవాణాశాఖ కమిషనర్‌కు ఉంది’ అని రాజీవ్‌శర్మ తన కౌంటర్లో పేర్కొన్నారు..