వచ్చే పదేళ్లు 15% పైనే రాబడి..
‘సాక్షి’ ఇంటర్వ్యూ
ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) అనీష్ శ్రీవాస్తవ
2015 ఆదాయాలతో పోలిస్తే మార్కెట్లు ఖరీదే కాని.. దీర్ఘకాలానికి చౌకే
- ఇప్పటికీ దూరంగానే రిటైల్ ఇన్వెస్టర్లు
- ఎఫ్ఐఐల పెట్టుబడులతోనే మార్కెట్ పెరుగుతోంది
- రుతుపవనాల ప్రభావం మార్కెట్‌పై తక్కువే
- ఇన్ఫ్రా, అగ్రి, దేశీయ వినియోగ రంగాల షేర్లకే ఓటు
గడిచిన ఐదేళ్ల నుంచి ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు తొలగి దేశఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి పయనిస్తోందని, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలను మార్కెట్లు ఇంకా డిస్కౌంట్ చేసుకోలేదంటున్నారు ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) అనీష్ శ్రీవాస్తవ. వచ్చే పదేళ్లు 15 శాతానికిపైగా లాభాలను అందించే శక్తి దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు ఉందంటున్న అనీష్ శ్రీవాస్తవతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
ఇంకా మార్కెట్లపై మోడి ప్రభావం ఉందా లేక ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీనా? పెద్ద పతనం లేకుండా కొనసాగుతున్న ర్యాలీని ఏ విధంగా చూస్తున్నారు.?
ఇది ప్రీ బడ్జెట్ లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ కాదు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఆర్థిక వృద్ధిరేటును పెంచే విధంగా చర్యలు తీసుకుం టోందన్న నమ్మకంతో మార్కెట్లు పెరుగుతున్నాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో విధానపరమైన కఠిన నిర్ణయాలు సులభంగా తీసుకునే వెసులుబాటు కలిగివుంది. అంతే కాకుండా దేశంలో అత్యధికంగా ఉన్న యువశక్తితో 2040 వరకు ఇండియా చాలా లబ్ధి పొందనుంది. గడిచిన ఐదేళ్లు ఎదుర్కొన్న గడ్డుపరిస్థితులు తొలగి ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోకి పయనించనుంది. దీంతో కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరగనున్నాయి. ఈ అంశాలతో విదేశీ పెట్టుబడిదారులు ఇండియా పట్ల ఆకర్షితులవుతున్నారు. దీంతో దీర్ఘకాలి కంగా చూస్తే ఈక్విటీలు మంచి లాభాలే అందించనున్నాయి. ప్రస్తు తం బాగా పెరగడంతో ఈ ఏడాది కంపెనీల ఆదాయంతో పోలిస్తే సెన్సెక్స్ వాస్తవ విలువ కంటే అధికంగా ఉన్నప్పటికీ 2015-16 అంచనాలతో పోలిస్తే వాస్తవ విలువ కంటే తక్కువగా ఉంది.
ప్రపంచ బ్యాంక్... తాజాగా అంతర్జాతీయ వృద్ధిరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇండియాపై ఏమైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందా?
మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో వృద్ధిరేటు అంచనాలను పెంచాము. గతేడాది 4.6%గా ఉన్న జీడీపీ ఈ ఏడాది 5.6%కి, వచ్చే ఏడాది 6.8%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ అంతర్జాతీయ వృద్ధిరేటు తగ్గినా అది మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నా దిగుమతులపై అధికంగా ఆధారపడే మనం ముడి చమురు ధరలు, ఆహార ధాన్యాల ధరలు తగ్గడం ద్వారా లబ్ధిపొందుతాం.
దీర్ఘకాలంలో దేశీ స్టాక్ సూచీలు ఏ స్థాయికి పెరిగే అవకాశం ఉంది?
స్టాక్ సూచీల కదలికలు కంపెనీల లాభదాయకతపై ఆధారపడి ఉంటుంది. 2014-15 ఆదాయాలను సూచీలు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. అదే 2015-16 ఆదాయాలతో పోలిస్తే సెన్సెక్స్ 29,500 స్థాయి అనేది వాస్తవ విలువకు దగ్గరగా ఉంటుంది. భవిష్యత్తులో వృద్ధిరేటు పెరిగి కార్పొరేట్ లాభాలు ఏటా 15% పైన పెరిగే అవకాశాలున్నాయి. ఆమేరకు సెన్సెక్స్ కూడా వచ్చే పదేళ్లు సగటున 15-18% లాభాలను అందిస్తుందని అంచనా వేస్తున్నాం.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే మొట్టమొదటి బడ్జెట్ నుంచి మార్కెట్ ఏమి ఆశిస్తోంది?
ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళిక వ్యయానికి ప్రాధాన్యత ఉండే విధంగా బడ్జెట్ ఉండాలని ఆశిస్తోంది. అలాగే సబ్సిడీ భారం తగ్గించుకుంటూ, పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. మొదటి ఏడాది నిధుల సమీకరణ కష్టం కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణపై ఎక్కువగా దృష్టిసారించొచ్చు. ఈ విధంగా బడ్జెట్ ఉంటే స్టాక్ మార్కెట్‌కు మరింత శక్తి వస్తుంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌కు ఉన్న భయాలు ఏమిటి?
కరువు అనేది ప్రధానమైన రిస్క్. ఎలెనినో ప్రభావంతో వర్షాలు తగ్గినందువల్ల ద్రవ్యోల్బణం పెరిగి, వృద్ధిరేటు తగ్గినా, అది మార్కెట్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదు. మధ్య దీర్ఘకాలానికి చూస్తే అమెరికా వడ్డీరేట్లు, డాలరు బలపడటం అనేవి మార్కెట్లు ఎదుర్కొనే భయాలు.
ప్రస్తుతం ఏయే రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. వేటికి దూరంగా ఉంటున్నారు?
ఇన్ఫ్రా, నిర్మాణం, వ్యవసాయ రంగాలతో పాటు దేశీయ వినియోగ శక్తిని ప్రతిబింబించే రంగాల షేర్లు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ర్యాలీలో వీటిల్లో కొన్ని షేర్లు కనిష్ట స్థాయి నుంచి ఇప్పటికే బాగా పెరిగినప్పటికీ దీర్ఘకాలంగా చూస్తే ఇంకా ఆకర్షణీయంగానే ఉన్నాయి.
ఎఫ్ఐఐలు కొంటుంటే, దేశీయ ఫండ్స్ అమ్ముతున్నాయి. ఇంకా రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లకు దూరంగానే ఉన్నారా?
ప్రస్తుత ర్యాలీ అంతా ఎఫ్ఐఐల కొనుగోలుతోనే జరిగింది. దీర్ఘకాలంలో ప్రపంచ దేశాలకు ఇండియా ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సూచీలు నూతన గరిష్ట స్థాయిలను దాటినా రిటైల్ ఇన్వెస్టర్లు ఇంకా దూరంగానే ఉన్నారు. దేశీయ ఫండ్స్ ఇంకా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యులిప్స్ పథకాల ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎటువంటి పురోగతి లేదు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశానికి మరికొంత సమయం పడుతుంది.