హస్తం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పెద్ద చిక్కొచ్చిపడింది. స్వయంకృతంతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారారు. తన కంటి సైగతో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ శక్తివంతమైన మహిళ తనకు తానుగా వివాదంలో వేలు పెట్టారు. పెద్దావిడ స్వయంగా అందించిన అస్త్రాన్ని అందిపుంచుకున్న విపక్షాలు దాన్ని వెంటనే ఆమె నిజాయితీపై గురిపెట్టాయి. సోనియా ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంలో సోనియా జోక్యం చేసుకుని ప్రధానికి లేఖ రాయడంతో రాజకీయ దుమారం రేగింది. యూపీలో ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన దుర్గాశక్తిపై అఖిలేష్ యాదవ్ సర్కారు సస్పెన్షన్ వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోనియమ్మ లేఖ రాశారు. స్వార్థ ప్రయోజనాలకు ఎదురొడ్డి నిలబడినందుకు ఆమెను శిక్షించకూడదంటూ మన్మోహన్ సింగ్ను లేఖలో కోరారు.
సోనియా లేఖపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), (ఏఏపీ), బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించాయి. సొంత అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ విషయంలో యూపీఏ చైర్పర్సన్ ఎందుకు కల్పించుకోలేదని ఈ పార్టీలు సూటిగా ప్రశ్నించాయి. సోనియాకు చిత్తశుద్ధి ఉంటే హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వాద్రా చేస్తున్న భూకబ్జాల గురించి కూడా ప్రధానికి మరో రెండు లేఖలు రాయాలని సమాజ్‌వాదీ పార్టీ సలహాయిచ్చింది.
ఇంత జరుగుతున్నా నిజాయితీ ప్రభుత్వాధికారులపై సర్కారీ సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేయడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తాయి. అయితే ఖేమ్కా, దుర్గాశక్తిల అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్, ఎంపీ జితిన్ ప్రసాద తమ నాయకురాలిని వెనుకేసుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ సంకట స్థితి నుంచి సోనియా ఏవిధంగా బయట పడతారో చూడాలి.
సోనియా లేఖ... రాజకీయ కాక!
Published Mon, Aug 5 2013 7:50 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement