రాహుల్ కోసమే రాష్ట్ర విభజన
సాక్షి, తిరుపతి: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సోనియా తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద సోమవా రం భారీ ఎత్తున నిరసన సభ నిర్వహించా రు. వేలాది మంది పాల్గొన్న ఈ సభలో కరుణాకర రెడ్డి మాట్లాడుతూ రామాయణంలో శూర్పణఖలా రెండుప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన సోనియా యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి సీమాంధ్రలో ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సీమాంధ్రకు అన్యాయం జరగకూడదని, తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకు ఆమరణ దీక్షకు ఉద్యుక్తులయ్యారని పేర్కొన్నారు. సీమాంధ్ర కోసం మనందరి ప్రతినిధిగా ఆమె దీక్ష చేపడుతున్నారని తెలిపారు. తెలంగాణ విడిపోతే, గొంతు తడుపుకునేందుకు కూడా మనకు నీళ్లు దొరకవని అన్నారు.
చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు, 8 లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన గాలేరి-నగరి, హంద్రీ-నీవా పథకాలు పాతాళానికి వెళ్లిపోతాయని అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణగా ఖ్యాతి చెందిన ఉభయ గోదావరి జిల్లా ల్లో ఉలవలు పండించుకోవాల్సి ఉంటుందన్నారు. సీమాంధ్రులు రాగి గంజితో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 60 ఏళ్ల నుంచి అధునాతన నగరంగా తీర్చిదిద్దిన హైదరాబాద్‌ను లాక్కొనేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. విభజన జరిగేంత వరకు మౌనం వహించిన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజాగ్రహా న్ని చూసిన తరువాత, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
వీరిద్దరూ తమ పార్టీలకు, పదవులకు రాజీనామా చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొంటే గానీ, ప్రజలు వీరిని క్షమించరని పేర్కొన్నారు. ఢిల్లీ కోటలోని సోనియా చెవులు చిల్లులు పడేలా సీమాంధ్రులు గర్జించాలని పిలుపునిచ్చారు. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ.రమణ మాట్లాడుతూ విభజన జరిగితే నీళ్లతో పాటు, విద్యుదుత్పత్తి కూడా ఆగిపోతుందని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆ నగరాన్ని మరొకరు తీసుకుని వెళుతుంటే మాట్లాడక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి సోనియా శిఖండి అయితే, చంద్రబాబు శకుని అని అభివర్ణించారు.
ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు ఎస్కె.బాబు, ఉమాపతి, రంగాయాదవ్, ముద్రనారాయణ, మోహన్ యాదవ్, నాగయ్య, జ్యోతమ్మ, తిరుమలయ్య ప్రసంగించారు. రాయలసీమ ఆనందరెడ్డి, పార్టీ మహిళా కన్వీనరు కుసుమ, చెంచయ్య యాదవ్, ఆదికేశవ రెడ్డి, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర వందన సమర్పణ చేశారు.