
దుర్గాశక్తి సస్పెన్షన్‌పై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి సస్పెండయిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. అక్రమాలపై చర్యలు తీసుకున్న ఆమెకు అన్యాయం జరగకుండా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. దీన్ని యూపీ పాలక పక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బీజేపీలు ఎద్దేవా చేశాయి. హర్యానా, రాజస్థాన్‌లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీల వ్యవహారంలో సస్పెండయిన ఐఏఎస్‌లకు కూడా న్యాయం జరిగేలా ఆమె ప్రధానికి మరో రెండు లేఖలు రాయాలని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ చురకలంటించారు. హర్యానాలో వాద్రా లావాదేవీపై చర్యలు తీసుకున్న ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా సస్పెన్షన్, రాజస్థాన్‌లో వాద్రా భూముల వ్యవహారంలో సస్పెండయిన ఇద్దరు ఐఏఎస్‌లకు సంబంధించి సోనియా లేఖలు రాయాలన్నారు. కాగా, అక్రమాలపై చర్యలు తీసుకున్నందుకే నాగ్‌పాల్‌పై చర్య తీసుకున్నారని జనం అనుకుంటున్నారని సోనియా.. మన్మోహన్‌కు జాతీయ సల హా మండలి చైర్‌పర్సన్ హోదాలో రాసిన లేఖలో తెలిపారు. ‘మనం నాగ్‌పాల్‌కు అన్యాయం జరగకుండా చూడాలి. చట్టం అమల్లో చొరవ చూపే అధికారులను కాపాడాల్సిన అవసరముందని ఈ ఉదంతం చెబుతోంది’ అని పేర్కొన్నారు.
లేఖ అవసరం లేదు: రాజ్‌నాథ్
ఈ లేఖ వ్యవహారం పట్ల బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానిపై వాగ్బాణాలు సంధించారు. కాంగ్రెస్ చీఫ్‌నుంచి లేఖకోసం ఎదురు చూడకుండానే ప్రధా ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. సోనియా లేఖ రాయకుండా మన్మో హన్‌కు నోటిమాటగా చెప్పినా సరిపోయేదన్నారు. నాగ్‌పాల్‌పై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నందుకే సోనియా ప్రధానికి లేఖరాశారని బీజేపీ ప్రతినిధి మీనాక్షీ లేఖీ అన్నారు. గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న నాగ్‌పాల్‌ను యూపీ ప్రభుత్వం గత వారం సస్పెండ్ చేయడం తెలిసిందే. నాగ్‌పాల్ చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ఓ మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చారని, అందుకే స్పస్పెండ్ చేశామని ప్రభుత్వం చెబుతోంది.