రెడ్లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం | Mumbai red light girl goes to New York for studies | Sakshi
Sakshi News home page

రెడ్లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం

Published Mon, Aug 5 2013 1:11 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

రెడ్లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం - Sakshi

రెడ్లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం

కష్టాలు, కన్నీళ్లు ఆమెను నిరంతరం వెన్నంటి ఉండే నేస్తాలు. ఉండేది ప్రతినిత్యం రక్తమాంసాలతో వ్యాపారం సాగే నీచాతి నీచమైన ప్రాంతం. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలోని రెడ్లైట్ ప్రాంతంలో పెరిగి, పలుమార్లు లైంగిక అఘాయిత్యాలకు గురైన ఆ యువతి.. న్యూయార్క్ నగరంలో చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయింది. పేదరికాన్ని, కష్టాలను అధిగమించి మరీ ఆమె ఈ విజయం సాధించింది.
ఆమె పేరు శ్వేతా కత్తి (18). ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఉండే అనేక మంది అభాగినులలో ఆమె పేరు ఉన్నా.. పెద్దగా ఎవరికీ తెలియదు. న్యూయార్క్ లోని బార్డ్ కాలేజిలో సైకాలజీ డిగ్రీ చదివేందుకు ఆమెకు స్కాలర్షిప్ లభించింది. ఆ చదువు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, తనలాంటి అభాగినులకు సాయం చేయాలని శ్వేత భావిస్తోంది. చిన్నప్పటి నుంచే తాను అలా కలలు కన్నానని, కానీ ఆ కల సాకారం అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది.

శ్వేత పట్టుదల కారణంగా ఆమె ప్రపంచ ప్రఖ్యాత పత్రిక న్యూస్ వీక్ 'యంగ్ వుమెన్ టు వాచ్' పేరిట ఎంపిక చేసిన 25 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. తాలిబన్ల దాడిలో గాయపడి, కోలుకున్న పాకిస్థానీ బాలిక మలాలా పేరు కూడా ఈ జాబితాలోనే ఉంది.  

చిన్ననాటి నుంచి ఆమె అనేక కష్టనష్టాలకు గురైంది. ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఆమె చూసిన నరకం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, ఎవరో ఒక మహిళను కొడుతుండేవాళ్లని, పోలీసులు ఎపు్పడు పడితే అప్పుడు వస్తుండేవారని, ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. సంతోషంగా లేకపోయినా కూడా తప్పనిసరిగా అక్కడున్నవాళ్లంతా వ్యభిచారం చేయాల్సి వచ్చేదని శ్వేత వివరించింది. తమ పక్కన పడుకొమ్మని మగవాళ్లు వచ్చి అడిగినప్పుడు చాలా బాధగా అనిపించేదని, కానీ తప్పేది కాదని తెలిపింది. తండ్రితో పాటు చాలామంది తనను తిట్టి, కొట్టేవారు గానీ, తన తల్లి మాత్రం.. నువ్వు ఏమైనా చేయగలవంటూ ప్రోత్సహించేదని చెప్పింది. తాను చాలా మొండిదాన్నని, పాఠశాలలో తన పేదరికం, తక్కువ జాతి కారణంగా అన్నివైపుల నుంచి వివక్ష ఎదుర్కొన్నానని వివరించింది. ఫ్యాక్టరీ కార్మికురాలిగా పనిచేసే తన తల్లి తనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చినట్లు చెప్పింది. శ్వేత కన్న కలలు సాకారం కావడంలో 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ తన వంతు పాత్ర పోషించింది. ముంబై రెడ్లైట్ ప్రాంతంలోని అమ్మాయిలు సామాజిక మార్పు తీసుకురావడానికి సాధకులుగా ముందుకు రావాలన్నదే ఈ సంస్థ ధ్యేయం. క్రాంతి సంస్థ రెండేళ్ల క్రితం శ్వేతను రెడ్లైట్ ప్రాంతం నుంచి తీసుకెళ్లి తమ సంరక్షణలో ఉంచుకుంది.

అక్కడే ఆమె తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని విస్తరించుకుని, క్రమంగా సైకాలజీ అంశంలో కూడా ఆసక్తి పెంచుకుంది. చివరకు అమెరికాలో చదువుకునే అవకాశం లభించడంతో అమితానందానికి గురైంది. ఇతరుల జీవితాలను కూడా ఇది మారుస్తుందని, తన నేపథ్యాన్ని కూడా తాను గౌరవిస్తానని ఆమె తెలిపింది. ఇటీవలే ముంబైలో విమానం ఎక్కి.. అమెరికాకు వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement