durga shakti nagpal
-
2013లో ఉమన్ ఆఫ్ ఇయర్:దుర్గాశక్తి నాగ్‌పాల్
-
ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి పునర్నియామకం
లక్నో: యూపీలో మైనింగ్ మాఫియాపై కఠినంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ విషయంలో ప్రభుత్వం దిగివచ్చింది. ఆమెపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకొంది. గౌతమబుద్ధ నగర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ఆమెను పునర్నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్‌పై దుర్గాశక్తి శనివారం సీఎం అఖిలేష్ యాదవ్‌ను కలసి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. కడలాపూర్ గ్రామంలో నిర్మాణంలోనున్న ఓ మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చి మతసామరస్యానికి విఘాతం కలిగించారనే సాకుతో ప్రభుత్వం ఆమెను గత జూలై 27న సస్పెండ్ చేయడం తెలిసిందే. -
నేడో, రేపో దుర్గాశక్తి సస్పెన్షన్ ఎత్తివేత!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్‌ను రద్దు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మీడియా ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆమె సస్పెన్షన్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. నేడో, రేపో దుర్గాశక్తి సస్పెన్షన్‌పై ఓ నిర్ణయం మాత్రం వెలువడనుందని పేర్కొంది. దుర్గాశక్తి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్‌ను కలిసినట్లు మీడియా ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది. అఖిలేష్ సింగ్‌కు దుర్గాశక్తి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దుర్గాశక్తి సస్పెన్షన్‌పై అఖిలేష్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ కథనంలో అభిప్రాయపడింది. గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామంలో మసీద్‌కు సంబంధించిన గోడ కూల్చివేతకు దుర్గాశక్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడిందని ప్రభుత్వం చెబుతుంది. అయితే రాజకీయ నాయకులకు సంబంధించిన ఇసుక మాఫియాపై దుర్గాశక్తి ఉక్కుపాదంతో అణివేసింది. అందులోభాగంగానే దుర్గాశక్తిపై సస్పెన్షన్ వేటు వేశారని విమర్శకులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
రాజకీయ ప్రయోజం కోసమే సోనియా జోక్యం
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ ప్రయోజం కోసమే ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ పట్టాణాభివృద్ది శాఖ మంత్రి అజాం ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉనికిని కొల్పోయిన ఆ పార్టీ తన ప్రభావాన్ని తిరిగి పొందే క్రమంలో రాజకీయ క్రీడలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన రాంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి విషయంలో సోనియా గాంధీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌కు లేఖ రాయాడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలతోపాటు విదేశీయురాలు సోనియా నేతృత్వంలో నడుస్తుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అతి సున్నితమైన వ్యక్తి అని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన దుర్గాశక్తి సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. అయితే సోనియాగాంధీపై అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ఖండించారు. ఆ పార్టీ నేతలతో చెప్పించుకునే పరిస్థితి సోనియాకు లేదని రీటా వ్యాఖ్యానించారు. -
దుర్గాశక్తి... బహువచనం!
సంపాదకీయం : చదువులో చురుగ్గా ఉన్నారని, నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయని, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్నదని, అవి అపరిష్కృతంగా మిగిలిపోతున్న వైనంపై ఆగ్రహం ఉన్నదని, అందుకోసం ఏదో చేయాలన్న తపన వారి అంతరాంతరాల్లో జ్వలిస్తున్నదని అనుకునే యువతీయువకులు సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని చాలా మంది సలహాలిస్తుంటారు. సవాళ్లను స్వీకరించే తత్వమూ, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను వెదకగల సామర్ధ్యమూ, అంకితభావంతో పనిచేసే సంసిద్ధతా ఉండేవారివల్ల ఈ సమాజం మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు. సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే జటిలమైన పరీక్షలకెళ్లేవారంతా ఈ లక్షణాలన్నీ తమకున్నాయని, ఇందులో కృతార్థులమై తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి వచ్చే దురహంకారంతో తమ మాటే శాసనంగా చలామణీ కావాలని ఆశించే పాలకులున్నప్పుడు ఇలాంటి యువతరం కలలన్నీ కల్లలుగా మిగిలిపోతాయి. వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో కొందరు ఐఏఎస్ అధికారులపై అధికారంలో ఉన్నవారు సాగిస్తున్న ధాష్టీకం చూస్తే కలిగే అభిప్రాయం ఇదే. ఇలాంటివారి ఏలుబడిలో ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యేవారికి రెండే ప్రత్యామ్నాయాలుం టున్నాయి-అలాంటి పాలకుల అభీష్టానికి తలవంచడం లేదా వారి ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టుల్లో వృధాగా పొద్దుపుచ్చడం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జిల్లా గౌతంబుద్ధ నగర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగపాల్ని సస్పెండ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌ల పరిస్థితిని మరోసారి కళ్లకు కడుతోంది. యమునా నదిలో అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్న మాఫియా ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ ప్రాంతం నుంచి నెలకు కనిష్టంగా చూస్తే రూ.200 కోట్ల విలువైన ఇసుక తరలి పోతోందని ఒక అంచనా. ఇసుక తవ్వకాలవల్ల యమునా నది కోతకు గురై పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఎందరో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్యవసానంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పరిచింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీరా దుర్గాశక్తి చర్యకు ఉపక్రమించేసరికి ఆమెను సస్పెండ్ చేసింది. గౌతంబుద్ధ నగర్లో ఒక మసీదు కోసం నిర్మించిన గోడను కూల్చేయడంవల్లా, ఆ చర్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందువల్లా ఆమెను సస్పెండ్ చేయాల్సివచ్చిందని అఖిలేష్ ఇస్తున్న సంజాయిషీ వాస్తవాలను ప్రతిబింబించదు. ఆ ఉదంతంతో సంబంధమున్న అధికారి పేరు జేవర్ అని తాజా సమాచారం వెల్లడిస్తున్నది. అఖిలేష్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఐఏఎస్‌లను 800 సార్లు బదిలీ చేశారు. అంటే, సగటున నెలకు 50 బదిలీలన్నమాట. యూపీలో ఇది అఖిలేష్ పాలనతోనే ప్రారంభమైన ధోరణికాదు. అంతక్రితం పాలించినవారూ ఈ తరహాలోనే ప్రవర్తించారు. నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లపై కొంచెం హెచ్చుతగ్గుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల పాలకుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన లావాదేవీలపై కూపీ లాగిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో బదిలీలతో ఎలా వేధించిందో ఈ దేశం చూసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై పాత కేసును తిరగదోడారన్న నెపంతో రాజస్థాన్ ప్రభుత్వం జైసల్మేర్ జిల్లా ఎస్పీని రెండురోజులక్రితం బదిలీచేసింది. ఆ బదిలీపై ఆ జిల్లా భగ్గుమంటోంది. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్‌ది మరో కథ. ఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను రెండు నెలలు తిరక్కుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఇందుకు కారణం చాలా చిన్నది. ప్రణాళికా సంఘంతో చర్చలకోసం ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ఖరీదైన భోజనం పెట్టించలేదని, ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేయలేదని ఆరోపణలు. మన రాష్ట్రం విషయానికే వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనాకాలంలో కీలకపదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను ఇప్పుడు ఎలా వేధిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తగిన ఆధారాలున్న అధికారులపై చర్య తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే దర్యాప్తు పేరిట సీబీఐ తమను అవినీతిపరులుగా, ప్రజాధనాన్ని అపహరించినవారిగా మీడియాకు లీకులు ఇస్తున్న తీరు సమంజసంగా లేదని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అక్రమ నిర్ణయాలనుకున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూ, అందులో భాగస్వాములమైన తమను మాత్రం అక్రమాలకు పాల్పడ్డవారిగా చిత్రించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు, తమ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇంతగా వేధిస్తుంటే ఏనాడూ నోరెత్తని సోనియాగాంధీ దుర్గాశక్తి విషయంలో ఎక్కడలేని ఆసక్తినీ ప్రదర్శించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరడం మన నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఖేమ్కా విషయంలోనూ ఆమె ఇలాగే స్పందించివుంటే అందరూ హర్షించేవారు. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఈ సర్వీసులకు ఎంపికైన అధికారులు స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించ గలిగితేనే పటిష్టమైన దేశం నిర్మాణమవుతుందని అభిలషించారు. కానీ, అలాంటి అధికారులను పాలకులు వేధించే సంస్కృతి రాను రాను పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే, నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఆదరించకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని మన నేతలు గ్రహించడం అవసరం. -
ఐఏఎస్లందర్నీ తీసుకుపోండి!
న్యూఢిల్లీ/లక్నో: యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాయడం, సస్పెన్షన్‌పై కేంద్రం నివేదిక కోరడం, సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్లు రావడంతో ఉత్తరప్రదేశ్ పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వింది. తమ రాష్ట్రం నుంచి ఐఏఎస్ అధికారులందర్నీ ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని సొంతంగా పాలించుకుంటామని చె ప్పింది. నాగ్‌పాల్ సస్పెన్షన్ సరైందనేనని, దాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ‘మాకు ఐఏఎస్‌ల అవసరం లేదు. కేంద్రం యూపీ నుంచి వారిని ఉపసంహరించుకోవాలి. యూపీ తన సొంత అధికారులతో పాలన సాగిస్తుంది’ అని ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ సోమవారం ఢిల్లీలో అన్నారు. సస్పెన్షన్ సరైందేనని, అది తుది నిర్ణయమని పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. మత ఘర్షణలను నివారించేందుకే నాగ్పాల్పై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా తమ ప్రభుత్వ చర్యను మరోసారి సమర్థించుకున్నారు. ‘తప్పు చేసిన ఎంతోమంది సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లపై గతంలో చర్యలు తీసుకున్నారు. నాగ్‌పాల్ ఉదంతంపై మీడియా గగ్గోలుపెడుతోంది’ అని ఆరోపించారు. ఆయన సోమవారం లక్నోలో ఓ పాఠశాలలో మాట్లాడుతూ, ‘ఇక్కడున్న పిల్లలు తప్పులు చేసినందుకు టీచర్లతో, తల్లిదండ్రులతో దెబ్బలు తిని ఉంటారు. ప్రభుత్వం కూడా ఏ అధికారైనా తప్పు చేస్తే శిక్షిస్తుంది’ అని అన్నారు. నాగ్పాల్కు అప్పీలు చేసుకునే హక్కు ఉంది: కేంద్రం ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందిస్తూ ‘ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి యూపీ అధికారులను సంప్రదిస్తున్నాం. నిర్దేశిత నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించాలి’ అని అన్నారు. నాగ్పాల్కు అప్పీలు చేసుకునే హక్కు ఉందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి చెప్పారు. ‘ఆమె మమ్మల్ని సంప్రదించలేదు. మేం సొంతంగా ముందుకెళ్లం. ఆమె మాకు అప్పీలు అందజేస్తే, దాని కాపీని యూపీ ప్రభుత్వానికి పంపి, స్పందన కోరతాం. తదుపరి చర్య తీసుకుంటాం’ అని చెప్పారు. కాగా, కడల్పూర్ గ్రామంలోని మసీదు గోడ కూల్చివేత జేవార్ ప్రాంత ఎస్డీఎం సమక్షంలో జరిగిందని ఆ సమయంలో నాగ్‌పాల్ అక్కడ లేరని యూపీ ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది. ఈ నివేదికను కేంద్ర సిబ్బంది శాఖ పరిశీలిస్తోందని అధికారులు చెప్పారు. యూపీలోని గౌతమబుద్ధ నగర్లో ఇసుక మాఫియాపై కొరడా ఝళిపించిన నాగ్‌పాల్ చట్ట ప్రక్రియ పాటించకుండా నిర్మాణంలో ఉన్న మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయడం తెలిసిందే. -
సోనియా లేఖ... రాజకీయ కాక!
హస్తం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పెద్ద చిక్కొచ్చిపడింది. స్వయంకృతంతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారారు. తన కంటి సైగతో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ శక్తివంతమైన మహిళ తనకు తానుగా వివాదంలో వేలు పెట్టారు. పెద్దావిడ స్వయంగా అందించిన అస్త్రాన్ని అందిపుంచుకున్న విపక్షాలు దాన్ని వెంటనే ఆమె నిజాయితీపై గురిపెట్టాయి. సోనియా ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ వ్యవహారంలో సోనియా జోక్యం చేసుకుని ప్రధానికి లేఖ రాయడంతో రాజకీయ దుమారం రేగింది. యూపీలో ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన దుర్గాశక్తిపై అఖిలేష్ యాదవ్ సర్కారు సస్పెన్షన్ వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోనియమ్మ లేఖ రాశారు. స్వార్థ ప్రయోజనాలకు ఎదురొడ్డి నిలబడినందుకు ఆమెను శిక్షించకూడదంటూ మన్మోహన్ సింగ్‌ను లేఖలో కోరారు. సోనియా లేఖపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), (ఏఏపీ), బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించాయి. సొంత అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ విషయంలో యూపీఏ చైర్పర్సన్ ఎందుకు కల్పించుకోలేదని ఈ పార్టీలు సూటిగా ప్రశ్నించాయి. సోనియాకు చిత్తశుద్ధి ఉంటే హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వాద్రా చేస్తున్న భూకబ్జాల గురించి కూడా ప్రధానికి మరో రెండు లేఖలు రాయాలని సమాజ్‌వాదీ పార్టీ సలహాయిచ్చింది. ఇంత జరుగుతున్నా నిజాయితీ ప్రభుత్వాధికారులపై సర్కారీ సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై హిస్టరీ షీట్ తెరిచిన ఎస్పీని అక్కడి కాంగ్రెస్ సర్కారు బదిలీ చేయడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తాయి. అయితే ఖేమ్కా, దుర్గాశక్తిల అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్, ఎంపీ జితిన్ ప్రసాద తమ నాయకురాలిని వెనుకేసుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ సంకట స్థితి నుంచి సోనియా ఏవిధంగా బయట పడతారో చూడాలి. -
దుర్గాశక్తి.. యూపీ సర్కారు - ఓ దుమారం
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ ప్రాంతంలో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురై చివరకు సస్పెండైన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఈ విషయంలో కలగజేసుకుని, ఆమెకు సరైన న్యాయం జరిగేలా చూడాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాయడంతో ప్రధాని రంగంలోకి దిగారు. ఈ విషయమై తాము ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని తాము నిరంతరం సంప్రదిస్తున్నామని, వాళ్లు కూడా నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని తెలిపారు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులకు చెప్పారు. ఐఏఎస్ అధికారుల విషయంలో కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలున్నాయని, వాటిని అక్కడ కూడా పాటిస్తారని ఆయన చెప్పారు. దుర్గాశక్తి వ్యవహారంపై వెనువెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. జూలై 27వ తేదీన దుర్గాశక్తి సస్పెండ్ కాగా, అప్పటినుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను పోతోంది. దుర్గాశక్తికి పది పేజీల చార్జిషీటు కూడా పంపింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన యువ ఐఏఎస్ అధికారిణి, ఓ మసీదు గోడను తగిన పద్ధతి పాటించకుండా కూల్చేశారంటూ ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చార్జిషీటుకు స్పందించేందుకు ఆమెకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం. -
దుర్గాశక్తి సస్పెన్షన్‌పై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి సస్పెండయిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. అక్రమాలపై చర్యలు తీసుకున్న ఆమెకు అన్యాయం జరగకుండా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. దీన్ని యూపీ పాలక పక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బీజేపీలు ఎద్దేవా చేశాయి. హర్యానా, రాజస్థాన్‌లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీల వ్యవహారంలో సస్పెండయిన ఐఏఎస్‌లకు కూడా న్యాయం జరిగేలా ఆమె ప్రధానికి మరో రెండు లేఖలు రాయాలని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ చురకలంటించారు. హర్యానాలో వాద్రా లావాదేవీపై చర్యలు తీసుకున్న ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా సస్పెన్షన్, రాజస్థాన్‌లో వాద్రా భూముల వ్యవహారంలో సస్పెండయిన ఇద్దరు ఐఏఎస్‌లకు సంబంధించి సోనియా లేఖలు రాయాలన్నారు. కాగా, అక్రమాలపై చర్యలు తీసుకున్నందుకే నాగ్పాల్పై చర్య తీసుకున్నారని జనం అనుకుంటున్నారని సోనియా.. మన్మోహన్‌కు జాతీయ సల హా మండలి చైర్పర్సన్ హోదాలో రాసిన లేఖలో తెలిపారు. ‘మనం నాగ్పాల్కు అన్యాయం జరగకుండా చూడాలి. చట్టం అమల్లో చొరవ చూపే అధికారులను కాపాడాల్సిన అవసరముందని ఈ ఉదంతం చెబుతోంది’ అని పేర్కొన్నారు. లేఖ అవసరం లేదు: రాజ్‌నాథ్ ఈ లేఖ వ్యవహారం పట్ల బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానిపై వాగ్బాణాలు సంధించారు. కాంగ్రెస్ చీఫ్‌నుంచి లేఖకోసం ఎదురు చూడకుండానే ప్రధా ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. సోనియా లేఖ రాయకుండా మన్మో హన్‌కు నోటిమాటగా చెప్పినా సరిపోయేదన్నారు. నాగ్పాల్పై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నందుకే సోనియా ప్రధానికి లేఖరాశారని బీజేపీ ప్రతినిధి మీనాక్షీ లేఖీ అన్నారు. గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న నాగ్‌పాల్‌ను యూపీ ప్రభుత్వం గత వారం సస్పెండ్ చేయడం తెలిసిందే. నాగ్‌పాల్ చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ఓ మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చారని, అందుకే స్పస్పెండ్ చేశామని ప్రభుత్వం చెబుతోంది.