లిప్‌స్టిక్ వేసుకుని పెదవుల్ని నొక్కుకున్నాకే!
‘నీలోని స్త్రీ కోణాన్ని దర్శించనిదే నువ్వు పరిపూర్ణమైన పురుషుడివి కాలేవు’.. బాబిల్ అన్నాడు ఇలాగని! బాబిల్ 20 ప్లస్ కుర్రాడు. దివంగత నటు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటాడు. దీప్ పతారే అని ఇంకో యంగ్ గై ఉన్నాడు. లిప్‌స్టిక్ అద్దుకుని, పెదవుల్ని పెదవులతో ఓ సారలా నొక్కుకుని అద్దంలో సరిచూసుకున్నాకే బయటికి రావడం! అంకుశ్ బహుగుణ అయితే స్కిన్ కేర్ ప్రాడక్ట్లంటే పడి చచ్చిపోతాడు. సిద్ధార్థ్ బాత్రా ఎప్పుడూ పూలు, స్త్రీలు ఉన్న చొక్కాల్లోనే కనిపిస్తాడు.
శంతన్ ధోపే ఐ మస్కారా లోంచి అదోలా చూశాడంటే గర్ల్స్ ఆత్మరక్షణలో పడ్డారన్నమాటే. యశ్వంత్ సింగ్ ముఖానికి ఏదో రాసుకుంటాడు. ఆ సువాసన అతడెక్కిన మెట్రో ట్రైన్ ని స్టేషన్ వచ్చినప్పుడైనా తలుపుల్ని తెరవనివ్వదు! శక్తి సింగ్ యాదవ్ తన పాదాలకు వేసుకునే షూజ్ చిన్నప్పుడు మగపిల్లలకు మురిపెంగా తల్లి తొడిగే గౌనులా ఉంటాయి. జేసన్ ఆర్లాండ్ అని ఇంకో ఇండియన్ ఉన్నాడు. తన పద్దెనిమిదో యేట నుంచీ అమ్మాయిలకు బ్యూటీ టిప్స్ నేర్పుతున్నాడు. వీళ్లంతా మేల్ ఇన్ఫ్లుయెన్సర్లు. అలంకరణకు ఆడామగా ఏమిటి అంటున్నవారు. ఈ పరిపూర్ణ పురుషుల పరిచయ కార్యక్రమం ‘అందమే ఆనందం’ అన్నంతగా ఉంటుంది.
అంకుశ్ బహుగుణ
మీరు కనుక ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉంటున్నట్లయితే అంకుశ్ మీకు తెలిసే ఉంటాడు. 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇతడికి! మేకప్ టిప్స్ ఇస్తూ ఉంటాడు. మన స్కిన్ కేర్ కోసం మనం కొంచెం టైమ్ కేటాయించుకోవాలని చెబుతాడు. మనం అంటే మగవాళ్లు, ఆడవాళ్లు కూడా. ఆడవాళ్లలో తనని కలుపుకోడానికి ఏమాత్రం బిడియపడడు. స్త్రీ పురుషులిద్దరికీ స్కిన్ ఉన్నప్పుడు స్కిన్ కేర్ ఇద్దరికీ ఉండాలి కదా అని నవ్వేస్తాడు. కుర్రాడు క్యూట్‌గా ఉంటాడు. ‘వింగ్ ఇట్ విత్ అంకుశ్’ అని ఈ మధ్యే తన రెండో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు.
శంతన్ ధోపే
ధోపేనా, ధోపానా అని అడుగుతుంటారు శాంతన్ని. శాంతనా, శంతనా అని కూడా. ‘ఏదో ఒకటి అనుకోండి’ అని నవ్వుతాడు. ఎలా పిలిచినా పలికేందుకు తను సిద్ధం అని. అతడే కాదు, అతడి కనురెప్పలూ పలుకుతాయి. డ్యాజిలింగ్ ఐ మేకప్ తో సౌందర్య సామ్రాజ్య యువ చక్రవర్తిలా అనిపిస్తాడు. ఆ లుక్స్ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఆ కళ్ల మస్కారా ఎంచేతనో ఎబ్బెట్టుగా అనిపించదు. మేకప్‌లో ఇతడికి ఉన్న నైపుణ్యం అది. పురుష జన్మకు ఎక్కడా లోటు జరగదు తన ముస్తాబులో.
సిద్ధార్థ్ బాత్రా
సుకుమారంగా, లవ్లీగా ఉంటాడు. ఇతడి ఫాలోవర్లు 143 వేలు. ఫ్యాషన్ స్టెయిలిస్ట్. మగవాళ్ల బ్యూటీని రీ డిఫైన్ చేస్తున్నాడు. పూలు, స్త్రీల చిత్రాలు ఉన్న రంగు రంగుల చొక్కాలు ధరిస్తాడు. పూల మొక్కల మధ్య నిలబడి ఫొటోలు తీయించుకుని వాటిని పోస్ట్ చేస్తుంటాడు. ఆ పోస్ట్‌లకు టప టపమని ఎన్ని లైకులు పడిపోతాయో చెప్పలేం. కొన్ని ఫొటోల్లోనైతే ఇతడి పోలికలను గుర్తుపట్టడం కష్టం. అంతగా ‘ట్రాన్స్ఫార్మేషన్’ చెంది కనిపిస్తాడు. అతడొక కోమలమైన స్టెయిల్ స్టేట్మెంట్ అంటే నమ్మండి. బరువెలా తగ్గడమో చెప్పడు, తగ్గి చూపిస్తాడు. ఆ వీడియోలు అప్డేట్ చేస్తుంటాడు.
దీప్ పతారే
శాంతను ధోపేకి 25 కె ఉంటే, దీప్‌కి 19 కె ఉన్నారు ఫాలోవర్లు. అతడి మీద కొంచెం క్వీర్ (ఎల్.జి.బి.టి) ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫిట్‌గా ఉంటాడు. ఆ బండ పెదవుల్ని ముందుకు చాపి ‘పౌట్’ చే యడం చూస్తుంటే బాగోనట్లు మాత్రం అనిపించదు. సాధారణంగా అమ్మాయిలే కదా ఫొటో దిగుతూ పౌంట్ లిప్స్ ఇస్తారు. కానీ ఇతడు ఇచ్చినా అదేమీ అసహజంగా ఉండదు. యూట్యూబ్‌లో ఇతడొక మేకప్ చానల్ నడుపుతున్నాడు. ‘ఒకరిపై ముద్ర వేయడం ఆపి, జీవించడం మొదలు పెట్టండి’ అంటాడు. ఇతడి మేకప్‌లో ఆర్టిస్టిక్ ఫ్లెయిర్ ఉంటుంది. మగవాళ్లు మేకప్ అవడాన్ని ‘నార్మలైజ్’ చెయ్యడమే దీప్ పతారే ధ్యేయం. ఆ మధ్య ఇతడినెవరో ‘గే’అన్నారు. సాటి ఇన్ఫ్లుయన్సర్ అంకుశ్ బహుగుణ వెంటనే ఇతడికి సపోర్ట్‌గా వచ్చాడు. ‘మేకప్ వేసుకుంటే మగాళ్లు గేలు అయిపోతారా.. మీ ఆలోచనల్ని మార్చుకోండి అని ఒక వీడియోలో దీప్‌ని వెనకేసుకు వచ్చాడు.
యశ్వంత్ సింగ్
యశ్వంత్ యూజర్ నేమ్ యశ్ వాంట్ స్కిన్‌కేర్. బ్యూటీ బ్లాగర్ ఇతడు. ఫాలోవర్లు పన్నెండు వేలు. స్కిన్ కేర్ ఉపాయాలు చెబుతాడు. బ్యూటీ టిప్స్ అడిగితే ఇస్తాడు. ముఖాన్ని మెరిపించే క్రీముల్ని తనూ వాడుతుంటాడు. స్కిన్ కేర్‌లో తనేవైనా కొత్త విషయాలు చదివితే వాటిని షేర్ చేసుకుంటాడు. ఏక్నేకి తను వాడి చూసిన హోమ్మేడ్ దివ్యౌషధాలు, ఇంటర్నేషనల్ బ్రాండ్లపై డిమాన్స్ట్రేషన్స్ ఇస్తాడు. యష్ డాట్ కేర్ అని ఇతడికి ఇంకో అకౌంట్ ఉంది. అందులోంచి సేవా కార్యక్రమాల కోసం సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తుంటాడు.
శక్తిసింగ్ యాదవ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందగాడికి లక్షా ఇరవై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొంచెం మ్యాన్లీగా ఉంటాడు. కొంచెం సుకుమారంగా ఉంటాడు. సిద్ధార్థ్ బాత్రా లానే ఫ్యాషన్ స్టెయిలిస్ట్. మోడలింగ్ ఇస్తుంటాడు. ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తుంటాడు. ‘ది ఫిబ్రవరి బాయ్’ అనే అకౌంట్లో కొత్త మోడళ్ల ఫుట్‌వేర్‌తో, యాక్సెసరీస్‌తో కనిపిస్తాడు. స్పూలీ (స్పూల్ బ్రష్)తో కనుబొమల అందాన్ని పెంచడం ఎలా అని ఆ మధ్య ఇతడు పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ తర్వాత భారతీయ పురుషుల కోసం ఇతడు అందించిన కొరియన్ బ్యూటీ టిప్స్ ఇతడిని ప్రముఖుడిని చేశాయి.
జేసన్ ఆర్లాండ్
యాక్టర్, డాన్సర్, మోడల్. బ్యూటీ ఇన్ఫ్లుయన్సర్. చిక్ ఫొటోషూట్స్‌కు ప్రసిద్ధి. అంటే స్టెయిల్ వేర్ ఛాయాచిత్రగ్రహకుడు. యూట్యూబ్‌లో, ఇన్స్టాగ్రామ్ లో మేల్ ముస్తాబు వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. అమ్మాయిలకు ఫ్యాషన్ లుక్కుల పాఠాలు కూడా చెబుతుంటాడు. తనకి 14 ఏళ్ల వయసప్పుడే సొంతంగా మేకప్ టిప్స్ కనిపెట్టానని గర్వంగా చెబుతుంటాడు. తన డ్రెస్‌లను తనే డిజైన్ చేసుకుని, తనే స్టిచ్ చేసుకుంటాడు. ఆ వివరాలను నెట్లో పంచుకుంటాడు. లాక్మేకి కూడా మోడలింగ్ చేశాడు! ఇతడి గురించి మరొక మనోహరమైన సంగతి.. 2019 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడవడం!
టూమచ్చబ్బా అనిపిస్తుంది! బాయ్స్కేంటీ సింగారాలు? వాళ్లేమన్నా బంగారాలా? అదిగో మళ్లీ ‘మగ మాటలు’! అందం చందం అంతా అమ్మాయిల్దే అన్నట్లు. వాళ్లే పుత్తడి బొమ్మలైనట్లు. అందం కోసమే వాళ్లు పుట్టినట్లు! బోర్డ్ రూమ్ గాజు అద్దాల్ని పగలగొట్టి వాళ్లొచ్చి డైరెక్టర్ల సీట్లలో కూర్చోవడంలా? అలాగే వీళ్లూ! మహిళలకే మేకప్ అనే గ్లాసు అడ్డుకోడల్ని బ్రేక్ చేసి ఫేస్ప్యాకుల్తో, పెడిక్యూర్లతో, మస్కారాలతో.. బ్యూటిఫుల్ హీరోల్లా (హ్యాండ్సమ్ అనే మాట మాగవాళ్లదే అయితే కనుక) బయటికొచ్చేస్తున్నారు. ఫ్యూచర్లో.. హ్యాండ్‌బ్యాగ్స్ ఆడవాళ్లకే అనేముంది అంటూ.. బ్యాగ్ భుజానికి తగిలించుకుని కనిపిస్తారేమో కూడా!
బాబిల్ ఖాన్నే చూడండి. ఫేస్ ప్యాక్ చేయించుకుని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాడు. అతడు ఫేస్‌ప్యాక్‌తో ఉన్న ఫొటోని ఈ మధ్య ఒకరు నెట్లో చూసి.. ‘బాబిల్.. నువ్వేమైనా ఆడపిల్లవా?’ అని అడిగారు. బాబిల్ ఆశ్చర్యపోయాడు. ‘కొంచెమైనా స్త్రీ అంశ లేకుండా నేను పురుషుడిని ఎలా అవుతాను?’ అని ప్రశ్నించాడు. సింగిల్ లైన్లో ‘బ్రాడ్’ రిప్లయ్. ఆ సమాధానం చూసి బాబిల్కి అంతా హాట్సాఫ్ కొట్టారు.
అదిగో.. అప్పుడు మొదలైంది ‘మేల్ ముస్తాబ్’ టాపిక్. మగవాళ్లెందుకు ముస్తాబు కాకూడదు? మగవాళ్లెందుకు స్కిన్ కేర్ ప్రాడక్ట్లు వాడకూడదు? మగవాళ్లెందుకు ఆడవాళ్లు ఇష్టపడే అన్ని రంగుల్ని, హంగుల్ని కోరుకోకూడదు.. అనే డిబేట్. ఇప్పుడైతే ఇది డిబేట్ అయినట్లు అనిపిస్తోంది కానీ, చప్పుడు చేయకుండా మేల్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది చాలాకాలంగా తమని తమే ఫాలో అయిపోతున్నారు. అంటే.. వాళ్లకు ఇష్టమైన రీతిలో వాళ్లు ‘గర్లీ’గా తయారౌతున్నారు. వాళ్లనూ కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇక్కడున్న కనిపిస్తున్నవాళ్లు మేల్ ఇన్ఫ్లుయెన్సర్లలో కొందరు. మగ యూత్‌ని బ్యూటీ వైపు దారి మళ్లిస్త్నువారు.
చదవండి: యాసిడ్ ఓడింది జంట కలిసింది