సీఎం సంతబేరం
* విపక్ష ఎమ్మెల్యేలపై ప్రలోభాల వల
* రెండు మాసాలుగా విస్తృత కసరత్తు
* చివరకు 4 వికెట్లతో సరి
* రెండు మంత్రి పదవులు.. ఒకరికి కేసుల్లో, ‘ఇతరత్రా’ సాయం
* టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్‌ఖాన్, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
* కర్నూలు, కడప టీడీపీ వర్గాల్లో భగ్గుమన్న అసంతృప్తి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ప్రలోభాలు కొద్దిగా ఫలించాయి.. ఎడతెగని ఒత్తిళ్లు కొద్దిమేర పనిచేశాయి.. గత కొన్ని నెలలుగా అనేక మాయోపాయాలతో అధికార పార్టీ అవిశ్రాంతంగా జరిపిన ప్రయత్నాలు స్వల్పంగా నెరవేరాయి. మంత్రిపదవులు.. డబ్బు.. కాంట్రాక్టులు.. లెసైన్సులు.. కేసుల ఎత్తివేత వంటి ఎన్నో గుక్కతిప్పుకోనివ్వని ఆఫర్లతో అధికారపక్షం రెండునెలలుగా విస్తృత కసరత్తుచేసినా చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తలొగ్గారు. ఎన్ని ప్రలోభాలు కనిపిస్తున్నా తట్టుకుని నిలిచిన మిగిలిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాలలో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు చేరిన ఆనందం అధికారపార్టీలో కొద్దిసేపు కూడా నిలవలేదు. కర్నూలు, కడప దేశం వర్గాలలో అసంతృప్తి భగ్గుమంది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నలుగురు ఎమ్మెల్యేలను సామదానభేద దండోపాయాలతో లొంగదీసుకోగలిగారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సోమవారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబునాయుడు వారికి పచ్చ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విలువలకు నీళ్లొదిలి ఎమ్మెల్యేలను ఆఫర్లతో ఆకర్షించడం, పార్టీ ఫిరాయించేలా నిస్సిగ్గుగా ప్రోత్సహించడం రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపరిచే పనిలో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. కోట్ల రూపాయలను కుమ్మరించడానికి సిద్ధపడ్డారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వత్తిళ్లు తీసుకొచ్చారు. అనేక ఇతర ఆఫర్లతో పాటు భూమానాగిరెడ్డి, జలీల్ ఖాన్లకు మంత్రిపదవులిచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వియ్యంకుడైన విద్యాసంస్థల యజమాని ఎదుర్కొంటున్న కేసుల విషయంలో సాయపడతామని హామీ ఇవ్వడంతో పాటు భారీగా నగదు, కాంట్రాక్టులిచ్చేందుకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ రూ. 25 కోట్ల డబ్బు, భారీఎత్తున కాంట్రాక్టులు ఇచ్చేందుకు కూడా తెలుగుదేశం వర్గాలలో వినిపిస్తోంది.
తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు... ప్రలోభాలు...
హామీలు అమలు చేయకపోవడం, తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత పెల్లుబుకడంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసం గత కొద్ది కాలంగా అధికారపార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీయడాన్ని పనిగా పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. 22నెలలుగా విచ్చలవిడిగా అవినీతి కుంభకోణాలతో ఆర్జించిన డబ్బును వెదజల్లి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అందులోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా మాట్లాడుతూ హామీలిస్తూ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో ముందు ‘చినబాబు’ తర్వాత ‘పెదబాబు’ మాట్లాడుతున్నారని తెలుగుదేశం వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
పొరుగు రాష్టంలో పార్టీకి చాపచుట్టే దుస్థితి దాపురించడం, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తకు కుమారుడు లోకేష్ ‘రాజకీయ పనితనం’ తేటతెల్లం కావడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగి దిక్కుతోచని స్థితిలోనే ఏపీలో పార్టీ ఫిరాయింపులను నిస్సిగ్గుతో ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఫిరాయించడమంటే కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడమేనని సత్యవాక్కులు వల్లించిన బాబు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎలా ఆకర్షిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి, అక్రమాలతో పీకల్లోతు కూరుకుపోయి మసకబారిన పరువు ప్రతిష్టలను, భ్రష్టు బట్టి పాతాళంలోకి దిగజారిపోతున్న పార్టీని ఎలాగైనా బతికి బట్టకట్టించుకునేందుకు బాబు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు రకరకాల ఆఫర్లను ఎరవేసి ఫిరాయింపులకు ద్వారాలు తెరిచారు. అవినీతి సంపాదనతో లక్షల కోట్లను కూడబెట్టిన ఆయన కోట్ల రూపాయలను ప్రతిపక్ష నేతలకు వెదజల్లడానికి కోటరీ ద్వారా కుయుక్తులు కొనసాగిస్తున్నారని వినిపిస్తోంది.
