anna ramachandraiah
-
‘నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’
సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు అన్నా రామచంద్రయ్య మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అన్నారు. బీసీ అనేవాడు భూములు కొనుగోలు చెయ్యకూడదా.. పైకి ఎదగకూడదా అని ప్రశ్నించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు మెచ్చిన నాయకుడని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ కమిటీలు ఉన్నాయని, అందరం వైఎస్సార్ సీపీకే మద్దతు పలుకుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్లకి ధన్యవాదాలు తెలపాలని వెళితే.. తనను దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి బయటే రాత్రి 11:30 గంటల వరకు నిలబెట్టారన్నారు. ఇలా అనేక అవమానాలకు గురైయ్యామని, అందుకే టీడీపీకి రాజీనామా చేశామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. 15 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలను తాగుబోతులుగా చేస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం దుఖానాలకు లైసెన్సులు కేటాయించారన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ 27 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నా, ఆమరణ నిరాహార దీక్ష వరకు ఆ పార్టీలోనే ఉన్నా. తిరుపతిలోని టీడీపీ ఎమ్మెల్యేలందరి గెలుపుకోసం పనిచేశా. మరి అప్పుడు నేను భూకబ్జాదారుడిగా కనపించలేదా. మరి ఇప్పుడు వైఎస్సార్ సీపీలో చేరితే భూకబ్జాదారుడిగా అయ్యానా. బీసీలే మా వెన్నుముక అన్న చంద్రబాబు, బీసీలను దారుణంగా మోసం చేశారు. పీడీ యాక్ట్ పెట్టేది మీరే, దాన్నితొలగించేది మీరే.. ఇదెక్కడి న్యాయం. కార్యకర్తలతో ఎలా ప్రవర్తించాలో చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదు. నేను ఏ ఒక్క సెంటు భూమి కబ్జాచేశానని నిరూపించండి. నన్ను ఎదుర్కోలేక పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తారా. చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేస్తే ఎలా నమ్మ మంటారని’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేంద్ర నిర్ణయం టీడీపీ సర్కార్‌కు చెంపపెట్టు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో చేర్చేందుకు టీడీపీ చేసిన కుట్రపూరిత ప్రయత్నాన్ని కేంద్రం తిరస్కరించడం బాబు సర్కార్‌కు చెంపపెట్టేనని, ఇది బీసీల విజయమని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ అన్నా రామచంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల రాజకీయాలకు పాల్పడే ఇలాంటి పార్టీలకు కేంద్ర నిర్ణయం గుణపాఠమన్నారు. సంపన్న కులాలను బీసీల్లో చేర్చమని ఏ రాజ్యాంగంలో లేదని, పదవీ వ్యామోహంలో ఉన్న చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీలో ఆమోదముద్ర వేసుకుని కేంద్రానికి పంపడం దగాకోరు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. బీసీ సంఘ నేత బుసగాని లక్ష్మయ్య మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చే నిర్ణయాన్ని కేంద్రం తిప్పికొట్టడం శుభపరిణామన్నారు. మంజునాథ కమిషన్ సిఫారసులను, సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపడం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు అక్కినపల్లి లక్ష్మ య్య, సాకం ప్రభాకర్, రమణా యాదవ్, వెంకటాద్రి యాదవ్, విజయలక్ష్మి, నారాయణ గౌడ్ పాల్గొన్నారు. -
బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది
అనంతపురం న్యూటౌన్ : సామాజికంగా బలంగా ఉన్న వర్గాన్ని బీసీ జాబితాలో చేరుస్తామంటూ ప్రభుత్వం అణగారిన బీసీలను దారుణంగా మోసం చేస్తోందని ఏపీ బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య అన్నారు. శనివారం స్థానిక సాయినగర్‌లోని బీసీ జనసభ కార్యాలయంలో ‘ప్రభుత్వంపై బీసీల పోరుబాట’ పోస్టర్లను విడుదల చేశారు. బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు సుధాకరయాదవ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నేతలు అన్నా రామచంద్రయ్య, యానాదయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అనంత నుంచే తమ పోరుబాటను ప్రారంభించామని,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు. కాపులను బీసీలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాపులతో సన్మానాలందుకోవడం అన్యాయమన్నారు. బీసీల అభిప్రాయాన్ని మన్నించకుండా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలకు బీసీలనే బాధ్యులు చేస్తూ నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంలో ప్రభుత్వ కుట్ర ఉందని విమర్శించారు. ఈనెల 17న మంజునాథ్ కమిషన్‌ను కలవడానికి స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సంఘాల వారు లలితకళాపరిషత్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, అందరూ కలసిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు పవన్‌కుమార్, రజక లింగమయ్య, హరీష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.