కామాటి మునిరత్నం యాదవ్ నుంచి స్వాధీనం చేసుకున్న కణితి మాంసాన్ని పరీక్షలకు తరలిస్తున్న అధికారులు
చంద్రగిరి: మూగజీవాలను వేటాడి చంపి, వాటి మాంసాన్ని తరలించేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి సన్నిహితుడితోపాటు అతడి అనుచరులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 200 కిలోలకు పైగా కణితి మాంసాన్ని, జేసీబీని శుక్రవారం సీజ్ చేశారు. అధికారుల కథనం మేరకు... ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు సమీపంలోని రిజర్వ్ ఫారెస్టులో అదే గ్రామానికి చెందిన కామాటి మునిరత్నం యాదవ్, అతడి అనుచరులు మూగ జీవాలను వేటాడారు. మూడు కణితులను హతమార్చి, మాంసాన్ని వేరు చేస్తున్నారు. సమాచారం అందుకున్న బాకరాపేట, ఎ.రంగంపేట అటవీ శాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టులో మునిరత్నం యాదవ్, అతడి అనుచరులు సుబ్రహ్మణ్యం, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. మూగజీవాల వేట కేసులో ఏ1 నిందితుడిగా మునిరత్నం యాదవ్‌ను చేర్చినట్లు సమాచారం.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు
మూగజీవాల వేట కేసులో ప్రధాన నిందితుడైన కామాటి మునిరత్నం యాదవ్ స్వగ్రామం నారావారిపల్లె. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాడు. గతంలో కూడా రిజర్వ్ ఫారెస్టు భూమిని చదును చేసి, అక్రమంగా పట్టాలు పొందడంతో అటవీ అధికారులు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు రానున్న టీడీపీ ముఖ్య నేతలకు విందు ఏర్పాటు చేయడానికి మునిరత్నం యాదవ్ మూగజీవాలను వేటాడినట్లు తెలుస్తోంది.
కేసును నీరుగార్చేందుకు టీడీపీ నేతల యత్నం!
వన్యప్రాణులను వేటాడి పట్టుబడిన మునిరత్నం యాదవ్‌ను కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో కేసును నీరుగార్చేందుకు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment