శుభకార్యానికి వెళ్తూ మృత్యు ఒడికి..
మంచిర్యాల రూరల్/తాండూర్ : మనవరాళ్లకు చెవులు కుట్టించే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరిన సింగరేణి కార్మికుడిని మృత్యువు వెంటాడింది. మంచిర్యాల మండలం దొనబండ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో మృత్యుఒడికి చేరాడు. అతడి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉంది. హాజీపూర్ ఎస్సై ఢీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం మాదారం టౌన్షిప్లో నివాసం ఉంటున్న అనిరెడ్డి నారాయణరెడ్డి(53) అక్కడే సింగరేణిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లలిత, కూతురు శ్వేత, కుమారుడు రంజిత్‌రెడ్డి ఉన్నారు.
కూతురుకు వివాహం కాగా చెన్నయ్‌లో ఉంటోంది. కుమారుడు రంజిత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎంటెక్ చదువుతున్నాడు. శ్వేత తన పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమం కోసం దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో ఏర్పాటు చేసుకుంది. చెన్నూర్ నుంచి ఆమె పిల్లలతో గూడెంకు వెళ్లగా.. నారాయణరెడ్డి తనకు తెలిసిన వారి వద్ద కారు తీసుకుని కుమారుడు, భార్య, మరదలు(భార్య చెల్లెలు)తో కలిసి మాదారంటౌన్‌షిప్ నుంచి బ యల్దేరాడు. రంజిత్‌రెడ్డి కారు నడుపుతుండ గా మంచిర్యాల మండలం దొనబండ వద్ద కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
దీంతో కారు ఎడమ భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ వైపు కూర్చున్న నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకాల కూర్చున్న లలిత, ఆమె చెల్లెలు గీట్ల పద్మ, రంజిత్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. లలిత, రంజిత్‌రెడ్డిల పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కార్మికుడి మృతితో మాదారంటౌన్షిప్లో విషాదం నెలకొంది. మృతుడి అల్లుడు శ్యాంసుందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.