‘ఆకర్ష్’కు లొంగింది నలుగురే..
హామీలను అమలుచేయని టీడీపీ సర్కారుకు కాలం చెల్లడం ఖాయమన్న విమర్శలు పెరుగుతుండడంతో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను కేంద్ర మంత్రి నేతృత్వంలో అయిదుగురితో కమిటీని నియమించి వారి ద్వారా నిత్యం రాయబేరాలు కొనసాగిస్తూ వచ్చారు. కులాలపరంగా, మతపరంగా, ప్రాంతాలవారీగా ఎవరినైనా విడగొట్టడంలో, వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన చంద్రబాబు, ఆయన కోటరీలోని కీలకనేతలు గత కొద్దికాలంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. ఎవరెన్ని ప్రలోభాలకు విశ్వప్రయత్నాలు చేసినా నలుగురు మినహా వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. తాము ప్రలోభాలకు లొంగే రకం కాదని నిరూపించుకున్నారు. మంత్రి పదవులు, నగదు, కాంట్రాక్టులు ఇస్తామని ఎన్నెన్ని ఆశలు చూపినా... కేసులు పెడతామని, వ్యాపారాలను దెబ్బతీస్తామని తీవ్ర హెచ్చరికలు పంపినా లెక్కచేయని నేతలుగా నిలిచారు. చివరకు రాజధానిలో రూ.కోట్లు విలువచేసే భూములు ఇస్తామని, వ్యాపారాలకు వీలు కల్పిస్తామని ఊరిస్తున్నా మీ పప్పులేమీ తమ వద్ద ఉడకవని తేల్చి చెప్పారనేది సమాచారం.
రామసుబ్బారెడ్డి కుటుంబం అసంతృప్తి
జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే అంశంపై మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మల ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం కరవైందని టీడీపీ నాయకులంటున్నారు. ‘‘మేం పార్టీనే నమ్ముకున్నాం. కుటుంబ సభ్యుల ప్రాణాలను పోగొట్టుకున్నాం. ఎందరో కార్యకర్తల కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. అవిటివాళ్లు అయిన వారున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి ఇందుకు కారకులు దేవగుడి కుటుంబం అన్నది అందరికీ తెలుసు. అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవడంకన్నా దారుణం మరొకటి ఉంటుందా. ఇదేనా మీరు మాకు ఇచ్చే ప్రాధాన్యం’’ అని రామసుబ్బారెడ్డి కుటుంబం ప్రశ్నలకు బాబుకు నోట మాట రాలేదనేది విశ్వసనీయ సమాచారం. ఎంతోకాలంగాక మీకు ఇదే చెబుతూ వస్తున్నాం. ఇక మీ ఇష్టం అని అయిష్టంగానే రామసుబ్బారెడ్డి కుటుంబీకులు బాబు వద్ద నుంచి వచ్చేశారని తెలిసింది. విజయవాడలో రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. టీడీపీ గురించి, చంద్రబాబు గురించి భూమా నాగిరెడ్డి కుటుంబం ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో గుర్తు చేసుకోవాలని కర్నూలుజిల్లా టీడీపీ నాయకులంటున్నారు.
శిల్పా సోదరులు ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారని వినిపిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు మంత్రి పదవి ఆశచూపడం ఇప్పటిది కాదు. ఎన్నికలు అయిన నాటి నుంచి చర్చలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తాము ఏమైపోయినా ఫర్వాలేదనుకునేలా పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షపార్టీ నుంచి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమను పట్టించుకోవడంలేదని టీడీపీ ముఖ్య నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. స్థానికంగా, క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ప్రతిపక్షంగా వ్యవహరించిన వారితో ఇప్పటికిప్పుడు కలిసి పనిచేయడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.