Keesara mandal
-
నవవధువు ఆత్మహత్య
కీసర: భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని మౌలాలికి చెందిన త్రినయని (21), అక్షయ్‌కుమార్ (25) ప్రేమించుకొని ఏడు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈసీఐఎల్ కమలానగర్లో ఇంటిని అద్దెకు తీసుకొని కొన్ని నెలలు ఉన్నారు. మూడు నెలల క్రితం రాంపల్లి పరిధిలోని పీసీఆర్ ఎన్‌క్లేవ్‌కు మకాం మార్చారు. కాగా పెళ్లైన కొన్ని నెలల నుంచే భర్త అక్షయ్‌కుమార్, అత్తమామలు జగ్జీవన్, రమాదేవి.. త్రినయనిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో త్రినయని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. విష యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతురాలి తండ్రి రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతికి పడగలెత్తిన నాగరాజు
సాక్షి, మేడ్చల్ జిల్లా : అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. నాగరాజు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ , ఘట్కేసర్, హయత్‌నగర్, శామీర్‌పేట, కూకట్పల్లి, కీసర మండలాల్లో టైపిస్టుగా, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్‌గా పనిచేశారు. దాదాపు రెండేళ్లు కీసరలో పనిచేసిన సందర్భంలో ఆయన అవినీతిపై ఆరోపణలు అంతులేకుం డా ఉన్నాయి. కీసర, కీసర దాయర, చీర్యాల, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, రాంపల్లిదాయర గ్రామాలతోపాటు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మట్టి నుంచి మొదలుకుని రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రైతుబంధు వరకు దేన్ని వదలకుండా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా మారిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేసి రైతుబంధు వచ్చేలా చేశారనే ఆరోపణలున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి అహ్మద్‌గూడలోని అసైన్డ్ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఇంటి యాజమాని వద్ద నుంచి అప్పటి మహిళా వీఆర్ఓ, వీఆర్ఏ సాయంతో రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2011లో శామీర్‌పేట మండలంలో డీటీగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేసి జైలుకు పంపారు. 25 ఏళ్లుగా ఆ భూముల వివాదం.. ప్రస్తుతం నాగరాజు పట్టుబడటానికి కారణమైన రాంపల్లిదాయర రెవెన్యూ పరిధిలోని 53 ఎకరాల భూములకు సంబంధించి షరీఫ్, గాలిజంగ్ తదితర 20 మంది కుటుంబసభ్యులకు, రాంపల్లి దాయర గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు, నర్సింగ్‌రావు, శ్రీనివాస్ మరో 25 మంది కుటుంబాల మధ్య 25 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ సర్వేనంబర్లలోని 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధిం చి ఇరువర్గాల మధ్య భూవివాదంపై హైకోర్టు స్థాయిలో విచారణ కొనసాగుతుండగా, మిగతా భూములకు సంబంధించి కొందరికి ఓఆర్సీలు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రియల్టర్ బ్రోకర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్ తదితరులు భూమార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి కీసర తహసీల్దార్ నాగరాజుతో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్నటు తెలుస్తున్నది. కూకట్‌పల్లిలోనూ అదేతీరు.. కూకట్పల్లి తహసీల్దార్‌గా 2017 జూన్ 20న బాధ్యతలు చేపట్టిన నాగరాజు ఏడాది పాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించారనే ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నంబర్ 91లో చిత్తారమ్మ ఆలయానికి చెందిన భూమిని సర్వే నంబర్ 90 పేరుతో కబ్జాదారులకు రిజిస్ట్రేషన్ చేయటం వివాదాస్పదమైం ది. కూకట్‌పల్లిలో సర్వే నంబర్ 1007 హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సుమారు 340 ఎకరాల భూమిలో ఓ నిర్మాణ సంస్థకు అనుకూలంగా మ్యుటేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని నోటీసులు జారీ చేయటం సైతం అప్పట్లో వివాదాస్పదమైంది. -
చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి
సాక్షి, కీసర: కాలుష్యకాసారంగా తయారవుతున్న చెరువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన అవసరం ఉందని కీసర సీఐ నరేందర్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగారం అన్నరాయని చెరువును బాగు చేయాలని అన్నరాయని చెరుపు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కాలనీవాసులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు నగర శివారులో ఉన్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అప్పుడే చెరువులను కాపాడుకోగలగుతామన్నారు. అన్నరాయని చెరువు ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉండేదని, ప్రస్తుతం పూర్తిగా కాలుష్యకాసారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు చెరువు బాగుకోసం చేపడుతున్న కార్యాచరణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి చెరువును బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయించాలని చెరువు పరిరక్షణ కమిటీ సభ్యులు మామిడాల ప్రశాంత్, పోడూరి శ్రీనివాస్, రాకేష్, వెంకట్, కృష్ణమాచార్యులు, మహేష్, విజయ శేఖర్, సుధాకర్‌రెడ్డి, సుబ్రమణ్యం, శ్యామసుందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చెరువును బాగు చేయడంతోపాటు, ఆహ్లాదకరంగా ఉండేలా చెరువు కట్టపై మొక్కలను నాటాలన్నారు. అన్నరాయిని చెరువు బాగుపడేంతవరకు తమ ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తామని సభ్యులు వెల్లడించారు. తమకు మద్దతు తెలిపినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అన్నరాయుని చెరువును రక్షించండి
సాక్షి, కీసర: అన్నరాయుని చెరువును పరిరక్షించాలని నాగారం మున్సిపాలిటీలోని పలు కాలనీల వాసులు, హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. చెరువును కాలుష్య కాసారంగా మార్చిన మురుగునీటి పైపును మళ్లించాలని కోరారు. నాగారంలోని అన్నరాయుని చెరువును ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా పూడికతీత పనులకు ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. సుందరీకరణ పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. మామిడాల ప్రశాంత్, కె. సుధాకర్‌రెడ్డి, ఎ. శంకర్‌రెడ్డి, కె. శ్రీధర్, పి. వీరేశం, బి. రామకృష్ణ, వెంకట్ బోగి, ప్రవీణ్‌కుమార్, అమరేందర్ రెడ్డి తదితరులు ప్రజావాణికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. (అన్నరాయని చెరువు పరిరక్షణ ర్యాలీ) ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు అన్నరాయుని చెరువును కాపాడుకునేందుకు నాగారం మున్సిపాలిటీ వాసులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థ ప్రతినిధులతో కలిసి చెరువులోని ప్లాస్టిక్ వ్యర్థ్యాలను తొలగించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వృద్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కృష్ణమాచార్యులు, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్, రాకేశ్, సుబ్రహ్మణ్యం తదితరులు స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తిపోశారు. పర్యావరణ స్పృహ ఉన్నవారు ఎవరైనా చెరువు రక్షణకు స్వచ్ఛందంగా తరలి రావాలని నాగారం వాసులు కోరుతున్నారు. -
అన్నరాయని చెరువును కాపాడండి
సాక్షి, నాగారం: తమ గ్రామంలోని అన్నరాయని చెరువును కాపాడాలంటూ మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం వాసులు నినదించారు. ఆదివారం చక్రీపురం కూడలి నుంచి అన్నరాయని చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. నాగారం ఎస్వీ నగర్, విష్ణుపురి కాలనీ, సిద్ధార్థ కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెరువును పరిరక్షించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. చెరువును కాపాడాలంటూ నినదించారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీళ్ల చెరువు కాస్తా కాలుష్య కాసారంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, డ్రైనేజీలను మూసీలోకి మళ్లించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మరోపక్క ఆక్రమణలతో చెరువు కుంచించుకుపోతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువు మాయం కావడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.39.44 లక్షలతో అన్నరాయని చెరువు పునరుద్ధరణ, పూడికతీత పనులకు శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు మేలుకుని అన్నరాయని చెరువు పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని నాగారం గ్రామస్తులు కోరుతున్నారు. తమ ఊరి చెరువు కోసం భవిష్యత్తులోని మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
డిజిటల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
-
డిజిటల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలోని డిజిటల్ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.10 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్‌గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2250 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటోతోపాటు బైకును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. -
'గ్రేటర్'లో విలీనం కాని పంచాయతీలకు పోలింగ్
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని 22 పంచాయతీల ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 22 పంచాయతీల పరిధిలో 573కిపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు మార్గం సుగమంకాకపోవడంతో ఈ గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ మండలంలోని నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, హైదర్షాకోట్, నేక్నాంపూర్, హిమాయత్‌సాగర్, బండ్లగూడ, కిస్మత్పూర్, ఖానాపూర్, వట్టినాగులపల్లి, కోకాపేట్, పీరంచెర్వు, గండిపేట్ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. శంషాబాద్ మండలంలోని శంషాబాద్... కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లి, నిజాంపేట్, కొంపల్లి, దూలపల్లి, ప్రగతినగర్.. శామీర్‌పేట మండలంలోని జవహర్‌నగర్.. కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.