తూచ్!...అందరూ నిర్దోషులే
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఆరుగురు ఇప్పటికీ పోలీసులకు దొరకలేదు. అయితే వీళ్లంతా పాత నేరస్థులు.
వాళ్ల వల్ల భారత క్రికెట్ అప్రతిష్టపాలైందన్నారు... ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అంటూ అందరిలోనూ చులకన భావాన్ని తెచ్చారు... ఇందులో మాఫియా ఉందన్నారు... రెండేళ్ల పాటు రకరకాల వార్తలతో, కేసులతో హోరెత్తించారు. తీరా చూస్తే... అంతా తూచ్ అని తేల్చారు. శ్రీశాంత్, చండిలా, అంకిత్ చవాన్ ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో ఈ ముగ్గురితో పాటు మరో 33 మందిపై ఉన్న అన్ని కేసులనూ ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.
ఆ ముగ్గురూ ఫిక్సింగ్ చేసినట్లు ఆధారాల్లేవు
శ్రీశాంత్, చండిలా, అంకిత్ చవాన్లపై అన్ని కేసులూ కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఊహించని తీర్పు వచ్చింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలు నిర్దోషులని అడిషనల్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోయారని అడిషనల్ సెషన్స్ జడ్జీ నీనా బన్సాల్ కృష్ణ వ్యాఖ్యానించారు. కేసుతో సంబంధం ఉన్న 36 మందిపై నమోదైన అన్ని కేసులను కోర్టు కొట్టేసింది. మహారాష్ట్ర వ్యవీస్థీ కృత నేరాల చట్టం (మోకా) కేసు నుంచి కూడా ఆటగాళ్లను తప్పించింది. దీనికి సంబంధించిన ఆరోపణలకు తగిన రుజువులు లేవని వెల్లడించింది. ఉదయమే కేసును విచారణకు తీసుకున్నా... తీర్పు మాత్రం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వెలువరించారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన శ్రీశాంత్ తీర్పు అనంతరం కన్నీళ్లపర్యంతమవుతూ మోకాళ్లపై కూలబడిపోయాడు. చవాన్, చండిలాలు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు.
ఇదీ కేసు...
ఐపీఎల్-6 సందర్భంగా శ్రీశాంత్, చవాన్, చండిలాలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో బీసీసీఐ వీరిపై జీవితకాల నిషేధం కూడా విధించింది. తదనంతర విచారణలో ఇందులో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ హస్తం ఉందని ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. 6 వేల పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు తర్వాత మరిన్ని సప్లిమెంటరీ చార్జ్షీట్లు కూడా వేశారు. కేసుతో సంబంధం ఉన్న వారందరిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), రెడ్ విత్ 419 (వ్యక్తిగత మోసానికి పాల్పడటం), 420 (మోసం చేయడం)తో ‘మోకా’లోని వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు.
నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐ
కోర్టు తీర్పుతో ఊరట పొందిన క్రికెటర్లు బీసీసీఐ నుంచి చేదు వార్త వినాల్సి వచ్చింది. ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. తమ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పింది. ‘క్రమశిక్షణ చర్యలు బీసీసీఐ స్వతంత్రంగా తీసుకుంది. ఇందులో నేర విచారణకు తావులేదు. కమిటీ ఇచ్చిన తీర్పు ఆధారంగా బోర్డు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దాన్ని తొలగించలేం’ అని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఐపీఎల్ ఆఫీస్ బేరర్‌గా పని చేస్తున్న ఢిల్లీ పోలీస్ మాజీ కమిషనర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. నిషేధం ఎత్తివేయాలని బోర్డుకు మెయిల్ పంపిస్తానని కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు టీసీ మ్యాథ్యూ చెప్పారు.
కేసు సాగిందిలా...
►మే 16, 2013: రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. వీరితో పాటు ఐపీఎల్లో గతంలో ఆడిన అమిత్ సింగ్‌తో సహా మరో 11 మంది బుకీలను అరెస్టు చేశారు.
►మే 17, 2013: విచారణలో శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
►మే 18, 2013: ఢిల్లీ పోలీసులు చండిలా ఇంటిపై దాడి చేశారు.
►మే 28, 2013: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. కేసును విచారించేందుకు కమిటీ ఏర్పాటు.
►జూన్ 10, 2013: శ్రీశాంత్, చవాన్లకు బెయిల్ వచ్చింది.
►జూలై 30, 2013: శ్రీశాంత్, చవాన్, చండిలా, దావూద్, షకీల్‌తో సహా 39 మందిని నిందితులుగా ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
►సెప్టెంబరు 9, 2013: చండిలాకు కూడా బెయిల్.
►సెప్టెంబరు 13: శ్రీశాంత్, చవాన్‌లను బీసీసీఐ జీవితకాలం నిషేధించంది. అమిత్ సింగ్‌పై ఐదేళ్లు నిషేధం విధించారు. ఫిక్సింగ్ చేయమని సహచరులు కోరిన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకు రానందుకు సిద్దార్ధ్ త్రివేదిపై ఏడాది నిషేధం విధించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న స్పిన్నర్ హర్మీత్‌పై ఎలాంటి ఆధారాలు లేనందున చర్యలు తీసుకోలేదు.
►నవంబర్ 18, 2013: బుకీ చంద్రేశ్ జైన్ అలియాస్ జూపిటర్‌పై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు.
►ఆగస్టు 16, 2014: దావూద్, చోటా షకీల్ ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశం.
►సెప్టెంబర్ 30, 2014: దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, సందీప్ శర్మలు నేరస్తులని అభిప్రాయపడిన కోర్టు.
►మే 8, 2015: వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.
►జూలై 25, 2015: శ్రీశాంత్, చవాన్, చండిలా ముగ్గురు నిర్దోషులని కోర్టు తీర్పు. వీళ్లపై నమోదైన అన్ని కేసులను కొట్టివేసింది.
భవిష్యత్ ఏమిటి?
►కోర్టు నిర్దోషులని తేల్చిన తర్వాత బీసీసీఐ నిషేధం ఎత్తివేయాలి. నిజానికి ఈ కేసు బోర్డుకు, క్రికెటర్లకు మధ్య కాదు. ఒకవేళ పైకోర్టుకు వెళ్లినా ఢిల్లీ పోలీసులు వెళ్లాలి గానీ బీసీసీఐ కాదు. కానీ బోర్డు వీళ్లపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. కాబట్టి వీళ్లు ముగ్గురూ తమపై నిషేధం ఎత్తివేయమని కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
►ఒకవేళ నిషేధం ఎత్తివేయాలని కోర్టు తీర్పు ఇస్తే... తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించి ఈ ముగ్గురూ ఐపీఎల్ జట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్లు నిర్దోషులుగా బయటకొచ్చినా ఇంకా అభిమానుల మనసుల్లో పూర్తిగా అనుమానాలు తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో ఏదైనా ఫ్రాంచైజీ వీళ్లని తీసుకుంటుందా? లేదా? అనేది కూడా ఆసక్తికర అంశమే. అయితే ఇదంతా జరగటానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా నిరీక్షించడం తప్ప ఏమీ చేయలేరు. ఈ కేసు తేలే సమయానికి వీళ్లలో క్రికెట్ ఆడే ఫిట్నెస్ ఉంటుందా అనేది సందేహమే.
అతనే చీఫ్!: స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, చండిలా, చవాన్‌లను అరెస్ట్ చేసిన అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ప్రస్తుతం బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్‌కు అధిపతిగా పని చేస్తున్నారు. అప్పట్లో కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టిన నీరజ్ విచారణలో అనేక కోణాలను బయటకు తీసుకొచ్చారు. కానీ కొంత విచారణ తర్వాత నీరజ్ రిటైర్మెంట్ కావడంతో మరో అధికారి దాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ క్రికెటర్లపై నిషేధాన్ని తొలగించేందుకు బోర్డు నీరజ్ సలహాపైనే ఆధారపడనుంది.
చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే క్రికెట్ సాధన మొదలుపెడతా. శిక్షణ సౌకర్యాలను వినియోగించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందని భావిస్తున్నా. ఫిట్నెస్ సాధించి సెలక్షన్లో పాల్గొంటా. దేవుడు నాపై ఎనలేని కరుణ చూపాడు. క్రికెట్ ఆడటం కోసమే నేను పుట్టాను. మొదట నేను క్రికెటర్ని. ఆ తర్వాతే ఏదైనా. ఈ మొత్తం ఎపిసోడ్లో బోర్డు బాగా మద్దతిచ్చింది. కేసు నుంచి బయటపడితే మళ్లీ క్రికెట్ ఆడొచ్చని మ్యాథ్యూ సార్ చెప్పారు. నా కూతురు పెరిగి గూగుల్‌లో నా పేరు వెతికే సమయానికి పూర్తి క్లీన్‌గా కనిపించాలి. ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభించాలి. ఈ కష్టకాలంలో నా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- శ్రీశాంత్
►మా ప్రార్థనలు ఫలించాయి. దేవుడికి కృతజ్ఞతలు. అన్నింటికి ఆ దేవుడే సాక్షి. నా కుమారుడి నిర్ధోషితత్వాన్ని నిరూపించేందుకు సాయపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత చాలా క్షోభను అనుభవించాం. అనుకూలంగా రావాలని దేవుళ్లను వేడుకున్నాం. ఇప్పుడు అది ఫలించింది.’
-శాంతకుమారన్, సావిత్రి దేవి
(శ్రీశాంత్ తల్లిదండ్రులు)
కేసు నుంచి బయటపడ్డా. ఇక క్రికెట్ ఆడటంపై దృష్టిపెట్టాలి. అయితే ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తా. ఓ క్రికెటర్‌గా చాలా కష్టకాలం అనుభవించా. నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. వీలైనంత త్వరగా మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడతా.
-చవాన్
న్యాయ వ్యవస్థపై, దేవుడిపై నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు బీసీసీఐని నమ్ముతున్నా. మళ్లీ ఆడే అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నా. తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలో మా లాయర్‌తో చర్చిస్తా. నా జీవితంలో ఇది అత్యంత కష్టకాలం. నా కుటుంబ సాయం మర్చిపోలేను. రెండేళ్ల తర్వాత అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. అలాగే జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
-చండీలా
పటియాల హౌస్ కోర్టు తీర్పు ఆ ముగ్గురు క్రికెటర్లకు మేలు చేస్తుంది. ఫిక్సింగ్ విషయంలో కోర్టు తాము నమ్మిన విషయాన్నే వెలువరించింది. శ్రీశాంత్‌పై అన్ని అభియోగాలను వెనక్కితీసుకున్నారు కాబట్టి తన విషయంలో బీసీసీఐకి ఎలాంటి సమస్య లేదనే అనుకుంటున్నాను. అయినా తను జట్టులోకి వచ్చే విషయం పూర్తిగా బోర్డు చేతిలోనే ఉంది.
- సౌరవ్ గంగూలీ (భారత మాజీ కెప్టెన్)