ఫేస్‌బుక్ కలిపింది ‘భాయ్’
వీళ్ల నవ్వుల వెనుక ఓ మాంచి సెంటిమెంట్ సినిమాకు కావాల్సిన కథ ఉంది. చిన్నప్పుడు అన్నదమ్ములు విడిపోవడం.. ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం వంటివి మనం సినిమాల్లో చూశాం. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ చూసేద్దాం. ఎందుకంటే పుణేకు చెందిన వీరిద్దరూ అలాంటివారే. 11 ఏళ్ల తర్వాత కలిశారు.
ఇందులో గడ్డం, తలపాగాతో కనిపిస్తున్న యువకుడి పేరు అంకుశ్ అలియాస్ గురుబజ్ సింగ్. చిన్నప్పుడు తెగ అల్లరి చేసే అంకుశ్ ఓసారి తన అంకుల్ బైక్ తీసుకెళ్లి.. మరో వాహనానికి గుద్దించేశాడు. దీంతో అంకుల్, అమ్మ ఒకటే తిట్లు, వీపు విమానం మోత మోగిపోయింది. ఆ సమయంలో కోపంలో ఉన్న వాళ్లమ్మ హేమలత రూ.50 అంకుశ్ మొహాన విసిరేసి.. తనకిక కనిపించొద్దని అరిచింది.
దీంతో ఫీలైన అంకుశ్ రోడ్డెక్కాడు. అప్పుడు అతడికి 13 ఏళ్లు. దారిలో అంకుశ్‌కు ఓ సిక్కు లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు. ముంబై నుంచి నాందేడ్ పోతున్న ఆయన అంకుశ్ విషయం తెలుసుకుని తనతోపాటు పంజాబ్ వచ్చేస్తే.. బాగా చూసుకుంటానన్నాడు. అయితే, అంకుశ్ ఇష్టపడకపోవడంతో నాందేడ్‌లోని ఓ గురుద్వారా వద్ద దింపేసి వెళ్లిపోయాడు.
అప్పట్నుంచి గురుద్వారాలోని వంట గ దిలో పనికి కుదిరిన అంకుశ్‌ను చూసి.. లూధియానాలోని ఓ గురుద్వారాలో పనిచేసే మేజర్ సింగ్ తనతోపాటు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడే సిక్కుగా మారాడు. గురుబజ్‌సింగ్‌గా పేరుమార్చుకున్నాడు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని.. ప్రజలు దానం చేసే సామాన్లను గురుద్వారాకు తరలించే పనిని చేయడం ప్రారంభించాడు.
అయితే, ఇటీవల సహచర ఉద్యోగితో జరిగిన గొడవ అతడి ధ్యాస ఇంటిపైకి మళ్లేలా చేసింది. తన తమ్ముడు సంతోష్(అంకుశ్ పక్కనున్న యువకుడు) పేరును ఫేస్‌బుక్‌లో కొట్టి.. వెతికాడు. లక్కీగా దొరికాడు. దీంతో జూలై 21న ‘నేను నీ సోదరుడిని. ఈ నంబర్‌కు నాకు ఫోన్ చేయి’ అంటూ సంతోష్‌కు మెసేజ్ పెట్టాడు. నిజమా కాదా అంటూ సంతోష్ ఫేస్‌బుక్‌లో అంకుశ్ ఫొటో చూశాడు. చూస్తే.. సిక్కులా గడ్డం పెంచుకుని కనిపించాడు. దీంతో గందరగోళంలో పడిపోయాడు.
అయితే, తల్లి హేమలత అతడి ముఖకవళికలు, బుగ్గపై ఉన్నగాటును చూసి గుర్తుపట్టింది. అంతే.. సంతోష్ ఫోన్ చేయడం.. అంకుశ్ జూలై 28న జీలం ఎక్స్‌ప్రెస్‌లో లూధియానా నుంచి పుణే వచ్చేయడం జరిగిపోయాయి. ఇక పుణేలోనే ఉంటాలనుకుంటున్న అంకుశ్ అలియాస్ గురుబజ్ సింగ్ మతం మార్చుకునే ఉద్దేశాలేవీ లేవంటున్నాడు. అటు వాళ్లమ్మ ఇంకెప్పుడూ నిన్ను తిట్టనురా కన్నా అంటూ కొడుకును గారం చేసే పనిలో మునిగిపోయింది.