నెలకో టీకాతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం కలిగించే వార్త ఇది. వారికి రోజువారీ మాత్రలేసుకునే అవసరం నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. అమెరికాకు చెందిన వివ్ హెల్త్‌కేర్ సంస్థ ఒక ఇంజెక్షన్‌తో నెలరోజుల పాటు యాంటీ రెట్రోవైరల్ చికిత్స అందించే కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉండగా రోజువారీ మందుల పుణ్యమా అని వీరికి ప్రాణాపాయం గణనీయంగా తగ్గింది. అయితే రోగులు మందులు తీసుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది.
ఈ నేపథ్యంలో వివ్ హెల్త్‌కేర్ సంస్థ యాంటీ రెట్రో వైరల్ మందులను ఇంజెక్షన్ల ద్వారా అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో కాబోటెగ్రావిర్, రిల్పీవిరైన్ మందులతో తయారైన ఇంజెక్షన్లు 4 నుంచి 8 వారాల పాటు మాత్రలు మింగాల్సిన అవసరం లేకుండా చేస్తుందని గుర్తించారు. అవసరాన్ని బట్టి ఈ ఇంజెక్షన్‌లోని మందుల మోతాదులను మార్చుకోవచ్చు అని వివ్ హెల్త్‌కేర్ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ మార్గోలిస్ తెలిపారు.
తాము దాదాపు 300 మందిపై జరిపిన అధ్యయనంలో రెండు నెలలకు ఒకసారి ఇంజెక్షన్లు అందుకున్న 95 శాతం మందిలో వైరస్ నియంత్రణలో ఉందని, రోజూ మాత్రలు తీసుకున్న వారిలో ఇది 91 శాతం మాత్రమే ఉందని డేవిడ్ తెలిపారు. నెలకోసారి ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 94 శాతం నియంత్రణలో ఉన్నట్లు చెప్పారు. దాదాపు 96 వారాల తర్వాత కూడా రెండు నెలలకోసారి ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 94 శాతం మందిలో వైరస్ నియంత్రణలోనే ఉన్నట్లు తెలిసిందని వివరించారు. అన్నీ సవ్యంగా సాగితే 2019 నాటికల్లా ఈ ఇంజెక్షన్లు అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా.