ఐఏఎస్‌లందర్నీ తీసుకుపోండి!
న్యూఢిల్లీ/లక్నో: యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాయడం, సస్పెన్షన్‌పై కేంద్రం నివేదిక కోరడం, సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్లు రావడంతో ఉత్తరప్రదేశ్ పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వింది. తమ రాష్ట్రం నుంచి ఐఏఎస్ అధికారులందర్నీ ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని సొంతంగా పాలించుకుంటామని చె ప్పింది. నాగ్‌పాల్ సస్పెన్షన్ సరైందనేనని, దాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ‘మాకు ఐఏఎస్‌ల అవసరం లేదు. కేంద్రం యూపీ నుంచి వారిని ఉపసంహరించుకోవాలి.
యూపీ తన సొంత అధికారులతో పాలన సాగిస్తుంది’ అని ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ సోమవారం ఢిల్లీలో అన్నారు. సస్పెన్షన్ సరైందేనని, అది తుది నిర్ణయమని పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. మత ఘర్షణలను నివారించేందుకే నాగ్‌పాల్‌పై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా తమ ప్రభుత్వ చర్యను మరోసారి సమర్థించుకున్నారు. ‘తప్పు చేసిన ఎంతోమంది సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లపై గతంలో చర్యలు తీసుకున్నారు. నాగ్‌పాల్ ఉదంతంపై మీడియా గగ్గోలుపెడుతోంది’ అని ఆరోపించారు. ఆయన సోమవారం లక్నోలో ఓ పాఠశాలలో మాట్లాడుతూ, ‘ఇక్కడున్న పిల్లలు తప్పులు చేసినందుకు టీచర్లతో, తల్లిదండ్రులతో దెబ్బలు తిని ఉంటారు. ప్రభుత్వం కూడా ఏ అధికారైనా తప్పు చేస్తే శిక్షిస్తుంది’ అని అన్నారు.
నాగ్‌పాల్‌కు అప్పీలు చేసుకునే హక్కు ఉంది: కేంద్రం
ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందిస్తూ ‘ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి యూపీ అధికారులను సంప్రదిస్తున్నాం. నిర్దేశిత నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించాలి’ అని అన్నారు. నాగ్‌పాల్‌కు అప్పీలు చేసుకునే హక్కు ఉందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి చెప్పారు. ‘ఆమె మమ్మల్ని సంప్రదించలేదు. మేం సొంతంగా ముందుకెళ్లం. ఆమె మాకు అప్పీలు అందజేస్తే, దాని కాపీని యూపీ ప్రభుత్వానికి పంపి, స్పందన కోరతాం. తదుపరి చర్య తీసుకుంటాం’ అని చెప్పారు. కాగా, కడల్‌పూర్ గ్రామంలోని మసీదు గోడ కూల్చివేత జేవార్ ప్రాంత ఎస్‌డీఎం సమక్షంలో జరిగిందని ఆ సమయంలో నాగ్‌పాల్ అక్కడ లేరని యూపీ ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది. ఈ నివేదికను కేంద్ర సిబ్బంది శాఖ పరిశీలిస్తోందని అధికారులు చెప్పారు. యూపీలోని గౌతమబుద్ధ నగర్‌లో ఇసుక మాఫియాపై కొరడా ఝళిపించిన నాగ్‌పాల్ చట్ట ప్రక్రియ పాటించకుండా నిర్మాణంలో ఉన్న మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయడం తెలిసిందే.