అన్నరాయిని చెరువు పరిరక్షణ కమిటీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఐ, వివిధ కాలనీవాసులు
సాక్షి, కీసర: కాలుష్యకాసారంగా తయారవుతున్న చెరువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన అవసరం ఉందని కీసర సీఐ నరేందర్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగారం అన్నరాయని చెరువును బాగు చేయాలని అన్నరాయని చెరుపు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కాలనీవాసులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు నగర శివారులో ఉన్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అప్పుడే చెరువులను కాపాడుకోగలగుతామన్నారు. అన్నరాయని చెరువు ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉండేదని, ప్రస్తుతం పూర్తిగా కాలుష్యకాసారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు చెరువు బాగుకోసం చేపడుతున్న కార్యాచరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి చెరువును బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయించాలని చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు మామిడాల ప్రశాంత్, పోడూరి శ్రీనివాస్, రాకేష్, వెంకట్, కృష్ణమాచార్యులు, మహేష్, విజయ శేఖర్, సుధాకర్‌రెడ్డి, సుబ్రమణ్యం, శ్యామసుందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చెరువును బాగు చేయడంతోపాటు, ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు కట్టపై మొక్కలను నాటాలన్నారు. అన్నరాయిని చెరువు బాగుపడేంతవరకు తమ ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తామని సభ్యులు వెల్లడించారు. తమకు మద్దతు తెలిపినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment