భారత క్రికెట్‌ను కుదిపేసిన ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఊహించని తీర్పు వచ్చింది. ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలు నిర్దోషులని అడిషనల్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోయారని అడిషనల్ సెషన్స్ జడ్జీ నీనా బన్సాల్ కృష్ణ వ్యాఖ్యానించారు. కేసుతో సంబంధం ఉన్న 36 మందిపై నమోదైన అన్ని కేసులను కోర్టు కొట్టేసింది. మహారాష్ట్ర వ్యవీస్థీ కృత నేరాల చట్టం (మోకా) కేసు నుంచి కూడా ఆటగాళ్లను తప్పించింది. దీనికి సంబంధించిన ఆరోపణలకు తగిన రుజువులు లేవని వెల్లడించింది. ఉదయమే కేసును విచారణకు తీసుకున్నా... తీర్పు మాత్రం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వెలువరించారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన శ్రీశాంత్ తీర్పు అనంతరం కన్నీళ్లపర్యంతమవుతూ మోకాళ్లపై కూలబడిపోయాడు. చవాన్, చండిలాలు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు.