Annarayani Cheruvu
-
‘ఆ చెరువును కాపాడతా’
సాక్షి, మేడ్చల్: నాగారంలోని అన్నరాయని చెరువు పరిరక్షణకు కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి హామీయిచ్చారు. అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శనివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన డ్రైనేజీని మళ్లించి, పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. చెరువు చుట్టూ కట్ట నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటించాలని మంత్రికి సభ్యులు విజ్ఞప్తి చేశారు. గతంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువు అభివృద్ధి పనులకోసం విడుదలయిన నిధుల గురించి ఆరా తీస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అప్పటికప్పుడు నాగారం మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి చెరువును పరిశీలించి పరిరక్షణ సమితి అడిగిన పనుల గురించి వివరాలు తెలియచేయలని ఆదేశించారు. పరిరక్షణ సమితి సభ్యులు ఇచ్చిన అభ్యర్థనపై మేడ్చల్-మల్కాజ్గిరి నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్ స్పందించాలని సూచించారు. మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో మామిడాల ప్రశాంత్, కొమిరెల్లి సుధాకర్ రెడ్డి, బోగి వెంకట్, విజయశేఖర్, వీరేశం, కృష్ణమాచార్యులు, మల్లారెడ్డి, రఘుపతి, శర్మ, వివేక్, శ్రీనివాసరెడ్డి, సుధాకర్, నరసింహులు తదితరులు ఉన్నారు. తర్వాత పరిరక్షణ సభ్యులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి మంత్రికి ఇచ్చిన వినతిపత్రాన్ని అందించారు. -
చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి
సాక్షి, కీసర: కాలుష్యకాసారంగా తయారవుతున్న చెరువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన అవసరం ఉందని కీసర సీఐ నరేందర్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగారం అన్నరాయని చెరువును బాగు చేయాలని అన్నరాయని చెరుపు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కాలనీవాసులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు నగర శివారులో ఉన్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అప్పుడే చెరువులను కాపాడుకోగలగుతామన్నారు. అన్నరాయని చెరువు ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉండేదని, ప్రస్తుతం పూర్తిగా కాలుష్యకాసారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు చెరువు బాగుకోసం చేపడుతున్న కార్యాచరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి చెరువును బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయించాలని చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు మామిడాల ప్రశాంత్, పోడూరి శ్రీనివాస్, రాకేష్, వెంకట్, కృష్ణమాచార్యులు, మహేష్, విజయ శేఖర్, సుధాకర్‌రెడ్డి, సుబ్రమణ్యం, శ్యామసుందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చెరువును బాగు చేయడంతోపాటు, ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు కట్టపై మొక్కలను నాటాలన్నారు. అన్నరాయిని చెరువు బాగుపడేంతవరకు తమ ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తామని సభ్యులు వెల్లడించారు. తమకు మద్దతు తెలిపినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
చెరువు పరిరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ
సాక్షి, నాగారం: అన్నరాయని చెరువును కాపాడాలని కోరుతూ నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి చెరువు వరకు ఈ ర్యాలీ సాగింది. చెరువును రక్షించుకుందామంటూ దారిపొడవునా విద్యార్థులు నినదించారు. చెరువు కట్ట మీద విద్యార్థులను కూర్చొబెట్టి అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అవగాహన కల్పించారు. చెరువును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, నీటి ప్రాముఖ్యాన్ని వివరించారు. గత వారం కూడా ఇదే రోజున ర్యాలీ నిర్వహించామని, వరుసగా రెండో వారం విద్యార్థులు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేశ్, కృష్ణమాచార్యులు, శాంప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 14న చక్రీపురం నుంచి చెరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నాగారం వాసులతో పాటు పర్యావరణ ప్రియులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కొనసాగుతున్న ఆక్రమణలు ఒకపక్క చెరువు పరిరక్షణ కోసం పాటుపడుతుంటే మరోపక్క ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఎస్వీ నగర్ రోడ్డు నంబర్ 7 వద్ద దుండగులు ఆక్రమణలకు తెర తీశారు. దీనిపై కీసర ఎమ్మార్వో, స్థానిక వీఆర్ఓలకు ఫిర్యాదు చేసినట్టు ఎస్వీనగర్ కాలనీ వాసి కొమిరెల్లి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి చెరువును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
అన్నరాయుని చెరువును రక్షించండి
సాక్షి, కీసర: అన్నరాయుని చెరువును పరిరక్షించాలని నాగారం మున్సిపాలిటీలోని పలు కాలనీల వాసులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన మురుగునీటి పైపును మళ్లించాలని కోరారు. నాగారంలోని అన్నరాయుని చెరువును ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా పూడికతీత పనులకు ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. సుందరీకరణ పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. మామిడాల ప్రశాంత్, కె. సుధాకర్‌రెడ్డి, ఎ. శంకర్‌రెడ్డి, కె. శ్రీధర్, పి. వీరేశం, బి. రామకృష్ణ, వెంకట్ బోగి, ప్రవీణ్‌కుమార్, అమరేందర్ రెడ్డి తదితరులు ప్రజావాణికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. (అన్నరాయని చెరువు పరిరక్షణ ర్యాలీ) ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు అన్నరాయుని చెరువును కాపాడుకునేందుకు నాగారం మున్సిపాలిటీ వాసులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థ ప్రతినిధులతో కలిసి చెరువులోని ప్లాస్టిక్ వ్యర్థ్యాలను తొలగించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వృద్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కృష్ణమాచార్యులు, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్, రాకేశ్, సుబ్రహ్మణ్యం తదితరులు స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తిపోశారు. పర్యావరణ స్పృహ ఉన్నవారు ఎవరైనా చెరువు రక్షణకు స్వచ్ఛందంగా తరలి రావాలని నాగారం వాసులు కోరుతున్నారు. -
అన్నరాయని చెరువును కాపాడండి
సాక్షి, నాగారం: తమ గ్రామంలోని అన్నరాయని చెరువును కాపాడాలంటూ మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం వాసులు నినదించారు. ఆదివారం చక్రీపురం కూడలి నుంచి అన్నరాయని చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. నాగారం ఎస్వీ నగర్, విష్ణుపురి కాలనీ, సిద్ధార్థ కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెరువును పరిరక్షించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. చెరువును కాపాడాలంటూ నినదించారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీళ్ల చెరువు కాస్తా కాలుష్య కాసారంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, డ్రైనేజీలను మూసీలోకి మళ్లించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మరోపక్క ఆక్రమణలతో చెరువు కుంచించుకుపోతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువు మాయం కావడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.39.44 లక్షలతో అన్నరాయని చెరువు పునరుద్ధరణ, పూడికతీత పనులకు శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు మేలుకుని అన్నరాయని చెరువు పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నాగారం గ్రామస్తులు కోరుతున్నారు. తమ ఊరి చెరువు కోసం భవిష్యత్తులోని మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.